టీసీఎస్‌కు 6,000 కోట్ల జరిమానా | TCS fined by america federal court | Sakshi
Sakshi News home page

టీసీఎస్‌కు 6,000 కోట్ల జరిమానా

Published Sun, Apr 17 2016 1:06 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

టీసీఎస్‌కు 6,000 కోట్ల జరిమానా - Sakshi

టీసీఎస్‌కు 6,000 కోట్ల జరిమానా

టాటా గ్రూప్‌నకు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), టాటా అమెరికా ఇంటర్నేషనల్ కార్ప్ సంస్థలపై విస్కాన్సిన్‌లోని అమెరికా ఫెడరల్ కోర్టు దాదాపు రూ.6,000 కోట్ల (940 మిలియన్ డాలర్లు) జరిమానా విధించింది. అమెరికాకు చెందిన హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ‘ఎపిక్ సిస్టమ్స్’ తాలూకు సాఫ్ట్‌వేర్ తస్కరణ కేసులో కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.  కాగా, దీనిపై తాము ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేస్తామని టీసీఎస్ పేర్కొంది.
 
వాషింగ్టన్: టాటా గ్రూప్‌కు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), టాటా అమెరికా ఇంటర్నేషనల్ కార్ప్ సంస్థలపై విస్కాన్సిన్‌లోని అమెరికా ఫెడరల్ కోర్టు దాదాపు రూ.6,000 కోట్ల (940 మిలియన్ డాలర్లు) జరిమానా విధించింది. అమెరికాకు చెందిన హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ‘ఎపిక్ సిస్టమ్స్’ తాలూకు సాఫ్ట్‌వేర్ తస్కరణ కేసులో కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. ముంబైలోని ‘టీసీఎస్’, తన అమెరికా అనుబంధ కంపెనీ ‘టాటా అమెరికా ఇంటర్నేషనల్ కార్ప్’ సంస్థలు కలసి ఎపిక్ సిస్టమ్స్‌కు 240 మిలియన్ డాలర్లను చెల్లించాలని ఆదేశించింది. అలాగే నష్టపూర్వక జరిమానా కింద మరో 700 మిలియన్ డాలర్లు కూడా కట్టాలని స్పష్టంచేసింది.

ఎపిక్ సిస్టమ్స్ సంస్థ... తన సాఫ్ట్‌వేర్ తస్కరించారని పేర్కొంటూ టీసీఎస్, టాటా అమెరికా ఇంటర్నేషనల్ కార్ప్ సంస్థలపైన 2014 అక్టోబర్‌లో మాడిసన్‌లోని యూఎస్ జిల్లా కోర్టులో కేసు దాఖలు చేసింది. ఇందులో ఈ రెండు టాటా గ్రూప్ కంపెనీలు తమకు సంబంధించిన రహస్య విషయాలను, వాణిజ్య అంశాలను, కీలక సమాచారాన్ని, పత్రాలను, ఇతర డేటాను దొంగిలించిందని ఎపిక్ సిస్టమ్స్ పేర్కొంది. ‘మా అనుమతి లేకుండానే మా సాఫ్ట్‌వేర్‌ను టీసీఎస్ ఉద్యోగులు ఉపయోగించారు. టీసీఎస్ కంపెనీ ఈ సాఫ్ట్‌వేర్‌ను తన హాస్పిటల్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్ ‘మెడ్ మంత్ర’ ప్రొడక్ట్ అభివృద్ధికి కూడా వినియోగించుకుంది’’ అని ఎపిక్ సిస్టమ్స్ పేర్కొంది. ఒక టీసీఎస్ ఉద్యోగి తమకు సంబంధించిన 6,477 డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేశాడని పేర్కొంది.  
 
 ఊహించని తీర్పు ఇది.. అప్పీలు చేస్తాం: టీసీఎస్
 కాగా ఈ తీర్పు తాము ఊహించలేదని టీసీఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘విచారణ సందర్భంగా ఎపిక్ సిస్టమ్స్ అందజేసిన ధ్రువపత్రాలు చూశాం. వాటి ఆధారంగా ఇలాంటి తీర్పు వస్తుందని మేమైతే ఊహించలేదు. ఎపిక్ సిస్టమ్స్ యూజర్ వెబ్ పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసిన డాక్యుమెంట్ల ద్వారా మేం ఎలాంటి ప్రయోజనం పొందలేదు. దీనిపై మేం ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేస్తాం’’ అని టీసీఎస్ పేర్కొంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement