ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మాదిరిగానే భారత్ లో అతిపెద్ద సిమెంట్ కంపెనీగా పేరున్న అల్ట్రాటెక్ మార్కెట్ విశ్లేషకుల అంచనాలను అధిగమించి లాభాల్లో దూసుకెళ్లింది. నాలుగో త్రైమాసిక ఫలితాల్లో నికర లాభాలు 11శాతం జంప్ అయి రూ.681.4 కోట్లగా నమోదయ్యాయి. ఈ త్రైమాసికంలో రెవన్యూ కూడా 4.7 శాతం వృద్ధి చెంది, రూ.6,503.66 కోట్లగా ఫలితాలను చూపించాయి. గతేడాది ఈ త్రైమాసికంలో ఈ కంపెనీ రెవెన్యూ రూ.6,211 కోట్లగా ఉన్నాయి. దేశీయంగా ఈ కంపెనీ అమ్మకాల 15 శాతం వృద్ధిన్ని చూపించాయి.
ఈ త్రైమాసికంలో బూడిద రంగు సిమెంట్ అమ్మకాలు 13.20 మిలియన్ టన్నులు ఉండగా, తెలుపు రంగు సిమెంట్ అమ్మకాలు 3.85 మిలియన్ టన్నులుగా ఉన్నాయని ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ తెలిపింది. నిర్వహణ లాభాలు(వడ్డీరేట్లు, తరుగుదలలు, రుణాలు పోగా మిగిలింది) 3.2 శాతం పెరిగి, 1,352.7 కోట్లగా నమోదయ్యాయి. నిర్వహణ ఖర్చు, ఇంధన ధరలు తగ్గుదల ఈ కంపెనీకి బాగా కలిసివచ్చింది. అల్ట్రాటెక్ ఫలితాలు వెల్లడయ్యాక ఈ కంపెనీ సేర్లు లాభాల బాట పట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో ఈ షేరు 6.75 పాయింట్లు లాభపడి 3277.60 వద్ద ముగిసింది.