Value funds
-
తక్కువ రిస్క్.. మెరుగైన రాబడులకు వ్యాల్యూ ఫండ్స్
రిస్క్ తక్కువగా ఉండాలి.. అదే సమయంలో మెరుగైన రాబడులు కావాలని కోరుకునే వారు వ్యాల్యూ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో నిప్పన్ ఇండియా వ్యాల్యూ ఫండ్ మెరుగైన పనితీరు చూపిస్తోంది. వ్యాల్యూ ఫండ్స్ అన్నవి ఒక కంపెనీ వ్యాపారం, మార్కెట్ వాటా, ఆర్థిక బలాలు ఇలా అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత వాస్తవ విలువ కంటే షేరు ధరలు తక్కువగా లభిస్తున్న సమయంలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇన్వెస్టర్లు వ్యాల్యూఫండ్స్లో దీర్ఘకాలం పాటు తమ పెట్టుబడులను కొనసాగించాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కోసారి ఇవి దీర్ఘకాలంలోనే ఎన్నో రెట్ల ప్రతిఫలాన్ని ఇస్తుంటాయి. స్వల్పకాలంలో గణనీయమైన లేదా మెరుగైన రాబడులను వీటిల్లో ఆశించడం సమంజసం కాదు. పనితీరు ఈ పథకం 2005లో మొదలైంది. అప్పటి నుంచి చూస్తే వార్షికంగా ఇచ్చిన ప్రతిఫలం 16 శాతంగా ఉంది. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో రాబడులు 61 శాతంగా ఉన్నాయి. మూడేళ్లలో 29 శాతం, ఐదేళ్లలో 17.5 శాతం, ఏడేళ్లలో 15 శాతం, పదేళ్లలోనూ 18 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇచ్చిన చరిత్ర ఈ పథకానికి ఉంది. వ్యాల్యూ ఫండ్స్ విభాగం సగటు రాబడులతో పోలిస్తే నిప్పన్ ఇండియా వ్యాల్యూ ఫండ్‌లో రాబడులు 2–3 శాతం అధికంగా ఉన్నాయి. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.5575 కోట్ల పెట్టుబడులున్నాయి. ఈక్విటీ ఫండ్స్‌లో దీర్ఘకాల రాబడులు 12 శాతానికి పైన ఉంటే మెరుగైన పనితీరుగా పరిగణనలోకి తీసుకోవచ్చు. 18 శాతానికి పైన ఉంటే అద్భుతమైన పనితీరుగా చెబుతారు. పెట్టుబడుల విధానం స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్ ఇలా అన్ని విభాగాల్లోనూ ఆకర్షణీయమైన విలువల వద్ద లభించే స్టాక్స్‌ను ఈ పథకం గుర్తించి పెట్టుబడులు పెడుతుంటుంది. కాకపోతే లార్జ్‌క్యాప్ కంపెనీలకు ఎక్కువ కేటాయింపులు చేస్తుంది. ప్రస్తుతానికి తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 4 శాతాన్ని నగదు, నగదు సమాన రూపాల్లో కలిగి ఉండగా.. 96 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. లార్జ్‌క్యాప్‌లో ప్రస్తుతానికి 64 శాతానికి పైగా పెట్టుబడులున్నాయి. మిడ్‌క్యాప్‌లో 29 శాతం, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో 7 శాతానికి పైనే పెట్టుబడులు కలిగి ఉంది. ఈక్విటీల్లో తీవ్ర అస్థిరతలు కనిపించిన సందర్భంలో పెట్టుబడులను తగ్గించుకుకోవడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగం. 2020 మార్చి నుంచి జూన్ మధ్య ఈ విధానాన్నే పాటించింది. ఆ సమయంలో ఈక్విటీల్లో పెట్టుబడులను తగ్గించుకున్న ఈ పథకం.. ఆ తర్వాతి కాలంలో తిరిగి ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ బాటలో నడుస్తున్న తరుణంలో కేటాయింపులను పెంచింది. ప్రస్తుతం ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో మొత్తం 72 స్టాక్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు ఎక్కువ కేటాయింపులు చేసింది. 32 శాతం పెట్టుబడులను ఈ రంగాల కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత ఇంధన రంగ కంపెనీలకు 9 శాతం, నిర్మాణ రంగ కంపెనీలకు 8 శాతం, టెక్నాలజీ కంపెనీలకూ 8 శాతం చొప్పున కేటాయింపులు చేసింది. -
రిస్క్ తక్కువ, రాబడులు మెరుగ్గా ఉండాలని అనుకుంటున్నారా?
