గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధిం ఆదాయ పన్ను (ఐటీ) రిటర్నులు దాఖలు చేసే సమయం వచ్చేసింది. సాధారణంగా జూలై 31లోపు రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎన్నో వివరాలను సిద్ధం చేసుకోవాలి. ఆదాయం, పెట్టుబడులు, గృహ రుణం చెల్లింపులు, అద్దె చెల్లింపులు, ఈపీఎఫ్, పీపీఎఫ్, బీమా ప్రీమియం చెల్లింపులు, మూలధన లాభాలు అన్నింటినీ ఒక పేపర్‌పై రాసి పెట్టుకుంటే రిటర్నులను సులభంగా దాఖలు చేయవచ్చు. పాత, కొత్త విధానాల్లో ఏది అనుకూలమో కూడా మదింపు వేసుకోవాలి. అయితే, రిటర్నులు సమర్పించడంతోనే పని పూర్తయినట్టు అనుకోవద్దు. రిటర్నులు దాఖలు తర్వాత చేయాల్సిన ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి. వాటి గురించి తెలియజేసేదే ఈ కథనం.
రిటర్నులు ధ్రువీకరణ
రిటర్నులు దాఖలు చేసిన ప్రతి ఒక్కరూ వాటిని వెరిఫై చేయాల్సి ఉంటుంది. అప్పుడే రిటర్నులు విజయవంతంగా సమర్పించినట్టు అవుతుంది. ధ్రువీకరించకపోతే అవి మదింపునకు వెళ్లవన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. రిటర్నులు చెల్లుబాటు కూడా కావు. రిటర్నులు దాఖలు చేసిన తర్వాత వాటిని ధ్రువీకరించేందుకు 120 రోజుల గడువు ఉంటుంది. ఆలోపు ఎప్పుడైనా చేయవచ్చు.
రిటర్నులు దాఖలు చేసిన తర్వాత వచ్చే అక్‌నాలెడ్జ్‌మెంట్ కాపీని ప్రింట్ తీసుకుని, దానిపై సంతకం చేసి లేదంటే ఇన్‌కమ్‌ట్యాక్స్ వెబ్‌సైట్ నుంచి ఫామ్ 5ను డౌన్లోడ్ చేసుకుని బెంగళరులోని ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆర్డినరీ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ చేయవచ్చు. కొరియర్ ద్వారా చేయకూడదు. ఆన్‌లైన్‌లోనూ వెరిఫై చేయవచ్చు. పోస్ట్ ద్వారా పంపించడం కంటే ఇది ఎంతో సులభ విధానం. నెట్‌బ్యాంకింగ్ అకౌంట్ లేదంటే ఆధార్ ఆధారిత ఓటీపీ లేదా డీమ్యాట్ అకౌంట్ ద్వారా చేసేందుకు అవకాశం ఉంటుంది. వీటిల్లో ఏది ఎంపిక చేసుకుంటే ఆ రూపంలో మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఆదాయపన్ను శాఖ పోర్టల్‌పై నమోదు చేయడం ద్వారా రిటర్నులను వెరిఫై చేయవచ్చు.
వెరిఫికేషన్‌కు సంబంధించి ఎలక్ట్రానిక్ కోడ్‌ను బ్యాంకు ఏటీఎంల ద్వారా కూడా పొందొచ్చు. ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ఈ సేవలను అందిస్తున్నాయి. ఏటీఎంలో డెబిట్ కార్డును స్వైప్ చేసి, పిన్ నంబర్ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత ‘జనరేట్ ఈవీసీ ఫర్ ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైలింగ్’ను ఎంపిక చేసుకోవాలి. ఆయా బ్యాంకుల్లో ఖాతాదారులై, పాన్ నంబర్ ఇచ్చి ఉన్న వారికే ఇది సాధ్యపడుతుంది. ఒకవేళ ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 44ఏబీ కింద పుస్తకాలను ఆడిట్ చేయించుకోవాల్సిన వారు రిటర్నులు దాఖలు చేసిన వెంటనే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ ద్వారా వాటిని వెరిఫై చేయాల్సి ఉంటుంది.
వ్యక్తులు రిటర్నులు వేసి, 120 రోజులు అయినా వాటిని వెరిఫై చేయలేదనుకుంటే.. అప్పుడు కండోనేషన్ ఆఫ్ డిలే సర్వీస్ రిక్వెస్ట్ సమర్పించాలి. తగిన కారణాన్ని పేర్కొనాలి. ఆదాయపన్ను శాఖ కండోనేషన్ రిక్వెస్ట్‌ను ఆమోదిస్తే అప్పుడు రిటర్నులను వెరిఫై చేయవచ్చు. లేదంటే రిటర్నులు దాఖలు చేయనట్టుగానే ఆదాయపన్ను శాఖ పరిగణిస్తుంది. తిరిగి రిటర్నులను దాఖలు చేయాల్సిందే. లేట్ ఫీజు చెల్లించి దాఖలు చేయాల్సి ఉంటుంది. పన్ను చెల్లించాల్సి ఉంటే, దానిపై వడ్డీ కూడా పడుతుంది.
తప్పులు దొర్లితే?
ఆదాయ పన్ను రిటర్నులను గడువులోపు సమర్పించిన వారు, అందులో తప్పులు దొర్లితే సవరించిన రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు. దాఖలు చేసిన రిటర్నులు ఇంకా ప్రాసెస్ చేయకపోతే రివైజ్డ్ రిటర్నులు వేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సవరించిన రిటర్నులు దాఖలు చేయడానికి ప్రత్యేకమైన ప్రక్రియ అంటూ ఏదీ లేదు. ఈఫైలింగ్ పోర్టల్‌కు వెళ్లి ‘రివైజ్డ్ రిటర్న్’ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.
తాజా రిటర్నులు దాఖలు చేసే ప్రక్రియనే అనుసరించాల్సి ఉంటుంది. సవరించిన రిటర్నుల పత్రంలో మొదటిసారి దాఖలు చేసిన అసలు రిటర్నుల అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్, డేట్ కూడా ఇవ్వాలి. అసెస్‌మెంట్ సంవత్సరం ముగియడానికి మూడు నెలల ముందు వరకు రివైజ్డ్ రిటర్నులు సమర్పించొచ్చు. పన్ను చెల్లింపుదారు దాఖలు చేసిన రిటర్నుల పత్రాన్ని ఆదాయపన్ను శాఖ ప్రాసెస్ చేసినట్టయితే సెక్షన్ 143 (1) కింద ఇంటిమేషన్ పంపిస్తుంది. ఇది వచ్చిన తర్వాత రివైజ్డ్ రిటర్నులు వేయడానికి అనుమతి ఉండదు. ఆలస్యపు రిటర్నులు దాఖలు చేయడానికి తుది గడువు అసెస్‌మెంట్ సంవత్సరంగా గుర్తించాలి.
రిటర్నులు దాఖలు చేసి, దాన్ని ఆదాయపన్ను శాఖ ఇంకా ప్రాసెస్ చేయనట్టయితే గడువులోపు ఎన్ని సార్లు అయినా సవరణలు దాఖలు చేసుకోవచ్చు. ఈ విషయంలో పరిమితి లేదు. ఒక్కసారి సవరించిన రిటర్నులు సమర్పించగానే, ముందు దాఖలు చేసినది చెల్లకుండా పోతుంది. తాజా రిటర్నుల పత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అవకాశం ఉంది కదా అని చాలా పర్యాయాలు సవరించిన రిటర్నులు సమర్పిస్తే అది పన్ను శాఖ అధికారుల దృష్టిలో పడుతుంది. దాంతో ప్రత్యేక స్క్రూటినీ చేయవచ్చు. ముఖ్యంగా సవరించిన రిటర్నుల్లో పెద్ద మార్పులు ఉంటే తప్పకుండా విస్తృత పరిశీలన ఉంటుంది. మొదటిసారి దాఖలు చేసిన పత్రాల మాదిరిగానే, సవరించిన రిటర్నులనూ వెరిఫై చేయడం మర్చిపోవద్దు. అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకోండి.
రిఫండ్‌ల సంగతి ఇదీ..
దాఖలు చేసిన రిటర్నుల్లో ఎలాంటి తప్పులు లేకపోతే అప్పుడు నిశ్చింతగా ఉండొచ్చు. ఒకవేళ చెల్లించాల్సిన మొత్తానికంటే అదనంగా పన్ను చెల్లింనట్టయితే అప్పుడు రిఫండ్ కోరడం ఒక్కటే మార్గం. యూజర్లు ఆదాయ పన్ను శాఖ పోర్టల్‌లో లాగిన్ అయిన తర్వాత డ్యాష్‌బోర్డులో ఇది కనిపిస్తుంది. పన్ను చెల్లింపుదారులు ఎన్‌ఎస్‌డీఎల్ పోర్టల్‌లోనూ పాన్ నంబర్ సమర్పించడం ద్వారా దీన్ని చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫేస్‌లెస్ ప్రాసెసింగ్ నడుస్తోంది. రిఫండ్‌లు పన్ను చెల్లింపుదారు బ్యాంకు ఖాతాకు జమ అవుతాయి. ఇంటిమేషన్ అందుకున్న 15 రోజుల్లోగా ఇది సాధ్యపడుతుంది.
