Usha ananthasubramanian
-
మాల్యా మొత్తం అప్పు కట్టాల్సిందే: పీఎన్బీ చీఫ్
న్యూఢిల్లీ: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన విజయ్‌మాల్యా... ఆ మొత్తాన్ని చెల్లించాల్సిందేనని పఎన్‌బీ ఎండీ ఉషా అనంతసుబ్రమణ్యన్ స్పష్టం చేశారు. కొంత మొత్తాన్ని చెల్లిస్తామన్న మాల్యా ఆఫర్‌ను ఆమె తిరస్కరించారు. బ్యాంకింగ్ కన్సార్షియానికి నేతృత్వం వహించనప్పటికీ, అందులో ఒక భాగంగా వున్న తాము మాల్యా రుణ మొత్తం చెల్లించాల్సిందేనన్నది డిమాండ్ చేస్తున్నామన్నారు. పీఎన్బీకి మాల్యా చెల్లించాల్సిన మొత్తం రూ.800 కోట్లు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాసహా బ్యాంకుల కన్సార్షియంకు వడ్డీతో కలిపి మాల్యా దాదాపు రూ.9,200 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే అసలు దాదాపు రూ.6,000 కోట్లలో రూ.4,000 కోట్లు చెల్లిస్తానని, మిగిలిన రూ.2,000 కోట్లు వివిధ కోర్టుల్లో తాను దాఖలు చేసిన కేసుల విచారణ, తీర్పు ఆధారంగా చెల్లిస్తామని మాల్యా గతంలో ప్రతిపాదించారు. దీనిని బ్యాంకుల కన్సార్షియం తిరస్కరించింది. మాల్యా కేసుపై బ్యాంకర్లు, ఈడీ భేటీ న్యూఢిల్లీ: విజయ్ మాల్యా రుణ ఎగవేతల అంశంపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ), 17 బ్యాంకుల కన్సార్షియంకు నేతృత్వం వహిస్తున్న ఎస్బీఐ అధికారులు ఇక్కడ బుధవారం సమావేశం అయ్యారు. తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై వీరు చర్చించినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఈడీ తరఫున ఆర్థికమంత్రిత్వశాఖ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేసులో ఇప్పటివరకూ చోటుచేసుకున్న పరిణామాలపై అధికారులు చర్చించారు. సంబంధిత న్యాయ పరమైన అంశాలను సమీక్షించారు. ఇంతకుమించి సమాచారం తెలియరాలేదు. -
వెయ్యి కోట్ల డిపాజిట్లపై మహిళా బ్యాంక్ దృష్టి
ముంబై: భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ) 2015 మార్చి నాటికి రూ.1,000 కోట్ల డిపాజిట్లు, రూ.800 కోట్లరుణ మంజూరు లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చైర్మన్ అండ్ మేనేజింగ్ (సీఎండీ) డెరైక్టర్ ఉషా అనంత సుబ్రమణియన్ తెలిపారు. ఇక్కడ శనివారం బ్యాంక్ 35వ బ్రాంచ్ ప్రారంభించిన ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రస్తుత బ్యాంక్ డిపాజిట్లు రూ. 300 కోట్లుకాగా, రుణ పరిమాణం రూ.500 కోట్లుగా ఉంది. మార్చి నాటికి బ్రాంచ్ నెట్వర్క్ సంఖ్యను 80కి పెంచాలన్నది కూడా లక్ష్యం. ముఖ్యంగా ఈ విషయంలో ద్వితీయ, తృతీయ పట్టణాల్లో బ్రాంచీల ప్రారంభానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎండీ తెలిపారు. -
గ్రామీణ ప్రాంతాలకూ విస్తరణ
చండీగఢ్: చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో బ్రాంచీల ప్రారంభానికి భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచీ ఇందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు దేశ మొట్టమొదటి మహిళా బ్యాంక్ గురువారం తెలిపింది. తద్వారా 2015 మార్చి నాటికి బ్యాంక్ బ్రాంచీల సంఖ్యను 80కి చేర్చాలన్నది బీఎంబీ లక్ష్యంగా ఉంది. ‘‘మహిళా బ్యాంక్ తన బ్రాండ్‌ను స్థిరపరచుకోవాల్సి ఉంటుంది. ప్రతి రాష్ట్రంలోనూ ఒక బ్రాంచ్ని తక్షణం ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. తద్వారా దేశ వ్యాప్త విస్తరణను కోరుకుంటున్నాం. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో బ్రాంచీలను ప్రారంభిస్తున్నాం. మార్చి 2015కల్లా కనీసం 80 బ్రాంచీల ఏర్పాటు మా లక్ష్యం’’ అని సీఎండీ ఉషా అనంతసుబ్రమణ్యన్ పేర్కొన్నారు. అంతకుముందు ఆమె ఇక్కడ బ్యాంక్ 10వ బ్రాంచ్ని ప్రారంభించారు. భారతీయ మహిళా బ్యాంక్‌ను రూ.1,000 కోట్ల తొలి మూలధనంతో ఏర్పాటు చేశారు. 2020 నాటికి రూ.60,000 కోట్ల వ్యాపార పరిమాణం దీని లక్ష్యం. మంచి ఆలోచనలతో వస్తే...: మంచి ఆలోచనలతో ముందుకు వచ్చే మహిళలకు రాయితీపై రుణాలను అందించడానికి బ్యాంక్ సిద్ధంగా ఉన్నట్లు సీఎండీ వివరించారు. మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు రుణ పథకాలను బ్యాంక్ రూపొందించినట్లు కూడా ఆమె తెలిపారు. హామీ రహిత రుణాలను మహిళలకు ఇవ్వడానికి కూడా తమ బ్యాంక్ సిద్ధంగా ఉంటుందని పేర్కొంటూ... అయితే వారు ఇందుకు మంచి వ్యాపార ఆలోచనలతో ముందుకు రావాల్సి ఉంటుందని వివరించారు. మహిళాభివృద్ధే ధ్యేయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) వంటి వృత్తివిద్యా సంస్థలతో సైతం అవగాహన కుదుర్చుకుని మహిళాభివృద్ధికి బ్యాంక్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆయా అంశాల్లో విద్యా రుణాలను ఇవ్వడం, ప్రాక్టీస్ ప్రారంభానికి తోడ్పాటుగా ఒకశాతం వడ్డీ రాయితీతో రుణాలను అందించడం లక్ష్యంగా ఈ దిశలో ముందుకు కదులుతున్నట్లు తెలిపారు. మహిళలకు సొంత కారు’ లక్ష్యంగా... మహిళల అభ్యున్నతి దిశలో మోటార్ కంపెనీలతోనూ ఒప్పందాలను కుదుర్చుకోడానికి వ్యూహ రచన చేస్తున్నట్లు ఉషా అనంతసుబ్రమణ్యన్ వెల్లడించారు. మహిళలకు సొంత కారు లక్ష్యంగా షోరూమ్ ధరలో 90 శాతం రుణం వారు పొందేలా చర్యలు తీసుకోవడం ఈ అవగాహన లక్ష్యంగా ఉండబోతున్నట్లు తెలిపారు.