రిస్క్ తక్కువ, రాబడులు మెరుగ్గా ఉండాలని కోరుకునే వారు వ్యాల్యూ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో నిప్పన్ ఇండియా వ్యాల్యూ ఫండ్ మెరుగైన పనితీరు చూపిస్తోంది. వ్యాల్యూ ఫండ్స్ అన్నవి ఒక కంపెనీ వ్యాపారం, మార్కెట్ వాటా, ఆర్థిక బలాలు ఇలా ఎన్నో అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత వాస్తవ విలువ కంటే వాటి షేరు ధరలు తక్కువగా లభిస్తున్న సమయంలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. వ్యాల్యూఫండ్స్ను ఎంపిక చేసుకునే ఇన్వెస్టర్లు దీర్ఘకాలం పాటు తమ పెట్టుబడులను కొనసాగించాల్సి వస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఇవి దీర్ఘకాలంలోనే మంచి ప్రతిఫలాన్ని ఇస్తుంటాయి. గ్రోత్ ఇన్వెస్టింగ్ అయితే స్వల్పకాలంలోనే లాభాలకు అవకాశం ఉంటుంది. కానీ, వ్యాల్యూ ఫండ్స్‌లో స్వల్పకాలంలో గణనీయమైన లేదా మెరుగైన రాబడులను ఆశించడం సమంజసం కాదు. రాబడులు గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో రాబడులు 3 శాతంగా ఉన్నాయి. ప్రధాన సూచీల రాబడులు సైతం ఇదే స్థాయిలో ఉండడాన్ని గమనించొచ్చు. మూడేళ్లలో 18 శాతం, ఐదేళ్లలో 15 శాతం, ఏడేళ్లలో 15 శాతం, పదేళ్లలోనూ 11 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇచ్చిన చరిత్ర ఈ పథకానికి ఉంది. వ్యాల్యూ ఫండ్స్ విభాగం సగటు రాబడులతో పోలిస్తే నిప్పన్ ఇండియా వ్యాల్యూ ఫండ్‌లో రాబడులు 2–3 శాతం అధికంగా ఉన్నాయి. ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.4,749 కోట్ల పెట్టుబడులున్నాయి. ఈక్విటీ ఫండ్స్‌లో దీర్ఘకాల రాబడులు 12 శాతానికి పైన ఉంటే మెరుగైన పనితీరుగా పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇక ఏడేళ్ల కాలంలో 16 శాతం, పదేళ్లలో 14.53 శాతం చొప్పున ఈ పథకం ఏటా రాబడిని తెచ్చి పెట్టింది. పెట్టుబడుల విధానం స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్ ఇలా అన్ని విభాగాల్లోనూ ఆకర్షణీయమైన విలువల వద్ద లభించే స్టాక్స్‌ను ఈ పథకం గుర్తించి పెట్టుబడులు పెడుతుంటుంది. ముఖ్యంగా లార్జ్‌క్యాప్ కంపెనీలకు ఎక్కువ కేటాయింపులు చేస్తుంది. ప్రస్తుతానికి తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 12 శాతాన్ని నగదు, నగదు సమాన రూపాల్లో కలిగి ఉండగా.. 99 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. లార్జ్‌క్యాప్‌లో ప్రస్తుతానికి 72 శాతానికి పైగా పెట్టుబడులున్నాయి. మిడ్‌క్యాప్‌లో 20 శాతం, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో 8 శాతానికి పైనే పెట్టుబడులు కలిగి ఉంది. ఈక్విటీల్లో తీవ్ర అస్థిరతలు కనిపించిన సందర్భంలో పెట్టుబడులను తగ్గించుకోవడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగం. 2020 మార్చి నుంచి జూన్ మధ్య ఈ విధానాన్నే పాటించింది. ఆ సమయంలో ఈక్విటీల్లో పెట్టుబడులను తగ్గించుకున్న ఈ పథకం.. ఆ తర్వాతి కాలంలో తిరిగి ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ బాటలో నడుస్తున్న తరుణంలో కేటాయింపులను పెంచింది. ప్రస్తుతం ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో మొత్తం 78 స్టాక్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు ఎక్కువ కేటాయింపులు చేసింది. 32 శాతం పెట్టుబడులను ఈ రంగాల కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత హెల్త్‌కేర్ రంగ కంపెనీలకు 9.59 శాతం, టెక్నాలజీ కంపెనీలకూ 9 శాతం, ఇంధన కంపెనీలకు 8 శాతం కేటాయింపులు చేసింది. -
కంపెనీ బాండ్లలో ఇన్వెస్ట్ చేయొచ్చా?
