సహజ వాయువు ధర 2.48 డాలర్లకు కట్
రెండేళ్లలో ధర తగ్గటం ఇది ఐదోసారి
న్యూఢిల్లీ: సహజ వాయువు యూనిట్ (మిలియన్ బ్రిటీష్ థర్మల్ యూనిట్– ఎంబీటీయూ) ధర స్వల్పంగా తగ్గి 2.48 డాలర్లకు చేరింది. ఇప్పటిదాకా ఈ రేటు యూనిట్‌కు 2.50 డాలర్లుగా ఉంది. కేంద్ర చమురు శాఖలో భాగమైన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ), రిలయన్స్ ఇండస్ట్రీస్ క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌కు ఏప్రిల్ 1 నుంచి ఆరు నెలల పాటు ఈ ధర వర్తిస్తుంది. సహజ వాయువు ధరలు తగ్గినందువల్ల ముడి వనరు రేటు..
అంతిమంగా రిటైల్ ధర (గృహాలకు పైపుల ద్వారా సరఫరా అయ్యే గ్యాస్, ఇతరత్రా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ మొదలైనవి) తగ్గుతాయి. అలాగే విద్యుదుత్పత్తికి, ఎరువుల తయారీకి కూడా చౌకగా ముడివనరు లభిస్తుంది. కాగా గడిచిన రెండేళ్లలో గ్యాస్ రేటు తగ్గడం ఇది ఐదోసారి. 2014 అక్టోబర్‌లో కేంద్రం ఆమోదించిన ఫార్ములా ప్రకారం గ్యాస్ ధరలను ఆరు నెలలకోసారి సవరిస్తున్నారు. అప్పట్లో గ్యాస్ రేటు 4.66 డాలర్లుగా ఉండగా.. తాజాగా 2.48 డాలర్లకు తగ్గింది. 2016 అక్టోబర్ 1న చివరిసారిగా గ్యాస్ రేటు 18 శాతం తగ్గించారు. గ్యాస్ రేటు డాలరు తగ్గితే ఓఎన్‌జీసీ లాంటి ఉత్పత్తి కంపెనీలకు వార్షికంగా రూ. 4,000 కోట్ల మేర ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మరోవైపు, సముద్ర లోతుల్లోని సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి వెలికితీసే ప్రత్యామ్నాయ ఇంధనాల ధరను మాత్రం యూనిట్‌కు 5.3 డాలర్ల నుంచి 5.56 డాలర్లకు పెంచుతున్నట్లు పీపీఏసీ తెలిపింది.