ఉబర్ క్యాబ్ చార్జీలు తగ్గాయి!
దేశంలోని పది నగరాల్లో ఉబర్ క్యాబ్ చార్జీలు 22 శాతం వరకు తగ్గాయి. ఓలా క్యాబ్స్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోడానికి ఈ చర్య తీసుకున్నారు. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉబర్ క్యాబ్‌లు ఎక్కితే కిలోమీటరుకు రూ. 5 చెల్లిస్తే సరిపోతుంది. ఇండోర్, నాగ్‌పూర్ లాంటి నగరాల్లో 9 శాతం వరకు తగ్గగా, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్ లాంటి నగరాల్లో 22 శాతం వరకు తగ్గించారు. ఈ రెండు నగరాల్లో ఇంతకుముందు బేస్ ఫేర్ రూ. 40 ఉండగా, దాన్ని రూ. 25కు తగ్గించారు. అలాగే కిలోమీటరుకు చార్జీ కూడా రూ. 8 నుంచి రూ. 7కు తగ్గింది. విశాఖపట్నం, నాగ్‌పూర్, ఇండోర్, అహ్మదాబాద్ నగరాల్లో అయితే కిలోమీటరుకు రూ. 5 చెల్లిస్తే సరిపోతుంది.
వీటితో పాటు పుణె, అజ్మీర్, మంగళూరు, తిరువనంతపురం నగరాల్లో కూడా ఉబర్ చార్జీలు తగ్గాయి. తమ సేవలు మరింతమందికి అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతోనే ధరలు తగ్గించినట్లు ఉబర్‌గో అనే బ్లాగులో తెలిపారు. ఓలా క్యాబ్స్ ప్రస్తుతం మైక్రో అనే పేరుతో కిలోమీటరుకు రూ. 6 వంతునే క్యాబ్ సేవలను అందిస్తోంది. రోజుకు మొత్తం రైడ్ల సంఖ్యలో ఇప్పటికే తాము ఉబర్ క్యాబ్‌లను దాటేసినట్లు ఓలా చెబుతోంది. ఓలా వాళ్ల మైక్రో సర్వీసులు హైదరాబాద్ సహా 13 నగరాల్లో అందుబాటులో ఉంది.