నేను ప్రతి నెలా కొంత మొత్తం యాక్సిస్ బ్లూచిప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఇది మంచి ఫండేనా? దీంట్లో ఇన్వెస్ట్ చేయవచ్చా? –లావణ్య, విశాఖపట్టణం యాక్సిస్ బ్లూచిప్ ఫండ్... ఆ కేటగిరీలోని అత్యుత్తమ ఫండ్స్‌లో ఒకటి. సాధారణంగా బ్లూచిప్ ఫండ్స్ అన్నీ మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న లార్జ్ క్యాప్ కంపెనీ షేర్లలోనే ఇన్వెస్ట్ చేస్తాయి. గత ఐదేళ్లలో ఈ ఫండ్ సగటు రాబడి 8 శాతంగా ఉంది. గత ఏడాది కాలంలో ఈ ఫండ్ 4 శాతం మేర నష్టపోయింది. ఇదే కాలానికి బీఎస్ఈ 100 సూచీ 11 శాతం మేర నష్టపోయింది. ఇక గత ఆర్నెల్లలో ఈ ఫండ్ ఒకింత రికవరీ అయింది. మంచి వృద్ధి అవకాశాలున్న అత్యున్నత స్థాయి నాణ్యత గల కంపెనీల్లోనే ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తోంది. మార్కెట్ పుంజుకుంటే, ఈ ఫండ్ రాబడులు మరింతగా పెరుగుతాయి. ఈ ఫండ్‌లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. షేర్లకు, బాండ్లకు మధ్య తేడా ఏమిటి? కంపెనీ బాండ్లలో ఇన్వెస్ట్ చేయవచ్చా? –ఫయాజ్, విజయవాడ కంపెనీ యాజమాన్యంలో భాగస్వామ్యంగా గల వాటాలనే షేర్లుగా పరిగణిస్తారు. స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల ట్రేడింగ్‌లో ఈ షేర్ల క్రయ, విక్రయాలు జరుపుకోవచ్చు. సాధారణంగా ఇన్వెస్టర్లు దీర్ఘకాల ఇన్వెస్ట్మెంట్ కోసం ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్న షేర్లను కొనుగోలు చేస్తారు. షేర్ ధరల్లో వృద్ధి, బోనస్ షేర్లు, డివిడెండ్లు...తదితర ప్రయోజనాలు లభిస్తాయి. ఇక బాండ్ల జారీ ద్వారా కంపెనీ రుణాలను సమీకరిస్తుంది. ఈ బాండ్లకు కాలపరిమితి, వడ్డీరేటు ఉంటుంది. బ్యాంక్ డిపాజిట్టులాంటిదే కంపెనీ బాండ్ కూడా. అయితే బ్యాంక్ డిపాజిట్లలాగా బాండ్లు సురక్షితమనే విషయం.. మీరు ఇన్వెస్ట్ చేసే కంపెనీపై ఆధారపడి ఉంటుంది. ఆర్థికంగా కంపెనీ ఎంత పటిష్టమో అనే విషయాన్ని బట్టే ఆ కంపెనీ బాండ్ల నష్టభయం ఆధారపడి ఉంటుంది. ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్న కంపెనీ తన బాండ్లపై తక్కువ వడ్డీనే ఇవ్వవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ సురక్షితంగా ఉంటాయనే ధీమానే దీనికి కారణం. ఇక ఆర్థిక స్థితిగతులు అస్తవ్యస్తంగా ఉన్న కంపెనీ అధిక వడ్డీరేటును ఆఫర్ చేయవచ్చు. కానీ ఇలాంటి కంపెనీల బాండ్లకు నష్ట భయం అధికంగా ఉంటుంది. కంపెనీ ఆర్థిక స్థితిగతులను కూలంకషంగా మదింపు చేసిన తర్వాతే కంపెనీ బాండ్లలో ఇన్వెస్ట్ చేయాలి. ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఈ తప్పులకు తప్పదు... మూల్యం!
