
4,000 కోట్లు చెల్లిస్తా..!
♦ సుప్రీం ముందు మాల్యా ప్రతిపాదన
♦ స్పందనకు బ్యాంకులకు వారం గడువు
♦ ఏప్రిల్ 7కు కేసు విచారణ వాయిదా
న్యూఢిల్లీ: బ్యాంకులకు బకాయివున్న రుణ మొత్తం రూ.6,903 కోట్లలో రూ. 4,000 కోట్లు తిరిగి చెల్లించేస్తానని పీకల్లోతు కష్టాల్లో ఉన్న పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఈ మేరకు విజయ్‌మాల్యాతో పాటు ఆయన గ్రూప్ కంపెనీలు కింగ్‌ఫిషర్, యునెటైడ్ బ్రూవరీస్ (హోల్డింగ్స్) లిమిటెడ్, కింగ్‌ఫిషర్ ఫైన్‌వెస్ట్ (ఇండియా)లు సుప్రీంకోర్టుకు ఒక సీల్డ్ కవర్ సమర్పించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని కన్సార్షియంకు ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా రూ.4,000 కోట్ల చెల్లింపులకు సంసిద్ధతను వ్యక్తం చేశాయి. ఈ ప్రతిపాదనపై తమ అభిప్రాయాన్ని వారంలోగా తెలియజేయాలని బ్యాంక్స్ కన్సార్షియంకు జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్‌లతో కూడిన బెంచ్ సూచించింది.
కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. మాల్యా, కింగ్‌ఫిషర్ తరఫున సీనియర్ అడ్వొకేట్ సీఎస్ వైద్యనాథన్ ఈ ప్రతిపాదనను కోర్టుకు సమర్పించారు. ఈ ప్రతిపాదన ప్రతిని బ్యాంకింగ్ కన్సార్షియంకు కూడా అందించినట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాల్యాతో చర్చించి తాజా ప్రతిపాదనను రూపొందించినట్లు సైతం వివరించారు. వివిధ వ్యాపార వివాదాలకు సంబంధించి మాల్యా దాఖలు చేసిన కేసుల్లో రావాల్సివున్న మొత్తం వస్తే, మరో రూ.2,000 కోట్లు చెల్లిస్తామని ప్రతిపాదిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఇంతకుమించి వివరాలను ఆయన వెల్లడించలేదు.
నేపథ్యం ఇదీ...
వడ్డీలతో కలిపి మాల్యా వివిధ బ్యాంకులకు రూ. 9,000 కోట్లు బకాయివున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు గతంలో విన్నవించింది. ఈ బకాయిలపై న్యాయ ప్రక్రియను ఎదుర్కొంటున్న మాల్యా దేశం విడిచి వెళ్లినట్లు మార్చి 9న కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. మాల్యా పాస్‌పోర్టును స్వాధీనం చేసుకుని, ఆయనను కోర్టు ముందు ప్రవేశపెట్టేలా ఆదేశాలు ఇవ్వాలని బ్యాంకుల కన్సార్షియం పిటిషన్ విచారణ సందర్భంగా... ఆయన అప్పటికే దేశం విడిచి వెళ్లిన విషయాన్ని కేంద్రం సుప్రీంకు తెలియజేసింది. దీంతో మాల్యాకు నోటీసులు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం.. రాజ్యసభ ఆయన కార్యాలయ ఈ-మెయిల్ ద్వారా, లండన్‌లోని ఇండియన్ హై కమిషన్ ద్వారా నోటీసులను మాల్యాకు అందించడానికి ఆదేశాలు ఇచ్చింది.
మాల్యా వస్తారా...?
మాల్యా భారత్‌కు తిరిగి వస్తారా...? లేదా? అసలు ఎక్కడ ఉన్నారు? అని కూడా సైతం బెంచ్ ఆయన తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. దీనికి న్యాయవాది సమాధానం ఇస్తూ... ఆయన విదేశాల్లో ఉన్న విషయాన్ని తెలిపారు. మంగళవారమే తాను ఆయనతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడినట్లు చెప్పారు. మీడియా సమస్యను జటిలం చేస్తోందన్నది మాల్యా అభిప్రాయమని కూడా తెలిపారు. ఎప్పుడు దేశానికి వస్తారన్న విషయాన్ని మాత్రం ఆయన సూటిగా వివరించలేదు. దీనికి బెంచ్ స్పందిస్తూ.. మీడియా మొత్తంమీద ప్రజా ప్రయోజనాలవైపే నిలబడుతుందికదా? అని వ్యాఖ్యానించింది. బ్యాంకుల డబ్బు బ్యాంకులకు తిరిగిరావాలనే మీడియా కోరుతోందని పేర్కొంది.
ప్రతిపాదన పరిశీలిస్తాం: ఎస్‌బీఐ
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ నుంచి తమకు బకాయిల చెల్లింపులకు సంబంధించి ప్రతిపాదన అందిన విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ధ్రువీకరించింది. ఇతర కన్సార్షియం బ్యాంకులతో కలిసి దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతిపాదన మొత్తాలను ప్రకటన ప్రస్తావించలేదు. మాల్యా గ్రూప్ సంస్థలకు రుణాలను అందజేసిన బ్యాంకింగ్ కన్సార్షియంలో ఎస్‌బీఐతో పాటు, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్, యూకో బ్యాంక్, దేనా బ్యాంకులు ఉన్నాయి. ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకులు ఇప్పటికే మాల్యాను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించాయి.