విలువైన షేర్లను పట్టుకోవటమే వేల్యూ ఫండ్స్‌పని!
ఉండాల్సిన రేటుకన్నా క్షీణించిన స్టాక్స్‌లో పెట్టుబడులు
వేల్యూ ఫండ్స్‌తో తక్కువ రిస్కు; అధిక రాబడి
మార్కెట్లంటేనే తీవ్ర హెచ్చుతగ్గులుంటాయి. వివిధ షేర్లు భారీగా పెరగడమో, తగ్గడమో జరుగుతుంటుంది. వీటిలో కొన్ని అసలైన స్థాయి కన్నా గణనీయంగా పతనమైపోవచ్చు. పెట్టిన పెట్టుబడి హరించుకు పోనూ వచ్చు. ఇలాంటి భయాల్లేకుండా కాస్త ఓపికగా, దీర్ఘకాలిక దృక్పథంతో ఇన్వెస్ట్ చేసే వారికోసం ఉన్నవే వేల్యూ ఫండ్స్. ఇవి ఉండాల్సిన ధర కన్నా తక్కువ స్థాయిలో ట్రేడవుతున్న స్టాక్స్‌ను వెతికి పట్టుకుని ఇన్వెస్ట్ చేస్తుంటాయి. పరిస్థితులు మెరుగయ్యాక సదరు స్టాక్స్ మళ్లీ ఉండాల్సిన రేటుకు ఎలాగూ చేరతాయి కనుక ఆ మేరకు లాభాలు దక్కుతాయి. ఇలా వివిధ కారణాల రీత్యా పరిమితికి మించి పడిపోయిన షేర్లను కొని.. అవి మళ్లీ కోలుకున్నాక విక్రయించి లాభాలు ఆర్జించడమే వేల్యూ ఇన్వెస్టింగ్.
సాధారణంగా.. ఇన్వెస్ట్ చేసేటప్పుడు చూడాల్సిన ప్రధాన అంశాలు కొన్ని ఉంటాయి. మేనేజ్‌మెంట్ పాటించే ప్రమాణాలు, మిగతా సంస్థలతో పోలిస్తే మనం ఎంచుకున్న సంస్థకి ఉన్న ప్రత్యేకతలు, రుణ భారం తక్కువగా ఉండటం లేదా అస్సలు లేకపోవడం, అధిక డివిడెండ్లు ఇచ్చే సామర్థ్యం ఉండటం... ఒకవేళ డివిడెండ్లు ఇవ్వకుంటే ఆ మొత్తాన్ని విస్తరణపై వెచ్చిస్తుండటం... రిటర్న్ ఆన్ ఈక్విటీ అధికంగా ఉండటం మొదలైనవన్నీ పరిశీలించాలి. ఇవన్నీ ఒక ఎత్తయితే... సదరు స్టాక్‌ను సముచిత రేటులో పట్టుకోగలగడం మరో ఎత్తు. అయితే, ఇలాంటి స్టాక్స్‌ను వెతికిపట్టుకోవడం అంత సులువేమీ కాదు. భయాలు, అత్యాశ, గుడ్డి నమ్మకం వంటి ఎటువంటి ఎమోషన్స్‌కి లోను కాకుండా పూర్తిగా వాస్తవ గణాంకాల మీదే ఆధారపడి వీటిని దొరకపుచ్చుకోగలగాలి. అంత వెసులుబాటు లేని వారికి ఉపయోగపడేవే వేల్యూ ఫండ్స్.
కాంపౌండింగ్ మహిమ..
సాధారణంగా వేల్యూ ఫండ్స్ పోర్ట్‌ఫోలియోలో హెచ్చుతగ్గులు తక్కువగా ఉంటాయి. అలాగే రిస్కూ కొంత తక్కువగా ఉంటుంది. కాస్త మార్జిన్లు కాపాడుకునేలా రక్షణాత్మకంగా ఇన్వెస్ట్ చేయడం వల్ల దీర్ఘకాలం పాటు మార్కెట్ల పతనం కొనసాగినా మన పోర్ట్‌ఫోలియో భారీగా పడిపోవడం అనేది ఎక్కువగా జరగదు. ఓర్పు, క్రమశిక్షణ, దీర్ఘకాలిక దృక్పథం, కొంత రిస్కు తీసుకోగలిగే సామర్ధ్యం ఉన్న ఇన్వెస్టర్లకు ఇవి అనువైనవి. గడ్డుకాలంలో వీటి పతనం తక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంలో అధిక రాబడులు ఇవ్వగలవు. వీటిలో ఇన్వెస్ట్‌మెంట్‌కి క్రమశిక్షణ ఉండాలి. ఈ ఫండ్స్ .. కాంపౌండింగ్ ఫార్ములా ప్రకారం నడవడం వల్ల అసలు మొత్తానికి గణనీయమైన రక్షణ ఉండటంతో పాటు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులూ అందుకోవచ్చు. డబ్బు పోగొట్టుకోకుండా కాపాడుకోగలిగితే సగం యుద్ధం గెలిచినట్లే కదా.