మొండిబాకీల చికిత్సకు ఆర్డినెన్స్
♦ బ్యాంకింగ్ నియంత్రణ చట్ట సవరణల ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర
♦ ఉక్కు విధానానికి లైన్‌క్లియర్
♦ రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పేరుకుపోయిన మొండిబకాయిల సమస్య పరిష్కారం దిశగా.. బ్యాంకింగ్ రంగ నియంత్రణ చట్టంలో సవరణల ఆర్డినెన్స్ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఆర్డినెన్స్ వివరాలు వెల్లడి కాలేదు. బ్యాంకింగ్ రంగంపై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ .. మరిన్ని వివరాలు వెల్ల డించడానికి నిరాకరించారు. ‘ఏదైనా ప్రతిపాదనను రాష్ట్రపతి పరిశీలనకు పంపినప్పుడు అది ఆమోదం పొందేదాకా వివరాలు బహిర్గతం చేయకూడదనే సంప్రదాయం ఉంది.
రాష్ట్రపతి ఆమోదం లభించిన తర్వాత వివరాలు వెల్లడించడం జరుగుతుంది‘ అని ఆయన చెప్పారు. పార్లమెంటు సమావేశాలు ప్రస్తుతం జరగడం లేదు కాబట్టి... చట్ట సవరణలకు ఆర్డినెన్స్‌ను ప్రతిపాదించడం జరిగిందని, దీనికి రాష్ట్రపతి తక్షణమే ఆమోదముద్ర వేయొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. గురువారం అధికారిక ప్రకటన రావొచ్చని పేర్కొన్నాయి. భారీ మొండిబాకీల సమస్య గరిష్టంగా 50 కంపెనీలకు పరిమితమై ఉండొచ్చని జైట్లీ గతంలో వ్యాఖ్యానించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దాదాపు రూ. 6 లక్షల కోట్ల మేర మొండి బకాయిలు పేరుకుపోయిన సంగతి తెలిసిందే.
35 ఏ సెక్షన్ సవరణ..: సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం– ఆర్డినెన్స్ మార్గంలో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 35ఏను సవరించాలన్న ప్రతిపాదనను క్యాబినెట్ ఆమోదించింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే– రుణ ఎగవేతదారుల నుంచి నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ)ను రికవరీ చేసుకోవడానికి బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యక్షంగా ఆదేశాలు ఇవ్వవచ్చు. ప్రజా ప్రయోజనాలు, డిపాజిటర్లకు సంబంధించి బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చే అధికారాలను మాత్రమే ప్రస్తుతం 35ఏ ఆర్‌బీఐకి కల్పిస్తోంది.
బ్యాంక్ అధికారులకు భద్రత: మొండిబకాయి సమస్యల పరిష్కారం కోసం తీసుకునే చర్యలపై... విచారణ సంస్థల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుందోన్న భయాలను బ్యాంకింగ్ అధికారుల నుంచి తొలగించేందుకు కూడా సవరణ చట్టం దోహదపడనుంది. ఈ దిశలో వీలు కల్పించడానికి ఆర్‌బీఐ ఒక ప్రత్యేక రెగ్యులేటరీ విభాగాలను ఏర్పాటు చేసే అధికారం ఆర్‌బీఐకి లభిస్తుంది. నిర్దిష్ట అకౌంట్‌కు నిర్దిష్ట చర్యను తీసుకునే అధికారం కూడా ఈ చట్ట సవరణతో ఆర్‌బీఐకి లభిస్తుంది. ప్రస్తుత మార్గదర్శకాలు, నిబంధనల సడలించే వీలుసైతం ఆర్‌బీఐకి లభిస్తుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఉక్కు విధానం: దేశీయంగా ఉక్కు రంగం ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే దిశగా కేంద్ర కేబినెట్ జాతీయ ఉక్కు విధానం 2017కి ఆమోదముద్ర వేసింది. అలాగే, మొండిబకాయిల (ఎన్‌పీఏ) సమస్యను పరిష్కరించే క్రమంలో బ్యాంకింగ్ రంగ నియంత్రణ చట్టానికి సవరణలు చేసేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయడంతో పాటు బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ‘జాతీయ ఉక్కు విధానం 2017కి కేబినెట్ ఆమోదించింది‘ అని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఒకవైపు బలహీన డిమాండ్ మరోవైపు పెరిగిపోతున్న ముడి వస్తువుల ధరల సమస్యలతో ఉక్కు రంగం సతమతమవుతున్న నేపథ్యంలో నూతన ఉక్కు విధానం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశీయంగా కోకింగ్ కోల్ సరఫరా పెంచాలని, 2030–31 నాటికి ఉక్కు ఉత్పత్తి 300 మిలియన్ టన్నుల స్థాయికి పెంచుకోవాలని ఇందులో నిర్దేశించుకున్నారు. 2015–16లో ముడి ఉక్కు ఉత్పత్తి 89.77 మిలియన్ టన్నులుగా నమోదైంది. ప్రభుత్వ సంస్థలు తమ అవసరాలకు దేశీయంగా తయారైన ఇనుము, ఉక్కు ఉత్పత్తులకే ప్రాధాన్యమివ్వాలని కొత్త పాలసీలో ప్రతిపాదించారు.
3 హోటల్స్ నుంచి ఐటీడీసీ నిష్క్రమణ...
భోపాల్, భరత్‌పూర్, గువాహటిలోని మూడు హోటల్స్‌లో ఇండియన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐటీడీసీ) వాటాల విక్రయ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం అశోక్ భోపాల్, బ్రహ్మపుత్ర అశోక్ హోటల్స్‌లో ఐటీడీసీ తనకున్న 50% వాటాలను మధ్యప్రదేశ్, అసోం రాష్ట్రాల ప్రభుత్వాలకు విక్రయించనుంది.