మాల్యా మొత్తం అప్పు కట్టాల్సిందే: పీఎన్బీ చీఫ్
న్యూఢిల్లీ: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన విజయ్‌మాల్యా... ఆ మొత్తాన్ని చెల్లించాల్సిందేనని పఎన్‌బీ ఎండీ ఉషా అనంతసుబ్రమణ్యన్ స్పష్టం చేశారు. కొంత మొత్తాన్ని చెల్లిస్తామన్న మాల్యా ఆఫర్‌ను ఆమె తిరస్కరించారు. బ్యాంకింగ్ కన్సార్షియానికి నేతృత్వం వహించనప్పటికీ, అందులో ఒక భాగంగా వున్న తాము మాల్యా రుణ మొత్తం చెల్లించాల్సిందేనన్నది డిమాండ్ చేస్తున్నామన్నారు.
పీఎన్‌బీకి మాల్యా చెల్లించాల్సిన మొత్తం రూ.800 కోట్లు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాసహా బ్యాంకుల కన్సార్షియంకు వడ్డీతో కలిపి మాల్యా దాదాపు రూ.9,200 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే అసలు దాదాపు రూ.6,000 కోట్లలో రూ.4,000 కోట్లు చెల్లిస్తానని, మిగిలిన రూ.2,000 కోట్లు వివిధ కోర్టుల్లో తాను దాఖలు చేసిన కేసుల విచారణ, తీర్పు ఆధారంగా చెల్లిస్తామని మాల్యా గతంలో ప్రతిపాదించారు. దీనిని బ్యాంకుల కన్సార్షియం తిరస్కరించింది.
మాల్యా కేసుపై బ్యాంకర్లు, ఈడీ భేటీ
న్యూఢిల్లీ: విజయ్ మాల్యా రుణ ఎగవేతల అంశంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ), 17 బ్యాంకుల కన్సార్షియంకు నేతృత్వం వహిస్తున్న ఎస్‌బీఐ అధికారులు ఇక్కడ బుధవారం సమావేశం అయ్యారు. తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై వీరు చర్చించినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఈడీ తరఫున ఆర్థికమంత్రిత్వశాఖ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేసులో ఇప్పటివరకూ చోటుచేసుకున్న పరిణామాలపై అధికారులు చర్చించారు. సంబంధిత న్యాయ పరమైన అంశాలను సమీక్షించారు. ఇంతకుమించి సమాచారం తెలియరాలేదు.