సినీ నటి నిధి అగర్వాల్‌తో అమిత్, మార్కెటింగ్ డైరెక్టర్ కోమల్ అగర్వాల్ (కుడి)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏఆర్‌ఎల్ బ్రాండ్ పేరుతో టైర్లు, ట్యూబుల తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ అగర్వాల్ రబ్బర్ మరో ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ సమీపంలోని సదాశివపేట వద్ద 40 ఎకరాల్లో రూ.225 కోట్లతో దీనిని నెలకొల్పుతోంది. 2020 ఏప్రిల్ నాటికి ఈ ప్లాంటు సిద్ధమవుతుందని అగర్వాల్ రబ్బర్ సీఎండీ అమిత్ కుమార్ అగర్వాల్ సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. తొలుత 80 టన్నుల రోజువారీ ఉత్పత్తి సామర్థ్యంతో ప్రారంభించి, 300 టన్నుల స్థాయికి తీసుకు వెళతామన్నారు. అంతర్గత వనరుల ద్వారా రూ.100 కోట్ల పెట్టుబడిని సమకూరుస్తున్నామని, కొత్త యూనిట్ ద్వారా 500 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారాయన. ప్రస్తుతం కంపెనీ ఉద్యోగుల సంఖ్య 1,700.
మూడేళ్లలో రూ.1,000 కోట్లు..: కంపెనీకి పటాన్‌చెరు, బొలారం, సదాశివపేట వద్ద ప్లాంట్లున్నాయి. 1986లో ప్రారంభమైన ఈ సంస్థ టూవీలర్లు, త్రీవీలర్లు, తేలికపాటి ట్రక్కులు, వ్యవసాయ యంత్రాల టైర్లు, ట్యూబులను ఉత్పత్తి చేస్తోంది. 2000 ఏడాది నుంచి ఏఆర్‌ఎల్ బ్రాండ్‌తో మార్కెట్లోకి వచ్చింది. భారత్‌లో మిలిటరీ విమానాలు, హెలికాప్టర్లకు ట్యూబులను సరఫరా చేస్తున్న ఏకైక కంపెనీ ఇదే. రోజువారీ తయారీ సామర్థ్యం 70 టన్నులు. టర్నోవర్ రూ.300 కోట్లు. ఇది మూడేళ్లలో రూ.1,000 కోట్లకు చేరుతుందని అమిత్ ధీమా వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతం 50 దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. కొత్త ప్లాంటుతో నూతన మార్కెట్లకు విస్తరిస్తాం. విదేశాల నుంచి 50% ఆదాయం వస్తోంది’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment