అనిశ్చితి కొనసాగితే ఔన్స్ 1,300 డాలర్లు..!
పసిడిపై నిపుణుల అంచనా
న్యూయార్క్ / న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లలో అనిశ్చితే సమీప భవిష్యత్తులో పసిడికి మార్గదర్శకంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు కొనసాగితే సమీప కాలంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ నెమైక్స్ మార్కెట్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 1,300 డాలర్లకు చేరుతుందన్నది పలువురి విశ్లేషణ. దీనితో పాటు అమెరికా ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన, ఫెడ్ ఫండ్స్ రేటుపై నిర్ణయం వంటి అంశాలూ పసిడి ధరపై సమీప కాలంలో ప్రభావం చూపుతాయని ఈ రంగంలో నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, వరుసగా రెండవ వారంలో కూడా పసిడి ఎగువ బాటలోనే పయనించింది. నెమైక్స్‌లో శుక్రవారంతో ముగిసిన వారంలో చూస్తే... ధర దాదాపు 40 డాలర్లు ఎగసి 1,260 డాలర్లకు చేరింది. ఇది 13 నెలల గరిష్ట స్థాయి. అమెరికాలో ఉపాధి కల్పనకు సంబంధించి వచ్చిన ఫిబ్రవరి డేటా.. కొంత బాగున్నప్పటికీ, పూర్తిస్థాయి సంతృప్తి కలిగించకపోవడం నెమైక్స్‌లో పసిడి కాంట్రాక్ట్ పరుగుకు కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
దేశీయ మార్కెట్‌లోనూ లాభాలే...
బడ్జెట్‌లో పుత్తడి ఆభరణాలపై 1 శాతం ఎక్సైజ్ సుంకాన్ని విధించడాన్ని నిరసిస్తూ బంగారు వర్తకుల మూడు రోజుల సమ్మె బుధవారం నుంచి ప్రారంభమైంది. 7వ తేదీ వరకూ ఈ సమ్మె కొనసాగనుంది. ఈ సమ్మె కారణంగా దేశంలోని పలు పట్టణాల్లో అమ్మకాలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో వారంలో కేవలం రెండు రోజుల అమ్మకాలు మాత్రమే జరిగాయి. కాగా అటు అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో... కొనుగోళ్ల మద్దతు వెరసి వరుసగా రెండవ వారమూ పసిడి లాభాల బాటన పయనించింది. ముంబై ప్రధాన స్పాట్ మార్కెట్‌లో పసిడి 99.9 ప్యూరిటీ 10 గ్రాముల ధర రూ.220 ఎగసి 29,450కి చేరింది. 99.5 ప్యూరిటీ ధర సైతం ఇదే స్థాయిలో రూ. 220కి ఎగసింది. ఇక వెండి కేజీ ధర రూ. 240 ఎగసి రూ.37,650 వద్దకు చేరింది.