రిస్క్ తక్కువగా ఉండాలి.. అదే సమయంలో మెరుగైన రాబడులు కావాలని కోరుకునే వారు వ్యాల్యూ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో నిప్పన్ ఇండియా వ్యాల్యూ ఫండ్ మెరుగైన పనితీరు చూపిస్తోంది. వ్యాల్యూ ఫండ్స్ అన్నవి ఒక కంపెనీ వ్యాపారం, మార్కెట్ వాటా, ఆర్థిక బలాలు ఇలా అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత వాస్తవ విలువ కంటే షేరు ధరలు తక్కువగా లభిస్తున్న సమయంలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి.
ఇన్వెస్టర్లు వ్యాల్యూఫండ్స్‌లో దీర్ఘకాలం పాటు తమ పెట్టుబడులను కొనసాగించాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కోసారి ఇవి దీర్ఘకాలంలోనే ఎన్నో రెట్ల ప్రతిఫలాన్ని ఇస్తుంటాయి. స్వల్పకాలంలో గణనీయమైన లేదా మెరుగైన రాబడులను వీటిల్లో ఆశించడం సమంజసం కాదు.
పనితీరు
ఈ పథకం 2005లో మొదలైంది. అప్పటి నుంచి చూస్తే వార్షికంగా ఇచ్చిన ప్రతిఫలం 16 శాతంగా ఉంది. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో రాబడులు 61 శాతంగా ఉన్నాయి. మూడేళ్లలో 29 శాతం, ఐదేళ్లలో 17.5 శాతం, ఏడేళ్లలో 15 శాతం, పదేళ్లలోనూ 18 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇచ్చిన చరిత్ర ఈ పథకానికి ఉంది.
వ్యాల్యూ ఫండ్స్ విభాగం సగటు రాబడులతో పోలిస్తే నిప్పన్ ఇండియా వ్యాల్యూ ఫండ్‌లో రాబడులు 2–3 శాతం అధికంగా ఉన్నాయి. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.5575 కోట్ల పెట్టుబడులున్నాయి. ఈక్విటీ ఫండ్స్‌లో దీర్ఘకాల రాబడులు 12 శాతానికి పైన ఉంటే మెరుగైన పనితీరుగా పరిగణనలోకి తీసుకోవచ్చు. 18 శాతానికి పైన ఉంటే అద్భుతమైన పనితీరుగా చెబుతారు.
పెట్టుబడుల విధానం
స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్ ఇలా అన్ని విభాగాల్లోనూ ఆకర్షణీయమైన విలువల వద్ద లభించే స్టాక్స్‌ను ఈ పథకం గుర్తించి పెట్టుబడులు పెడుతుంటుంది. కాకపోతే లార్జ్‌క్యాప్ కంపెనీలకు ఎక్కువ కేటాయింపులు చేస్తుంది. ప్రస్తుతానికి తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 4 శాతాన్ని నగదు, నగదు సమాన రూపాల్లో కలిగి ఉండగా.. 96 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది.
లార్జ్‌క్యాప్‌లో ప్రస్తుతానికి 64 శాతానికి పైగా పెట్టుబడులున్నాయి. మిడ్‌క్యాప్‌లో 29 శాతం, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో 7 శాతానికి పైనే పెట్టుబడులు కలిగి ఉంది. ఈక్విటీల్లో తీవ్ర అస్థిరతలు కనిపించిన సందర్భంలో పెట్టుబడులను తగ్గించుకుకోవడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగం. 2020 మార్చి నుంచి జూన్ మధ్య ఈ విధానాన్నే పాటించింది. ఆ సమయంలో ఈక్విటీల్లో పెట్టుబడులను తగ్గించుకున్న ఈ పథకం.. ఆ తర్వాతి కాలంలో తిరిగి ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ బాటలో నడుస్తున్న తరుణంలో కేటాయింపులను పెంచింది.
ప్రస్తుతం ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో మొత్తం 72 స్టాక్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు ఎక్కువ కేటాయింపులు చేసింది. 32 శాతం పెట్టుబడులను ఈ రంగాల కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత ఇంధన రంగ కంపెనీలకు 9 శాతం, నిర్మాణ రంగ కంపెనీలకు 8 శాతం, టెక్నాలజీ కంపెనీలకూ 8 శాతం చొప్పున కేటాయింపులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment