భౌగోళిక రాజకీయ అంశాలే కీలకం..! | US-China trade talks among 7 factors that may guide market next week | Sakshi
Sakshi News home page

భౌగోళిక రాజకీయ అంశాలే కీలకం..!

Published Mon, Mar 4 2019 5:11 AM | Last Updated on Mon, Mar 4 2019 5:14 AM

US-China trade talks among 7 factors that may guide market next week - Sakshi

ముంబై: భారత వైమానిక దళ పైలట్‌ అభినందన్‌ వర్ధ్‌మాన్‌ను వాఘా సరిహద్దు దగ్గర పాక్‌ అప్పగించిన నేపథ్యంలో గతవారం దేశీ స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. పైలట్‌ను తిరిగి అప్పగించడంతో భారత్‌–పాకిస్తాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొంత వరకు తగ్గి దాయాదుల మధ్య కమ్ముకున్న యుద్థ మేఘాలు సమసిపోయినట్లేనని మార్కెట్‌ వర్గాలు భావించాయి. ఈ అంశానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన కీలక వ్యాఖ్యలు కూడా మార్కెట్‌ను నిలబెట్టాయి.

అణ్వాయుధ శక్తి కలిగిన ఇద్దరు దాయాదుల మధ్య సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు త్వరలోనే సమసిపోయే అవకాశం ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్నది ఉగ్రవాద శిబిరాలపై దాడులు తప్పించి.. ఇరు దేశాల మధ్య యుద్ధంకాదన్న స్పష్టతతో వారంతంనాడు మార్కెట్లు సానుకూల స్పందించినప్పటికీ, యుద్ధ భయాలు మాత్రం ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ భయాలు మరింత పెరిగినా, యుద్ధ వాతావరణమే మరోసారి కనిపించినా రానున్నరోజుల్లో ఒక్కసారిగా భారీ పతనం ఉండేందుకు అవకాశం ఉందని సామ్కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమీత్‌ మోడీ అన్నారు.  

అంతర్జాతీయ అంశాలపై దృష్టి..
ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన డొనాల్డ్‌ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ మధ్య భేటీ గురువారం ఎలాంటి సత్ఫలితం లేకుండానే ముగిసింది. ఉత్తర కొరియాపై విధించిన ఆంక్షలన్నీ ఎత్తివేయాలని కిమ్‌ కోరగా ఇందుకు తాము అంగీకరించలేదని ట్రంప్‌ వెల్లడించారు. ఇక్కడి వాతావరణం అయోమయంగానే ఉన్నప్పటికీ.. మరోవైపు అమెరికా–చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తోంది. ఇరు దేశాల తుది వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా అధికారులు సిద్ధంచేస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ కథనం ప్రచురించింది. రెండు దేశాల చర్చల్లో అద్భుత పురోగతి ఉందని వైట్‌హౌస్‌ ఆర్థిక సలహాదారు లారీ కుడ్లో వ్యాఖ్యానించడం మార్కెట్‌కు సానుకూల అంశంగా ఉంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ అంశాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని మార్కెట్‌ వర్గాలు సూచిస్తున్నాయి.

మొదలైన ఎన్నికల వేడి..
సార్వత్రిక ఎన్నికలు అనుకున్న సమయానికే జరుగుతాయని కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రధాన అధికారి సునీల్‌ అరోరా స్పష్టం చేసిన నేపథ్యంలో మార్కెట్లో ఎన్నికల వేడి మొదలుకానుందని యస్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ అమర్‌ అంబానీ అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున సూచీల్లో ఒక భారీ పెరుగుదల ఉండనుందని అంచనావేస్తున్నట్లు వెల్లడించారు. ఇక వచ్చే వారంలో షెడ్యూల్‌ విడుదలయ్యే అంచనాలు ఉన్న కారణంగా సూచీల్లో అధిక స్థాయి ఒడిదుడుకులకు అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.  

గణాంకాలపై దృష్టి..
ఈఏడాది ఫిబ్రవరికి సంబంధించిన నికాయ్‌ ఇండియా సర్వీసెస్‌ పీఎంఐ మార్చి5న (మంగళవారం) వెల్లడికానుంది. డిసెంబర్‌ నెల యూఎస్‌ బ్యాలెన్స్‌ ఆఫ్‌ ట్రేడ్‌ డేటా బుధవారం వెల్లడికానుండగా.. ఆదేశ జనవరి వాణిజ్య గణాంకాలు గురువారం రానున్నాయి. శుక్రవారం చైనా బ్యాలెన్స్‌ ఆఫ్‌ ట్రేడ్‌ వెల్లడికానుండగా.. అదేరోజున యూఎస్‌ నాన్‌ ఫామ్‌ పేరోల్స్‌ గణాంకాలు విడుదలకానున్నాయి. ఇక ఇతర అంతర్జాతీయ ప్రధాన అంశాల్లో.. వడ్డీ రేట్లకు సంబంధించి యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ (ఈసీబీ) తన నిర్ణయాన్ని మార్చి 7న (గురువారం) ప్రకటించనుంది.  

ముడిచమురు ధరల ప్రభావం..
గతవారంలో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర దిగొచ్చింది. ఫ్యూచర్స్‌ రేట్లు 2 శాతం తగ్గాయి. అయితే, గతేడాది డిసెంబర్‌లో నమోదైన 50.5 డాలర్ల వద్ద నుంచి చూస్తే 15% పెరిగాయి. ఒపెక్‌ ఉత్పత్తి కోత కారణంగా ధరల్లో ఈస్థాయి పెరుగుదల నమోదైందని నార్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ కమోడిటీ విశ్లేషకులు సకినా అన్నారు.

15–నెలల గరిష్టస్థాయికి ఎఫ్‌ఐఐల పెట్టుబడి...
ఈ ఏడాది ఫిబ్రవరిలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) జోరుగా పెట్టుబడులు పెట్టారు. రూ.17,220 కోట్లను దేశీయ స్టాక్‌ మార్కెట్లో నికరంగా వెచ్చిం చినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడైంది. 2017 నవంబర్‌లో రూ.19,728 కోట్ల నికర పెట్టుబడి పెట్టిన ఎఫ్‌పీఐలు. ఆ తరువాత గతనెల్లోనే భారీగా నిధులు కుమ్మరించారు.

నేడు మార్కెట్‌కు సెలవు
మహాశివరాత్రి సందర్భంగా మార్చి4న (సోమవారం) దేశీ స్టాక్‌ ఎక్సే్ఛంజీలు సెలవు ప్రకటించాయి. తిరిగి మంగళవారం(5న) యథాప్రకారం మార్కెట్‌ ప్రారంభమవుతుంది. ఈ వారం ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితంకానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement