టీసీఎస్ దెబ్బ...ఐటీ పరిశ్రమను తాకనుందా?
ముంబై : అతిపెద్ద సాప్ట్ వేర్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసుపై యూఎస్ కోర్టు వేసిన 6 వేల కోట్ల జరిమానా వివాదం దేశంలోని మిగతా ఐటీ పరిశ్రమలపై ప్రభావం చూపనుందా అంటే మార్కెట్ విశ్లేషకులు అవుననే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రభావంతో హెల్త్ కేర్ బిజినెస్ లో ఎక్కువ కీర్తి ప్రతిష్టలు కలిగన టీసీఎస్ పై భారత్ లో నమ్మకం కోల్పోయే ప్రమాదముందని అభిప్రాయాలు వస్తున్నాయి. ప్రస్తుత క్లిష్టమైన రాజకీయ వాతావరణంలో, భారత కంపెనీలు తేలికైన పద్ధతులు ఎంచుకుని ఇబ్బందులు పడుతున్నాయన్నారు. వివిధ ప్రాంతాల్లో భారత ఐటీ రంగం లీగల్ గా చాలా సమస్యలకు గురవుతుందని సాప్ట్ వేర్ నేషనల్ అసోసియేషన్ తెలిపింది. రహస్య వాణిజ్య దావా కేసులో కోర్టు టీసీఎస్ పై భారీ జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో సోమవారం నాటి మార్కెట్లో టీసీఎస్ షేర్లు మార్కెట్లో కుప్పకూలుతున్నాయి.
హెల్త్ రంగానికి సాప్ట్ వేర్ ను అందించడంలో ఎపిక్ సిస్టమ్స్ కీలక పాత్ర పోషిస్తోంది. టీసీఎస్ ఆదాయంలో ఎక్కువ శాతం లైఫ్ సైన్స్, హెల్త్ కేర్ నుంచే వస్తుంది. ఈ క్రమంలో టీసీఎస్ పై ఇలాంటి తీర్పు వెలువడటం కంపెనీ కీర్తి ప్రతిష్టలకు భంగంతో పాటు, పోటీదారులు మరింత అనుమానాలు రేకెత్తించే ప్రమాదముందని బెండర్ సాముల్ తెలిపారు. ఆస్పత్రులకు, క్లినిక్ లకు ఐటీ సర్వీసులను అందించడంలో మార్కెట్లో ఎక్కువ అభివృద్ధి ఉందని, ఈ పోటీల్లో టీసీఎస్ ముందంజలో నిలబడేందుకు చాలా ప్రయత్నాలు చేసిందని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. వివిధ ప్రాంతాల్లో భారత ఐటీ రంగం లీగల్ గా చాలా సమస్యలకు గురవుతుందని సాప్ట్ వేర్ నేషనల్ అసోసియేషన్ తెలిపింది. కానీ ముందుకంటే ఇవి ఎక్కువేమీ కాదని పేర్కొంది.
మరోవైపు ఈ వివాదాన్ని టీసీఎస్ తేలిగ్గా తీసుకుంది. యూఎస్ హెల్త్ కేర్ సంస్థ ఎపిక్ సిస్టమ్స్ మేథో సంపత్తి హక్కుల ఉల్లంఘనను టీసీఎస్ ఖండించింది. యూఎస్ జ్యురీ ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్తామని ప్రకటించింది. టాటా గ్రూప్ లోని ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అమెరికా అనుబంధ సంస్థ టాటా అమెరికా ఇంటర్నేషనల్ కార్ప్ పై 'ఎపిక్ సిస్టమ్స్' దాఖలు చేసిన ట్రేడ్ సీక్రెట్ దొంగిలింపు కేసులో విస్కాన్సిస్ లోని యూఎస్ ఫెడరల్ కోర్టు 940 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 6 వేల కోట్లు) భారీ జరిమానా విధించిన సంగతి తెలిసిందే.