మనలో చాలా మందికి ఆర్థిక విషయాల పట్ల పరిపూర్ణ అవగాహన తక్కువేనని అంగీకరించాల్సిందే..! ఎందుకంటే అవసరాలకు ఖర్చు చేయడం మినహా, ప్రత్యేకమైన ఆర్థిక ప్రణాళిక చాలా మందిలో కనిపించదు. ఈ కారణంగానే ఎంతో మంది ఆర్థిక అంశాల విషయంలో తమకు తెలియకుండానే ఎన్నో తప్పులకు చోటు ఇస్తుంటారు. కానీ, వీటి కారణంగా ఎంతో నష్టపోవాల్సి రావచ్చు. వ్యక్తిగత ఆర్థిక అంశాల నిర్వహణ పట్ల అవగాహన లేకపోవడమే దీనికి కారణమని తేల్చారు ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్, జేఎస్జీ అండ్ కంపెనీకి చెందిన సీఏ గోవింగ్ ఎం.చందక్. భారతీయులు సాధారణంగా చేసే ఇటువంటి తప్పులు, వాటి కారణంగా ఏర్పడే ఆర్థిక నష్టాల గురించి ఆయన ఒక నివేదిక రూపంలో తెలియజేశారు. భవిష్యత్తు లక్ష్యాల దృష్ట్యా రాబడుల కోసం బీమా పాలసీల్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారా..? ప్రతీ 100 మందిలో 95 మంది ఇదే తప్పు చేస్తున్నారు. ఎటువంటి రాబడులు ఇవ్వని, చౌక ప్రీమియంకు అధిక బీమా రక్షణనిచ్చే టర్మ్ పాలసీకి.. ‘ప్రీమియం ఎక్కువ, బీమా కవరేజీ తక్కువ’ ధోరణితో కూడిన ఎండోమెంట్ పాలసీకి మధ్య తేడా తెలిసిన వారు తక్కువ మందే ఉన్నారు. క్రెడిట్ కార్డు మిస్టరీ క్రెడిట్ కార్డుపై పరిమితిని వాడేసుకుని, కనీస మొత్తమే చెల్లిస్తున్నారా..? అయితే, మీరు క్రెడిట్‌కార్డు మాయ(రుణ ఊబి)లో చిక్కుకున్నట్టే. ఉదాహరణకు క్రెడిట్ కార్డు బిల్లు రూ.40,000 వినియోగించుకుని.. గడువు నాటికి ఈ మొత్తాన్ని చెల్లించకపోతే ఆలస్యపు ఫీజు కింద రూ.100–1,000 మధ్య చెల్లించాలి. ఈ ఫీజు తప్పించుకునేందుకు కనీస బకాయి కింద బిల్లులో 5 శాతం చెల్లించడం ద్వారా కార్డును యాక్టివ్‌గానూ ఉంచుకోవచ్చు. కానీ, ఇలా కొద్ది మొత్తమే చెల్లించడం వల్ల మిగిలి ఉన్న బకాయిపై భారీ వడ్డీ బాదుడు ఉంటుంది. కాంపౌండింగ్ మహిమ రాబడి/వడ్డీ వచ్చి అసలుకు చేరడాన్ని కాం పౌండింగ్గా చేప్పుకోవచ్చు. ఇలా రాబడి నిర్ణీత కాలానికోసారి అసలుకు కలుస్తుంటే, కొంత కాలా నికి సంపద గణనీయంగా వృద్ధి చెందుతుంది. పెట్టుబడులకు ఎంత సుదీర్ఘకాలం ఉంటే, కాంపౌడింగ్ మహిమతో రాబడి అంత అధికంగా ఉంటుంది. కాంపౌండింగ్ మహిమను ప్రపంచంలో ఎనిమి దో అద్భుతంగా ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అభివర్ణించారు. టిప్స్ సాయంతో స్టాక్స్ కొనుగోలు స్వీయ అధ్యయనం లేకుండా, కంపెనీల ఫండమెంటల్స్ గురించి పూర్తి అవగాహనకు రాకుండా.. టిప్స్‌ను నమ్ముకుని పెట్టుబడులు పెట్టడం వల్ల వచ్చే నష్టాలు ఎదురవుతాయి. జీవన ద్రవ్యోల్బణం వేతనం పెరిగిందని అప్పటి వరకు 2బీహెచ్‌కే ఇంట్లో ఉన్న వారు 3బీహెచ్‌కే ఇంటికి మారిపోవడం.. మంచి బోనస్ వచ్చిందని కారును మార్చేయడం అన్నవి జీవన ద్రవ్యోల్బణానికి మంచి ఉదాహరణలు. అవసరం ఉంటే తప్ప వేతనం పెరిగిందని ఇలా చేస్తే ఆర్థికంగా తప్పటడుగే. తక్కువ ధరలకు వస్తున్నాయని డిస్కౌంట్ చూసి అవసరం లేకపోయినా కొనే వారు చాలా మందే ఉన్నారు. అంటే అవసరం లేని దాని కోసం వృధా చేయడమే అవుతుంది. వారాంతపు పార్టీలు వారంలో ఐదు రోజులు పని. రెండు రోజులు వినోదం. నగరాలు, పట్టణాల్లో విస్తరిస్తున్న సంస్కృతి ఇది. వారాంతాల్లో పబ్‌లు, పార్టీల పేరుతో భారీగా ఖర్చు చేసేస్తే.. నెలాఖరుకు బ్యాలన్స్ సున్నాకు చేరుతుంది. ఖర్చులను కనిపెట్టడం దేనికోసం, ఎంత, ఎందుకు ఖర్చు చేస్తున్నామన్నది పట్టించుకునే వారు తక్కువే. ఇది దీర్ఘకాలంలో ఎంతో నష్టానికి దారితీస్తుంది. అత్యవసర నిధి లేకపోవడం అత్యవసర సందర్భాల్లో ఆదుకునేందుకు ప్రత్యేకంగా ఓ ఫండ్ అంటూ లేకపోతే.. క్రెడిట్ కార్డును గీకడం లేదా పర్సనల్ లోన్ లేదా గోల్డ్ లోన్ లేదా తెలిసిన వారి దగ్గర చేయి చాచాల్సి వస్తుంది. ఇలా చేస్తే మీ జీవన లక్ష్యాలకు మిగిలేది ఏముంటుంది? ఆర్థిక ప్రణాళిక చాలా మందికి ఆర్థిక లక్ష్యాలనేవి ఉండడం లేదు. దాంతో డబ్బును దాచుకోవాలన్న ఆలోచన కూడా వారికి ఉండడం లేదు. ఆరోగ్య బీమా అవసరం వైద్య బీమా అవసరాన్ని చాలా మంది గుర్తించడం లేదు. ఏదైనా అనారోగ్యం లేదా ప్రమాదం కారణంగా ఆస్పత్రి పాలైతే.. చెల్లించాల్సిన బిల్లు అప్పటి వరకు చేసుకున్న పొదుపులన్నింటినీ కరిగించేస్తుంది. వైద్య ఖర్చులు పెరిగిపోతున్న నేపథ్యంలో బీమా లేకుండా వాటిని భరించడం సామాన్య, మధ్యతరగతి వారివల్ల అయ్యే పని కాదు. వైవిధ్యానికి దూరం కావడం పొదుపు మొత్తాన్ని తీసుకెళ్లి రియల్ ఎస్టేట్ మార్కెట్లో లేక బంగారంపైన లేక పూర్తిగా స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేసే వారు.. అలాగే బ్యాంకు లాకర్లలో పెట్టేవారూ ఉన్నారు. ఇలా ఒకటి రెండింటికే పరిమితం కాకుండా, తమ రిస్క్ సామర్థ్యాన్ని అర్థం చేసుకుని, భిన్న సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే వారు కొద్ది మందే ఉంటారు. వాయిదా వేయడం ‘రేపటి నుంచి ఇన్వెస్ట్ చేయాలి’.. ‘హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి’.. ఇలా అనుకోవడమే కానీ, ఆచరణలో పెట్టే వారు తక్కువే. కీలక నిర్ణయాలను వాయిదా వేయడం లేదా జాప్యం చేయడం వల్ల నష్టమే ఎక్కువ. ఓపిక లేమి డబ్బులు పిల్లలు పెట్టాలంటే అందుకు తగినంత వ్యవధి ఇవ్వాలి. కొందరికి స్వల్ప కాలంలోనే పెట్టుబడి రెట్టింపు కావాలని ఉంటుంది. అందుకే స్టాక్ మార్కెట్ పట్ల ఆకర్షితులవుతూ ఉంటారు. ఇలా ఓపిక లేమి, పెట్టుబడి సాధనాల గురించి, రిస్క్, రాబడులను అర్థం చేసుకోకపోవడం వల్ల నష్టపోయేవారు చాలా మందే ఉన్నారు. ఇతరుల నిర్ణయాలపై ఆధారపడడం పెట్టుబడుల గురించి తెలియక ఇతరులపై ఆధారపడే వారూ ఉన్నారు. తమ కష్టార్జితాన్ని వృద్ధి చేయాలంటూ ఇతరుల చేతుల్లో పెడితే గాల్లో దీపం వంటిదే. రాబడులు రావచ్చు లేకపోతే మొత్తం కోల్పోవచ్చు. సమయాన్ని వృధా చేసుకోవడం కొత్త విషయాలను నేర్చుకోవడానికి లేదా కొత్త నైపుణ్యాలను సొంతం చేసుకోవడానికి బదులు ఎక్కువ మంది సోషల్ మీడియాలో, యూట్యూబులలో గడిపేస్తుంటారు. ఆస్తులు–అప్పులు భవిష్యత్తు ఆదాయాలపై భరోసా లేనివారు కారువంటి విలాసాలు అప్పుపై కొనడం అంత మంచిదికాదు. వీటిపైనా దృష్టి పెట్టాలి... లాకర్లలో బంగారం: రూ.