
ప్రధానంగా ఇంధన, మెటీరియల్స్ రంగాలు బలపడటంతో మంగళవారం యూఎస్ మార్కెట్లు జంప్‌చేశాయి. మరోపక్క.. అనారోగ్య సమస్యలతో ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి హెల్త్‌కేర్ దిగ్గజం మోడర్నా రూపొందిస్తున్న వ్యాక్సిన్ యాంటీబాడీలను అభివృద్ధి చేయడంలో సఫలమవుతున్నట్లు వెలువడిన వార్తలు ఇన్వెస్టర్లకు హుషారునిచ్చాయి. దీంతో డోజోన్స్ 557 పాయింట్లు(2.15 శాతం) జంప్‌చేసి 26,643 వద్ద ముగిసింది. ఈ బాటలో ఎస్‌అండ్‌పీ 42 పాయింట్లు(1.35 శాతం) పుంజుకుని 3,198 వద్ద నిలవగా.. నాస్‌డాక్ 58 పాయింట్లు(1 శాతం) ఎగసి 10,489 వద్ద స్థిరపడింది. అయితే అలబామా, ఫ్లోరిడా, నార్త్‌కరోలినా తదితర రాష్ట్రాలలో కొత్త కేసులు భారీగా పెరిగినట్లు వెలువడిన వార్తల కారణంగా మార్కెట్లు పలుమార్లు ఆటుపోట్లను ఎదుర్కొన్నట్లు నిపుణులు తెలియజేశారు.
ఫార్మా ప్లస్‌లో
కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలలో ఇమ్యూనిటీని పెంచుతున్నట్లు వెల్లడించడంతో మోడర్నా ఇంక్ షేరు 18 శాతం దూసుకెళ్లింది. ఈ ప్రభావంతో రీజనరాన్ 4 శాతం, జాన్సన్ అండ్ జాన్సన్ 2 శాతం చొప్పున ఎగశాయి. క్యూ2లో బ్యాంకింగ్ దిగ్గజం జేపీ మోర్గాన్ రికార్డ్ స్థాయిలో దాదాపు 34 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించినప్పటికీ నికర లాభం సగానికి తగ్గి 4.7 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. దీంతో షేరు యథాతథంగా నిలిచింది. అయితే 2008 ఆర్థిక సంక్షోభం తదుపరి ఒక త్రైమాసికంలో 2.4 బిలియన్ డాలర్ల నష్టం ప్రకటించడంతోపాటు.. డివిడెండ్‌లో 80 శాతం కోతపెట్టడంతో వెల్స్‌ఫార్గో 5 శాతం పతనమైంది. ఇక పటిష్ట ఫలితాలు సాధించినప్పటికీ సిటీగ్రూప్ 4 శాతం తిరోగమించింది.
బ్లూచిప్స్ అండ
గత 8ఏళ్లలోలేని విధంగా జూన్‌లో రిటైల్ ధరలు పుంజుకున్న వార్తలతో వాల్‌మార్ట్ 2 శాతం, కాస్ట్‌కో 1.6 శాతం చొప్పున బలపడ్డాయి. ఇతర బ్లూచిప్స్‌లో కేటర్‌పిల్లర్ 5 శాతం జంప్‌చేయగా.. ఎగ్జాన్ మొబిల్ 3 శాతం, బోయింగ్ 2.5 శాతం చొప్పున ఎగశాయి. మాస్టర్‌కార్డ్ 3 శాతం పుంజుకుంది. దీంతో డోజోన్స్ జోరందుకున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 0.6 శాతం లాభపడగా.. అమెజాన్ ఇదే స్థాయిలో డీలా పడింది.
ఆసియా ఓకే
ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో జపాన్, సింగపూర్, కొరియా, థాయ్‌లాండ్, తైవాన్, ఇండొనేసియా 1.3-0.3 శాతం మధ్య లాభపడగా.. చైనా 1.4 శాతం, హాంకాంగ్ 0.5 శాతం చొప్పున డీలాపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment