
న్యూఢిల్లీ: మార్చి త్రైమాసికంలో యూనియన్‌బ్యాంకు నష్టాలు మరింత పెరిగి రూ. 2,583 కోట్లకు చేరాయి. పెట్టుబడులు ఆవిరైపోవడం, మొండిపద్దులకు కేటాయింపులు ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో నష్టాలు మరింత పెరిగాయని బ్యాంకు తెలిపింది. గతేడాది ఇదే కాలంలో బ్యాంకు రూ. 108 కోట్ల నష్టం నమోదు చేసింది. 2017–18 మార్చి త్రైమాసికంలో తమ పెట్టుబడుల్లో దాదాపు 1,120 కోట్ల రూపాయలు తరిగిపోయాయని బ్యాంకు తెలిపింది. దీంతో పాటు కేటాయింపులు 2,444 కోట్లరూపాయల నుంచి రూ. 5,668కోట్లకు పెరిగిపోయాయి. ఇదే కాలంలో స్లిపేజ్‌లు 10,043 కోట్లకు చేరాయి. బ్యాంకు ఆదాయం రూ. 9771 నుంచి 9,597 కోట్ల రూపాయలకు పడిపోయింది.
స్థూల ఎన్‌పీఏలు 11.17 శాతం నుంచి 15.73 శాతానికి, నికర ఎన్‌పీఏలు 6.57 శాతం నుంచి 8.42 శాతానికి ఎగబాకాయి. డిపాజిట్లలో 8 శాతం వృద్ధి నమోదయింది. అంతర్జాతీయ అడ్వాన్సులు 4 శాతం పెరిగాయి. దేశీయ అడ్వాన్సుల్లో 5.9 శాతం పెరుగుదల కనిపించింది. మొత్తం 2017–18 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు రూ. 5,247 కోట్ల నష్టాన్ని మూటకట్టుకొంది. అయితే ఆదాయం మాత్రం స్వల్పంగా పెరిగి 37,738 కోట్లకు చేరింది.