డిసెంబర్‌కల్లా 8,000కు నిఫ్టీ..!
ముంబై: ఈ ఏడాది డిసెంబర్‌కల్లా ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీ 8,000 పాయింట్ల మైలురాయిని తాకుతుందని స్విస్ బ్రోకరేజీ దిగ్గజం యూబీఎస్ తాజాగా అంచనా వేసింది. దేశీ ఈక్విటీలపై బుల్లిష్‌గా ఉన్నామని, భవిష్యత్‌లో మార్కెట్లలో సానుకూల ధోరణి నెలకొంటుందని భావిస్తున్నామని యూబీఎస్ విశ్లేషకులు గౌతమ్.సి చెప్పారు.
దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవకాశాలపై ఇన్వెస్టర్లు ఆశావహంగా ఉన్నారని, దీంతో ప్రీమియం విలువలకు మార్కెట్లు చేరతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. సమయానుకూల(సైక్లికల్) ఆర్థిక రికవరీను సూచిస్తూ గణాంకాలు వెలువడుతున్నాయని, వెరసి 2014 చివరికల్లా నిఫ్టీ 8,000 పాయింట్ల లక్ష్యాన్ని చేరుకుంటుందని నివేదికలో అంచనా వేశారు. ఇప్పటికే ప్రధాని మోడీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం పలు సంస్కరణలకు తెరలేపిందని నివేదికలో యూబీఎస్ పేర్కొంది.
వీటిని మార్కెట్ పట్టించుకోలేదని వ్యాఖ్యానించింది. బిజినెస్‌కు స్నేహపూర్వక వాతావరణం కల్పించడం, కార్మిక సంస్కరణలు, పర్యావరణ, అటవీ అనుమతులకు ఈ క్లియరెన్స్ సౌకర్యాలు, ప్రస్తుత గనుల్లో ఉత్పత్తి పెంపునకు ఆటోమేటిక్ అనుమతులు తదితర పలు చర్యలను నివేదికలో యూబీఎస్ ప్రధానంగా ప్రస్తావించింది. ఇవికాకుండా రైల్వే, బీమా, రక్షణ రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు(ఎఫ్‌డీఐలు) తెరలేపడం, రియల్టీ, ఇన్‌ఫ్రా రంగాల ట్రస్ట్‌లకు వీలు కల్పించడం వంటి అంశాలను కూడా పేర్కొంది.