
ట్వీట్టర్ చేతికి మ్యాజిక్ పోనీ
డీల్ విలువ 15 కోట్ల డాలర్లు !
న్యూయార్క్: మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్వీట్టర్, లండన్‌కు చెందిన మెషీన్ లెర్నింగ్ స్టార్టప్ ‘మ్యాజిక్ పోన్’ను కొనుగోలు చేసింది. ఈ స్టార్టప్ కొనుగోలు కారణంగా తమ మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అంశాల్లో తమ సామర్థ్యాలు మరింతగా విస్తరిస్తాయని ట్వీట్టర్ తెలిపింది. 2014 జూలైలో మ్యాడ్‌బిట్స్ ఇమేజ్ సెర్చ్ స్టార్టప్‌ను, గత ఏడాది జూన్‌లో వెట్‌ల్యాబ్ మెషీన్ లెర్నింగ్ స్టార్టప్‌ను కొనుగోలు చేశామని ట్వీట్టర్ సీఈఓ జాక్ డార్సే.. ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
తాజాగా మ్యాజిక్ పోన్‌ను కొనుగోలు చేయడం... మెషీన్ లెర్నింగ్‌పై పెట్టిన ఇతర పెట్టుబడులకు అదనమని వివరించారు. తమ లైవ్, వీడియోలను మరింత పటిష్టం చేసేందుకు మ్యాజిక్ పోనీ టెక్నాలజీ ఉపయోగపడుతుందని తెలిపారు. మ్యాజిక్ పోనీ ఉద్యోగులను మెషీన్ లెర్నింగ్ అంశంపై పరిశోధనలు చేసే ట్వీట్టర్ కోర్టెక్స్ సంస్థలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. మ్యాజిక్ పోనీ సంస్థను కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక వివరాలను డార్సే వెల్లడించలేదు. అయితే ఈ డీల్ విలువ 15 కోట్ల డాలర్లు ఉంటుందని టెక్‌క్రంచ్‌డాట్‌కామ్ వెల్లడించింది.