ఉద్యోగప్రాప్తి‘మస్తు’..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత కొన్ని సంవత్సరాలుగా స్థబ్దుగా ఉన్న జాబ్ మార్కెట్లో తిరిగి కదలిక మొదలయ్యింది. ఆశావాహక వాతావరణంతో కంపెనీలు రిక్రూట్‌మెంట్స్‌ను మొదలు పెడుతున్నాయి. మాన్‌స్టర్, నౌకరీ డాట్‌కామ్, టీమ్‌లీజ్ తాజా నివేదికలకు తోడు, ఐఎస్‌బీ, ఐఎంటీ వంటి బిజినెస్ మేనేజ్‌మెంట్ కాలేజీల రిక్రూట్‌మెంట్స్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కొత్త ఉద్యోగాల కల్పనలో గతేడాదితో పోలిస్తే 14% వృద్ధి నమోదైనట్లు మాన్‌స్టర్ ఎంప్లాయిమెంట్ ఇండెక్స్ పేర్కొంది.
ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 64 శాతం కంపెనీలు నియామకాలు చేపడుతున్నట్లు నౌకరీ డాట్ కామ్ సర్వేలో వెల్లడయ్యింది. మొత్తం 800 నియామక సంస్థలను సంప్రదించగా 64% మంది కొత్త నియామకాలు చేపడుతున్నామని చెప్పగా, గతేడాది ఇది కేవలం 54%గా ఉంది. ఎన్నికల అనంతరం కొత్తగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వం తీసుకునే చర్యలతో ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందన్న నమ్మకంతో కంపెనీలు ముందుగానే నియామకాలు చేపడుతున్నట్లు టీమ్‌లీజ్ తన సర్వేలో పేర్కొంది.
జీతాల్లో పెరుగుదల అంతంతే..
రిక్రూట్‌మెంట్, ప్లేస్‌మెంట్ చేసే కంపెనీలు పెరుగుతున్నా, జీతాలు మాత్రం అంతగా పెరగడం లేదు. చాలాచోట్ల జీతాలు గతేడాదిలాగే స్థిరంగా ఉండగా, మరికొన్ని చోట్ల 5 నుంచి 10 శాతం వృద్ధి కనిపిస్తోంది. గడిచిన సంవత్సరం నియామకాల కోసం మా క్యాంపస్‌కి 56 కంపెనీలు రాగా, ఈ ఏడాది 80కిపైగా వచ్చినట్లు హైదరాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (ఐఎంటీ) డెరైక్టర్ డాక్టర్.వి.పాండురంగారావు తెలిపారు.
కాని విద్యార్థులు అందుకున్న సగటు వార్షిక జీతం గతేడాదిలాగానే రూ.6 లక్షలుగానే ఉందన్నారు. అదే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విషయానికి వస్తే ఇప్పటి వరకు క్యాంపస్ ఇంటర్వ్యూలు 90 శాతం వరకు పూర్తయ్యాయి. గతేడాది కంటే కంపెనీల సంఖ్య పెరిగాయని, అలాగే వార్షిక సగటు వేతనం కూడా స్వల్పంగా రూ.17 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు పెరిగినట్లు ఐఎస్‌బీ అధికారి పేర్కొన్నారు. గతంతో పోలిస్తే జీతాలు 5 నుంచి 15% పెంచి తీసుకోవడానికి 70% కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నట్లు నౌకరీ డాట్‌కామ్ సర్వేలో వెల్లడయ్యింది.
స్టార్ట్‌అప్ జోరు...
విద్యార్థులు అనుభవం, పేరు ప్రఖ్యాతులు కలిగిన సంస్థల కంటే స్టార్ట్‌అప్ కంపెనీలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారట. ముఖ్యంగా ఆన్‌లైన్, ఈ కామర్స్, టూరిజం, ఐటీ, ఎడ్యుకేషన్ రంగాల్లో వస్తున్న కంపెనీలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఐఎస్‌బీలో గతేడాది 32 స్టార్ట్‌అప్ కంపెనీలు పాల్గొని 26 ఆఫర్లు ఇవ్వగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 46 కంపెనీలు పాల్గొని 48 ఆఫర్లను ఇచ్చాయి. కొత్త తరహా వ్యాపారం అయ్యి ఉండి, వెంచర్ క్యాపిటల్ సంస్థలు ఇన్వెస్ట్ చేసి ఉంటే కొంత జీతం తక్కువైనా రిస్క్ చేయడానికి విద్యార్థులు సిద్ధపడుతున్నట్లు పాండురంగారావు పేర్కొన్నారు.