
బ్యాంకులకు 3 రోజులు సెలవు
* ఆది, సోమవారం ఆన్‌లైన్ చెల్లింపులు పనిచేస్తాయి
* ఈ రెండు రోజులు కేవలం పన్ను చెల్లింపు శాఖలే పనిచేస్తాయి
* పండగల దృష్ట్యా ఏటీఎంల్లో నగదు కొరత లేకుండా చర్యలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వరుస సెలవు దినాలతో సామాన్యులకు మూడు రోజుల పాటు సాధారణ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండటం లేదు. ఆదివారానికి తోడు సోమవారం ఉగాది కావడం, మంగళవారం నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో ఆది, సోమవారాలు సెలవు దినాలైనప్పటికీ ఆన్‌లైన్ చెల్లింపులు చేసుకోవడానికి ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్ సేవలను ఆర్‌బీఐ కొనసాగిస్తోంది. పన్నుల చెల్లింపులను స్వీకరించే బ్యాంకు శాఖలు మాత్రం ఆది, సోమవారాలు యధావిధిగా పనిచేస్తాయని ఆర్‌బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. కానీ మంగళవారం మాత్రం అన్ని బ్యాంకింగ్ సేవలు, ఆన్‌లైన్ లావాదేవీలు అందుబాటులో ఉండవు.
ప్రత్యేక చర్యలు
వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా బ్యాంకులు తగు చర్యలు తీసుకుంటున్నాయి. ఉద్యోగులకు జీతాలు పడే సమయం, పండగలను దృష్టిలో పెట్టుకొని ఏటీఎం కేంద్రాల్లో అధిక మొత్తాలను ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ బ్యాంకు అధికారి ఒకరు చెప్పారు. దీనికి తోడు ఆది, సోమవారాల్లో ఆన్‌లైన్ లావాదేవీలకు అనుమతి ఉండటంతో ఈ వరుస సెలవులు ప్రజలకు అంతగా ఇబ్బంది కల్గించకపోవచ్చన్నారు.
ఖజానా కార్యకలాపాలు యథాతథం..
మరోవైపు .. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రావల్సిన వసూళ్లు, జరపాల్సిన అత్యవసర చెల్లింపులకు సంబంధించి ఆది, సోమవారాల్లో కూడా ఖజానా కార్యాలయం, జిల్లా ఖజానా కార్యాలయాలు, సబ్ ఖజానా కార్యాలయాలు, పే అకౌంట్ కార్యాలయాలు పనిచేయనున్నాయి. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అజేయ కల్లం శనివారం అంతర్గత సర్క్యులర్ జారీ చేశారు. దీని ప్రకారం 31వ తేదీనాడు అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కార్యాలయాలన్నీ పనిచేయనున్నాయి. ఈ రెండు రోజులు రాష్ట్ర ఖజానా కార్యాలయాల నుంచి ఆస్తుల కల్పన వ్యయాలకు చెల్లింపులు చేయనున్నారు.
రెవెన్యూ వ్యయానికి చెందిన చెల్లింపులను పూర్తిగా నిలుపుదల చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పును ఆస్తుల కల్పన వ్యయానికి వినియోగించాల్సి ఉంది. అయితే అప్పు పాతిక వేల కోట్ల రూపాయలను చేసినప్పటికీ ఆస్తుల కల్పనకు కేవలం 11 వేల కోట్ల రూపాయలనే వెచ్చించింది. ఈ నేపథ్యంలో చివరి రెండు రోజుల్లో ఇతర చెల్లింపులను నిలుపుదల చేసి ఆస్తుల కల్పనకు బిల్లులు చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది.