మార్కెట్ అస్థిరతల్లో పెట్టుబడులకు తక్కువ రిస్క్‌ను ఆశించే వారు, దీర్ఘకాలంలో సంప్రదాయ ఎఫ్‌డీలు, పోస్టాఫీసు పథకాల కంటే కాస్తంత అధికరాబడులు కోరుకునే వారు హైబ్రిడ్ ఈక్విటీ పథకాలను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో ఎస్‌బీఐ హైబ్రిడ్ ఈక్విటీ కూడా ఒకటి.
ఈ పథకం ఈక్విటీ, డెట్ రెండింటిలోనూ ఇన్వెస్ట్ చేస్తుంది. రాబడి మాత్రం అచ్చమైన డెట్ సాధనాలకు మించి ఉంటుంది. అదే సమయంలో అచ్చమైన ఈక్విటీ పథకం కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ పథకం కనీసం 65 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. మిగిలిన మొత్తాన్ని ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సెక్యూరిటీల్లో పెడుతుంది. బుల్ మార్కెట్లో, బేర్ మార్కెట్లోనూ పనితీరు పరంగా ఈ పథకానికి మంచి ట్రాక్ రికార్డు ఉంది.
రాబడులు
ఈ పథకం రాబడులు గడచిన ఏడాది కాలంలో 14.52 శాతంగా ఉన్నాయి. మూడేళ్ల కాలంలో చూసుకుంటే సగటున ఏటా 17.74 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు ప్రతిఫలాన్ని తెచ్చిపెట్టింది. ఐదేళ్ల కాలంలో వార్షికంగా 11.70 శాతం, ఏడేళ్లలోనూ ఏటా 11.55 శాతం, పదేళ్లలో 14.37 శాతం చొప్పున రాబడుల చరిత్ర ఉంది. 1995 డిసెంబర్ 31న ఈ పథకం ప్రారంభం కాగా, అప్పటి నుంచి చూసుకుంటే వార్షిక రాబడులు 15.43 శాతంగా ఉన్నాయి.
డెట్‌తో కూడిన పెట్టుబడులు కనుక దీర్ఘకాలంలో వార్షిక రాబడి 11–12 శాతం చొప్పున ఉంటే మెరుగైనదిగా పరిగణించొచ్చు. అచ్చమైన ఈక్విటీ కాకుండా, ఈక్విటీ–డెట్ కలయికతో కూడిన సాధనాల్లో దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేద్దామని అనుకునే వారు ఈ విభాగాన్ని పరిశీలించొచ్చు. ఇంతకంటే అధిక రాబడి కోరుకునే వారికి అచ్చమైన ఈక్విటీ పథకాలే సూచనీయం.
(ఇదీ చదవండి: గతంలో టెస్లాను భారత్ తిరస్కరించింది అందుకేనా?)
పెట్టుబడుల విధానం
ఈ పథకం పెట్టుబడుల కేటాయింపు సమయోచితంగా ఉంటుంది. ఆటుపోట్ల సమయాల్లో ఈక్విటీ ఎక్స్‌పోజర్‌ను తగ్గించుకుని నగదు నిల్వలు పెంచుకుంటుంది. 2011 మార్కెట్ కరెక్షన్‌లో, 2015, 2020 ఒడిదుడుకుల సమయాల్లో ఈక్విటీలకు ఎక్స్‌పోజర్ తగ్గించుకోవడం వల్ల ఈ పథకంలో నష్టాలు పరిమితం అయ్యాయి. 2014 బాండ్ మార్కెట్ ర్యాలీ ప్రయోజనాలను సైతం పొందింది. ఈ విధమైన వ్యూహాలతో నష్టాలను పరిమితం చేసి, మెరుగైన రాబడులు తీసుకొచ్చేలా పథకం పరిశోధనా బృందం పనిచేస్తుంటుంది.
ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రూ.58వేల కోట్లకు పైనే పెట్టుబడులు ఉన్నాయి. వీటిల్లో 75.80 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించింది. డెట్ పెట్టుబడులు 18.72 శాతంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ సాధనాలకు కూడా ఒక శాతం లోపు కేటాయించగా, 4.61 శాతాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. ఈక్విటీల్లోనూ 78 శాతం పెట్టుబడులు లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్ కంపెనీలకు 21 శాతం కేటాయింపులు చేసింది. స్మాల్‌క్యాప్ కంపెనీల్లో కేవలం 0.73 శాతమే ఇన్వెస్ట్ చేసింది.
దీంతో ఈక్విటీల్లోనూ రిస్క్‌ను తగ్గించే విధంగా కేటాయింపులు ఉన్నాయి. 18.72 శాతం డెట్ కేటాయింపుల్లోనూ అధిక క్రెడిట్ రేటింగ్ కలిగిన సాధనాల్లోనే 14 శాతానికి పైన పెట్టుబడులు ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 36 స్టాక్స్ ఉన్నాయి. ఈక్విటీల్లో అత్యధికంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 28 శాతం కేటాయింపులు చేయగా, సేవల రంగ కంపెనీలకు 7 శాతానికి పైన కేటాయించింది. హెల్త్‌కేర్‌లో 6 శాతం, ఆటోమొబైల్ కంపెనీల్లో 6 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment