21 శాతం తగ్గిన యునెటైడ్ బ్యాంక్ లాభం
కోల్‌కతా: యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి 21 శాతం క్షీణించింది. గత క్యూ1లో రూ.66 కోట్లుగా ఉన్న బ్యాంక్ నికర లాభం ఈ క్యూ1లో రూ.52 కోట్లకు తగ్గింది. వడ్డీ రేట్లు తగ్గించడం, అధిక కేటాయింపులు కారణంగా నికర లాభం తగ్గిందని యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,004 కోట్ల నుంచి రూ.2,897 కోట్లకు తగ్గిందని బ్యాంక్ ఎండీ, సీఈఓ పి. శ్రీనివాస్ చెప్పారు. నికర వడ్డీ ఆదాయం మాత్రం రూ.596 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ.628 కోట్లకు పెరిగిందని వివరించారు.
మొత్తం కేటాయింపులు రూ.508 కోట్ల నుంచి రూ.526 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. అయితే మొండి బకాయిలకు కేటాయింపులు రూ.225 కోట్ల నుంచి రూ.176 కోట్లకు తగ్గాయని తెలిపారు. స్థూల మొండి బకాయిలు 10.49 శాతం(రూ.7,097 కోట్లు) నుంచి 9.57 శాతానికి(6,533 కోట్లకు), నికర మొండి బకాయిలు 7.23 శాతం(రూ.4,667 కోట్లు) నుంచి 6.30 శాతానికి(రూ.4,091 కోట్ల) తగ్గాయని పేర్కొన్నారు. నికర వడ్డీ మార్జిన్‌లు 2.09 శాతం నుంచి 2.2 శాతానికి పెరిగాయని శ్రీనివాస్ తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేర్ 4 శాతం వృద్ధితో రూ.26కు పెరిగింది.