బ్యాంకు వివరాలు సరిగ్గా లేకపోవడం వల్ల రిఫండ్‌లు నిలిపోతుంటాయి. అకౌంట్ నంబర్ లేదా ఐఎఫ్‌ఎస్‌సీ నంబర్‌లో తప్పులు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. సర్వీస్ రిక్వెస్ట్ ఆప్షన్ ద్వారా దీన్ని చెక్ చేసుకోవచ్చు. పన్ను చెల్లింపుదారుడికి రావాల్సిన రిఫండ్‌లు ఆలస్యం అయితే ఒక్కో నెలకు అర శాతం చొప్పున వడ్డీని చెల్లిస్తారు. టీడీఎస్ లేదా టీసీఎస్ రూపంలో పన్నును మినహాయించి ఉంటే లేదా ముందస్తు పన్ను చెల్లించి ఉండి, చివర్లో పన్ను బాధ్యత తగ్గడం వల్ల వెనక్కి తిరిగి రావాల్సి ఉంటే.. అప్పుడు ఏప్రిల్ 1 నుంచి చెల్లించే నాటి వరకు వడ్డీ కూడా లభిస్తుంది. ఐటీఆర్‌లను గడువు తర్వాత దాఖలు చేసిన వారు, ఆ తేదీ నుంచే రిఫండ్‌పై వడ్డీ చెల్లింపులకు అర్హులవుతారు. రిఫండ్‌పై వచ్చే వడ్డీ సంబంధిత ఆర్థిక సంవత్సరం అదనపు ఆదాయం కింద చపించాలి.
సరిపోలేకపోతే..?
దాఖలు చేసిన రిటర్నుల్లో వివరాల ఆధారంగా చెల్లించాల్సిన పన్నులో వ్యత్యాసం ఉంటే, ఆదాయపన్ను శాఖ పంపించే 143 (1) ఇంటిమేషన్‌లో ఆ వివరాలు ఉంటాయి. పన్ను లెక్కల్లో పొరపాట్లు ఉంటే, అదనంగా పన్ను చెల్లించాల్సి ఉంటే, ఆదాయపన్ను శాఖ ఈ ఇంటిమేషన్‌లో పేర్కొంటుంది. ఆదాయపన్ను శాఖ వివరాలతో, పన్ను లెక్కలతో ఏకీభవిస్తే అప్పుడు పన్ను చెల్లింపుదారు ఆ మేరకు అదనపు పన్ను చెల్లిస్తే సరిపోతుంది. కొన్ని సందర్భాల్లో పన్ను మినహాయింపులు పేర్కొనడం మర్చిపోయినా.. పన్ను అదనంగా చెల్లించాల్సిన బాధ్యత ఏర్పడుతుంది.
లేదంటే ఆదాయ పన్ను శాఖ అసెసింగ్ ఆఫీసర్ అయినా పొరపాటు పడొచ్చు. లేదా ఎర్రర్ చోటు చేసుకోవచ్చు. అప్పుడు యూజర్ రెక్టిఫికేషన్ రిక్వెస్ట్ సమర్పించాలి. అంటే దాన్ని సరిదిద్దాలని కోరడం. ఇంటిమేషన్ పంపించిన నాటి నుంచి నాలుగేళ్ల వ్యవధిలో ఎప్పుడైనా కానీ దీన్ని దాఖలు చేయవచ్చు. ఆదాయపన్ను శాఖ గుర్తించిన వాటితో మీరు ఏకీభవించకపోవచ్చు. లేదా మీరు పేర్కొన్న వివరాల పరంగానూ ఆదాయపన్ను శాఖ లేవనెత్తిన తాజా డిమాండ్ సమ్మతం కాకపోయినా రెక్టిఫికేషన్ రిక్వెస్ట్ దాఖలు చేయవచ్చు. ఇలా దాఖలు చేసిన నాటి నుంచి ఆరు నెలల్లోపు ఆదాయపన్ను శాఖ స్పందిస్తుంది.
పన్ను చెల్లింపుదారులు సాధారణంగా నాలుగు రకాల రెక్టిఫికేషన్ రిక్వెస్ట్‌లు సమర్పించొచ్చు. పన్ను చెల్లింపుదారు తనవైపు నుంచి అన్ని రకాల వివరాలు సమర్పించినప్పటికీ, పన్ను శాఖ ఏదైనా సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోనట్టయితే అప్పుడు ‘రీ ప్రాసెస్ ద రిటర్న్’ను ఎంపిక చేసుకోవాలి. టీడీఎస్/టీసీఎస్ లేదా ఐటీ చలాన్లలో దిద్దుబాటు చేయాల్సి ఉంటే అప్పుడు ‘ట్యాక్స్ క్రెడిట్ మిస్‌వ్యచ్ కరెక్షన్’ రిక్వెస్ట్‌ను ఎంపిక చేసుకోవాలి. సెక్షన్ 234సీ కింద వడ్డీ లెక్కలను సరిదిద్దాల్సి ఉంటే ‘అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ 234సీ ఇంటరెస్ట్’ను ఎంపిక చేసుకోవాలి. వాస్తవ రిటర్నుల్లో ఇతర వివరాలను సరిదిద్దాలంటే అప్పుడు ‘రిటర్న్ డేటా కరెక్షన్’ను ఎంపిక చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment