
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ తీవ్ర ఒడిదుడుకులకు గురవుతోంది. గత కొద్ది రోజులుగా 70–69 మధ్య కదులుతోంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో బుధవారం 28 పైసలు తగ్గి 69.71 వద్ద ముగిసింది. రూపాయి బలహీనపడ్డం వరుసగా ఇది మూడవరోజు. అమెరికా–చైనా వాణిజ్య ఉద్రిక్తతలు, దేశీయ ఈక్విటీ మార్కెట్ల పతనం వంటి అంశాలు రూపాయి పతనానికి తోడవుతున్నాయి.
వారం క్రితమే 70పైన ముగిసిన రూపాయి అటు తర్వాత క్రమంగా బలపడినా... తిరిగి బలహీన బాటలో నడుస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే తిరిగి రూపాయి సమీప పక్షం రోజుల్లోనే 72ను చూసే అవకాశం ఉందని విశ్లేషణ. అక్టోబర్ 9న రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది.