ఆమె అత్యాచారానికి గురైందా?
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఓ మహిళా ఎగ్జిక్యూటివ్ పై ఉబర్ కారు డ్రైవర్ చేసిన నిర్వాకం ఆ కంపెనీ సీఈవోకు ఇప్పటికీ సందేహాంగానే మిగిలిపోయిందట. నిజంగా ఆ మహిళ అత్యాచారానికి గురైందా అంటూ ఉబర్ సీఈవో ట్రావిస్ కలానిక్ పలుమార్లు సందేహాలు వ్యక్తంచేసేవారని ఫారిన్ మీడియా రిపోర్టు చేసింది. అయితే సీఈవో సందేహాలు తీర్చడానికి అత్యాచారానికి గురైన బాధితురాలి మెడికల్ రికార్డులు సొంతం చేసుకున్న ఆసియా పసిఫిక్ బిజినెస్ హెడ్ ఎరిక్ అలెగ్జాండర్ పై ఈ కంపెనీ యాజమాన్యం వేటు వేసింది.
కంపెనీలో పెరుగుతున్న లైంగిక వేధింపులు, అనైతిక కార్యకలాపాలపై విచారణ సాగిస్తున్న క్రమంలో బాధితురాలి మెడికల్ రిపోర్టులను ఈయన పొందారు. రికార్డులను సొంతం చేసుకున్న అలెగ్జాండర్ వీటిని ట్రావిస్ కలానిక్ కు, ఎమిల్ మైఖేల్, మరో సీనియర్ లీడర్లకు చూపించారు. రికార్డుల చూసినప్పటికీ వీరు, మహిళ అత్యాచార విషయంలో మళ్లీ సందేహాలే వ్యక్తంచేసినట్టు రీకోడ్ రిపోర్టు చేసింది.
అలెగ్జాండర్ పొందిన ఈ రికార్డులు చాలా కీలకమైనవని, ఆయన ఏడాది పాటు ఈ రికార్డులను తన దగ్గరే ఉంచుకున్నట్టు తెలిసింది. 2014లో శివ్ కుమార్ యాదవ్ అనే ఉబర్ డ్రైవర్, ఢిల్లీలో ఓ మహిళ రైడర్ పై అత్యాచారం చేశాడు. ఫాస్ట్ ట్రాక్ ట్రయల్ అనంతరం 2015లో సెషన్ కోర్టు ఆయనకు జీవిత ఖైదు శిక్షను విధించింది. ఈ ఘటన అనంతరం కొన్ని రోజుల పాటు ఢిల్లీలో ఉబర్ వంటి రైడింగ్ యాప్స్ పై నిషేధం విధించారు. అయితే ఈ ఘటనపై ఎప్పడికప్పుడూ కలానిక్, మైఖేల్ చర్చించేవారని తెలిసింది. ఈ ఘటన భారత్ లోని తమ ప్రత్యర్థి ఓలాకు అనుకూల అంశమని అనుకునే వారని సంబంధిత వర్గాలు చెప్పాయి.
డ్రైవర్ కు శిక్ష విధించిన అనంతరం కూడా కలానిక్, తమ స్నేహితులు, సహచరులతో సందేహాలు వ్యక్తంచేసే వారని బ్లూమ్ బర్గ్ కూడా రిపోర్టు చేసింది. కంపెనీలో జరుగుతున్న లైంగిక వేధింపుల, అనైతిక కార్యకలాపాలపై ప్రస్తుతం రెండు లా సంస్థలు పెర్కిన్స్ కోయి, కోవింగ్టన్ అండ్ బుర్లింగ్ లు లోతుగా విచారణ జరుపుతున్నాయి. పెర్కిన్స్ విచారణలో బయటపడిన లైగింక వేధింపులు, అనైతిక ప్రవర్తన సాగిస్తున్న 20 మంది ఉద్యోగులను ఉబర్ యాజమాన్యం తొలగించింది. మరో 100 మందిపై విచారణ సాగిస్తోంది. అయితే ఎరిక్ అలెగ్జాండర్ ఇక తమ కంపెనీలో ఉద్యోగి కాదంటూ తేల్చిచెప్పిన యాజమాన్యం, మరింత స్పందించడానికి నిరాకరించింది.