లక్షలతో బంగారు ఆభరణాలను కొనుగోలు చేసుకుని, రక్షణ కోసం తీసుకెళ్లి బ్యాంకు లాకర్లలో పెట్టేస్తుంటారు. లక్షలాది రూపాయలు ఆభరణాల రూపంలో బ్లాక్ అయినట్టే. వీటిపై రాబడి ఉండదు. దీర్ఘకాలంలో బంగారం ధర పెరిగినా ఆభరణాలను అమ్ముకునేందుకు మనస్కరించదు. కష్టార్జితమంతా పెళ్లిళ్లకే: కొందరు తమ కష్టార్జితమంతా తమ పిల్లల పెళ్లిళ్ల కోసమే ఖర్చు చేస్తుంటారు. దీనివల్ల తదనంతర కాలంలో వారి జీవితం ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. క్రమశిక్షణ లేమి: ఆదాయం వచ్చిన వెంటనే ప్రణాళిక మేర ఇన్వెస్ట్ చేసి, మిగిలినది ఖర్చు చేయాలి. కానీ, ఎక్కువ మంది దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తుంటారు. ఆడంబరాలు: కొందరు తాము గొప్పగా కనిపించాలనుకుంటారు. అందుకోసం కారు, ఖరీదైన ఇల్లు, ఖరీదైన వాచ్, ట్రిప్ ఇలా ఏవేవో ప్లాన్ చేస్తుంటారు. విలువను తెచ్చిపెట్టే వాటిపై ఇన్వెస్ట్ చేయడాన్ని పక్కకు నెట్టేస్తుంటారు. -
వేల్యూ ఫండ్స్‌ను కొనసాగించవచ్చా?
నేను సీనియర్ సిటిజెన్‌ను. గత ఏడాది కాలం నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)మార్గంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా పోర్ట్‌ఫోలియోలో టాటా డిజిటల్ ఇండియా ఫండ్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ డిజిటల్ ఇండియా ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా టెక్నాలజీ ఫండ్, యాక్సిస్ బ్లూచిప్ ఫండ్లు ఉన్నాయి. వీటిల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కొనసాగించదగ్గ ఫండ్స్ ఏవి? –రవీందర్, కాకినాడ మీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న మొత్తం ఐదు ఫండ్స్‌ల్లో నాలుగు ఫండ్స్ టెక్నాలజీ ఫండ్సే ఉన్నాయి. డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు పొందాలంటే పోర్ట్‌ఫోలియోలో ఒక టెక్నాలజీ ఫండ్ ఉంటే సరిపోతుంది. కానీ మీ పోర్ట్‌ఫోలియోలో ఏకంగా నాలుగు టెక్నాలజీ ఫండ్స్ ఉన్నాయి. ఇది సరైన ఇన్వెస్ట్మెంట్ వ్యూహం కాదు. ముఖ్యంగా మీలాంటి సీనియర్ సిటిజన్‌కు ఇది పూర్తిగా సరైనది కాదు. మీలాంటి వాళ్లకు నిలకడైన ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి. దీని కోసం హైబ్రిడ్ ఫండ్‌ను గానీ, మల్టీ క్యాప్ ఫండ్‌ను గానీ ఎంచుకోవాలి. అయితే గత రెండేళ్లుగా టెక్నాలజీ/డిజిటల్ ఫండ్స్ మంచి రాబడులను ఇచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఇతర ఫండ్స్‌తో పోల్చితే టెక్నాలజీ ఫండ్సే మెరుగని అనిపిస్తూ ఉండొచ్చు. ఈ విషయంలో ఇప్పుడు మీరు అదృష్టవంతులు. అలాగని ఎప్పుడూ ఇదే అదృష్టం కొనసాగుతుందని చెప్పలేం. అందుకని నాలుగు టెక్నాలజీ ఫండ్స్‌ను ఒకటికి తగ్గించుకోండి. యాక్సిస్ బ్లూచిప్ ఫండ్‌ను కొనసాగించవచ్చు. మరో హైబ్రిడ్ ఫండ్‌ను గానీ, మల్టీ క్యాప్ ఫండ్‌ను గానీ మీ పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోండి. నేను రిటైరవ్వడానికి మరో 13 ఏళ్ల సమయం ఉంది. రిటైర్మెంట్ అవసరాల కోసం కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో నెలకు కొంత మొత్తం సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా పోర్ట్‌ఫోలియోలో ఐదు మల్టీ–క్యాప్ ఫండ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా రెండు వేల్యూ ఫండ్స్–క్వాంటమ్ ఇండియా వేల్యూ ఫండ్, ఐసీఐసీఐ ప్రు వేల్యూ డిస్కవరీ ఫండ్స్ కూడా ఉన్నాయి. మల్టీ క్యాప్ ఫండ్స్ పనితీరు సంతృప్తికరంగా ఉన్నా, ఈ వేల్యూ ఫండ్స్ పనితీరు అంతంతమాత్రంగానే ఉంది. వీటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించవచ్చా ? –సుచిత్ర, హైదరాబాద్ మీరు రిటైరవ్వడానికి మరో 13 సంవత్సరాల సమయం ఉంది. అంటే మీరు మరో 13 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయగలరు. కాబట్టి ఈ వేల్యూ ఫండ్స్‌లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించవచ్చు. ఈ ఫండ్స్ పనితీరు ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉండొచ్చు కానీ మరీ తీసికట్టుగా ఏమీ లేదనే చెప్పవచ్చు. ఈ ఫండ్స్‌ల్లో 13 ఏళ్ల పాటు ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగిస్తే, కనీసం రెండు మార్కెట్ సైకిల్స్‌ను ఈ ఫండ్స్ చూస్తాయి. ఈ కాలంలో ఈ ఫండ్స్ పనితీరు మెరుగు పడే అవకాశాలే చాలా అధికంగా ఉన్నాయి. మార్కెట్ నష్టాల్లో ఉన్నప్పుడు ఈ ఫండ్స్ మరీ అంతగా నష్టపోకుండా ఉండటం, మీ పోర్ట్‌ఫోలియోకు ఒకింత స్థిరత్వం ఇచ్చి ఉండటం మీరు గమనించే ఉండాలి. మల్టీ క్యాప్ ఫండ్స్‌తో పాటు వేల్యూ ఫండ్స్ ఉండటం వల్ల మీ పోర్ట్‌ఫోలియో.. డైవర్సిఫికేషన్ పరంగా చూస్తే, మంచి స్థితిలోనే ఉందని చెప్పవచ్చు. ఐసీఐసీఐ ప్రు వేల్యూ డిస్కవరీ ఫండ్ పనితీరు ఒకింత నిరాశమయంగా ఉన్నప్పటికీ, 13 ఏళ్ల కాలంలో ఈ ఫండ్ పుంజుకొని మంచి రాబడులు ఇచ్చే అవకాశాలే అధికంగా ఉన్నాయి. మరోవైపు ఈ ఫండ్ పోర్ట్‌ఫోలియో పటిష్టంగానే ఉంది. నాణ్యత గల షేర్లే ఈ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. ఎలాంటి అనుమానాలు లేకుండా ఈ వేల్యూ ఫండ్స్‌ల్లో మీ సిప్‌లను కొనసాగించండి. సాధారణంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వివిధ రంగాలకు చెందిన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కదా ! వివిధ రంగాల కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ యా రంగాల్లోని రిస్క్‌లు ఆయా కంపెనీలపై బాగానే ప్రభావం చూపుతాయి కదా! అలాంటప్పుడు ఈక్విటీ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం సరైనదేనా ? అసలు ఈక్విటీ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు అసలు ఎలాంటి విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి? –జావేద్, విజయవాడ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వివిధ రంగాలకు చెందిన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అయితే ఒక ఫండ్ ఏ రంగాల కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిందనే విషయం ప్రధానాంశంగా ఫండ్స్‌కు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోకూడదు. గతంలో ఒక ఫండ్ పనితీరు ఎలా ఉంది అనే విషయాన్నే పరిగణనలోకి తీసుకొని ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి. మార్కెట్ పెరుగుతున్నప్పుడు, అలాగే మార్కెట్ పతన బాటలో ఉన్నప్పుడూ సదరు ఫండ్ పనితీరు ఎలా ఉంది అనే విషయం కీలకం. అలాగే సదరు ఫండ్‌ను నిర్వహిస్తున్న ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది? దీర్ఘకాలం పాటు అతని పనితీరు సవ్యంగానే ఉందా ?అనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. చాలా ఈక్విటీ ఫండ్స్ పోర్ట్‌ఫోలియోలు దాదాపు ఒకేలాగా ఉన్నప్పటికీ, వాటి రాబడుల్లో మాత్రం తేడా ఉండొచ్చు. అందుకని ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు సదరు ఫండ్ పోర్ట్‌ఫోలియోనే కీలకంగా చూడకూడదు. ఆ ఫండ్ పనితీరును కూడా మదింపు చేయాలి. -
విలువైన షేర్లను పట్టుకోవటమే వేల్యూ ఫండ్స్పని!
