టెక్ మహీంద్రాలో వెయ్యిమందికి ఉద్వాసన
బెంగళూరు: కీలకమైన మార్కెట్లలో మారుతున్న పరిణామాలతో.. సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న దేశీ ఐటీ దిగ్గజాలు గణనీయంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ తదితర సంస్థల బాటలోనే తాజాగా సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ టెక్ మహీంద్రా ఈ నెలలో సుమారు 1,000 మందికి ఉద్వాసన పలికింది. పనితీరు ఆశించినంతగా లేని సిబ్బందిని తప్పించే ప్రక్రియ ఏటా జరిగేదేనని, ప్రస్తుత తొలగింపులు కూడా ఆ కోవకి చెందినదేనని సంస్థ ప్రతినిధి తెలిపారు.
గతేడాది డిసెంబర్ 31 నాటికి కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,17,095గా ఉంది. సాఫ్ట్‌వేర్ విభాగంలో 80,895 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆటోమేషన్, కొంగొత్త టెక్నాలజీల రాక, ప్రధాన మార్కెట్లలో స్థానికులకే ఉద్యోగాలివ్వాలంటూ పెరుగుతున్న రక్షణాత్మక ధోరణులు మొదలైనవి భారత ఐటీ సంస్థలపై ఒత్తిడి పెంచుతున్నాయి. తాజా పరిస్థితులు సుమారు 10–15 సంవత్సరాల అనుభవం ఉన్న మధ్య స్థాయి సిబ్బందిపై ఎక్కువగా ప్రతికూల ప్రభావం చూపవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. వారు కొత్త నైపుణ్యాలు అలవర్చుకునేందుకు ఆసక్తి చూపకపోతుండటమే ఇందుకు కారణమని చెబుతున్నాయి.