మాల్యా.. ఇక తప్పుకోండి..
- యూఎస్‌ఎల్ చైర్మన్‌గా వైదొలగాలని డయాజియో సూచన
- తిరస్కరించిన మాల్యా
న్యూఢిల్లీ: అనుబంధ సంస్థలకు నిధుల మళ్లించారన్న ఆరోపణపై యునెటైడ్ స్పిరిట్స్ (యూఎస్‌ఎల్) చైర్మన్, డెరైక్టర్ హోదాల నుంచి తప్పుకోవాలంటూ విజయ్ మాల్యాకు డయాజియో సంస్థ సూచించింది. దీనికి మాల్యా అంగీకరించని పక్షంలో ఆయన్ను తొలగించే అంశాన్ని షేర్‌హోల్డర్లకు ముందు ఉంచనున్నట్లూ స్పష్టం చేసింది.
శనివారం బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ డిమాండ్‌ను మాల్యా తోసిపుచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవన్నారు. మాల్యా సారథ్యంలోని యూబీ గ్రూప్ నుంచి యూఎస్‌ఎల్‌లో బ్రిటన్ కంపెనీ డయాజియో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, 2013-14 ఆర్థిక సంవత్సరంలో యూఎస్‌ఎల్ భారీగా రూ. 4,489 కోట్ల మేర నష్టాలను ప్రకటించడంతో కంపెనీ ఆర్థిక పరిస్థితులపై డయాజియో విచారణ జరిపింది.
ఈ నివేదిక ప్రకారం 2010-2013 మధ్య కాలంలో యూఎస్‌ఎల్ నుంచి వివిధ యూబీ గ్రూప్ కంపెనీలకు, ఆర్థిక సంక్షోభంలో ఉన్న కింగ్‌ఫిషర్ యిర్‌లైన్స్‌కు ఇచ్చినట్లుగా చూపిన రుణాల లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు వెల్లడైంది.