ఉండాల్సిన రేటుకన్నా క్షీణించిన స్టాక్స్‌లో పెట్టుబడులు వేల్యూ ఫండ్స్‌తో తక్కువ రిస్కు; అధిక రాబడి మార్కెట్లంటేనే తీవ్ర హెచ్చుతగ్గులుంటాయి. వివిధ షేర్లు భారీగా పెరగడమో, తగ్గడమో జరుగుతుంటుంది. వీటిలో కొన్ని అసలైన స్థాయి కన్నా గణనీయంగా పతనమైపోవచ్చు. పెట్టిన పెట్టుబడి హరించుకు పోనూ వచ్చు. ఇలాంటి భయాల్లేకుండా కాస్త ఓపికగా, దీర్ఘకాలిక దృక్పథంతో ఇన్వెస్ట్ చేసే వారికోసం ఉన్నవే వేల్యూ ఫండ్స్. ఇవి ఉండాల్సిన ధర కన్నా తక్కువ స్థాయిలో ట్రేడవుతున్న స్టాక్స్‌ను వెతికి పట్టుకుని ఇన్వెస్ట్ చేస్తుంటాయి. పరిస్థితులు మెరుగయ్యాక సదరు స్టాక్స్ మళ్లీ ఉండాల్సిన రేటుకు ఎలాగూ చేరతాయి కనుక ఆ మేరకు లాభాలు దక్కుతాయి. ఇలా వివిధ కారణాల రీత్యా పరిమితికి మించి పడిపోయిన షేర్లను కొని.. అవి మళ్లీ కోలుకున్నాక విక్రయించి లాభాలు ఆర్జించడమే వేల్యూ ఇన్వెస్టింగ్. సాధారణంగా.. ఇన్వెస్ట్ చేసేటప్పుడు చూడాల్సిన ప్రధాన అంశాలు కొన్ని ఉంటాయి. మేనేజ్మెంట్ పాటించే ప్రమాణాలు, మిగతా సంస్థలతో పోలిస్తే మనం ఎంచుకున్న సంస్థకి ఉన్న ప్రత్యేకతలు, రుణ భారం తక్కువగా ఉండటం లేదా అస్సలు లేకపోవడం, అధిక డివిడెండ్లు ఇచ్చే సామర్థ్యం ఉండటం... ఒకవేళ డివిడెండ్లు ఇవ్వకుంటే ఆ మొత్తాన్ని విస్తరణపై వెచ్చిస్తుండటం... రిటర్న్ ఆన్ ఈక్విటీ అధికంగా ఉండటం మొదలైనవన్నీ పరిశీలించాలి. ఇవన్నీ ఒక ఎత్తయితే... సదరు స్టాక్‌ను సముచిత రేటులో పట్టుకోగలగడం మరో ఎత్తు. అయితే, ఇలాంటి స్టాక్స్‌ను వెతికిపట్టుకోవడం అంత సులువేమీ కాదు. భయాలు, అత్యాశ, గుడ్డి నమ్మకం వంటి ఎటువంటి ఎమోషన్స్‌కి లోను కాకుండా పూర్తిగా వాస్తవ గణాంకాల మీదే ఆధారపడి వీటిని దొరకపుచ్చుకోగలగాలి. అంత వెసులుబాటు లేని వారికి ఉపయోగపడేవే వేల్యూ ఫండ్స్. కాంపౌండింగ్ మహిమ.. సాధారణంగా వేల్యూ ఫండ్స్ పోర్ట్‌ఫోలియోలో హెచ్చుతగ్గులు తక్కువగా ఉంటాయి. అలాగే రిస్కూ కొంత తక్కువగా ఉంటుంది. కాస్త మార్జిన్లు కాపాడుకునేలా రక్షణాత్మకంగా ఇన్వెస్ట్ చేయడం వల్ల దీర్ఘకాలం పాటు మార్కెట్ల పతనం కొనసాగినా మన పోర్ట్‌ఫోలియో భారీగా పడిపోవడం అనేది ఎక్కువగా జరగదు. ఓర్పు, క్రమశిక్షణ, దీర్ఘకాలిక దృక్పథం, కొంత రిస్కు తీసుకోగలిగే సామర్ధ్యం ఉన్న ఇన్వెస్టర్లకు ఇవి అనువైనవి. గడ్డుకాలంలో వీటి పతనం తక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంలో అధిక రాబడులు ఇవ్వగలవు. వీటిలో ఇన్వెస్ట్మెంట్కి క్రమశిక్షణ ఉండాలి. ఈ ఫండ్స్ .. కాంపౌండింగ్ ఫార్ములా ప్రకారం నడవడం వల్ల అసలు మొత్తానికి గణనీయమైన రక్షణ ఉండటంతో పాటు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులూ అందుకోవచ్చు. డబ్బు పోగొట్టుకోకుండా కాపాడుకోగలిగితే సగం యుద్ధం గెలిచినట్లే కదా.