
మళ్లీ ఊరిస్తున్న మాల్యా
ముంబై: ఇదిగో వస్తున్నా..అదిగో వస్తున్నా.అంటూ ఊరిస్తున్న బిజినెస్ టైకూన్ విజయ్ మాల్యా మరోసారి తాను ఇండియాకు వస్తానంటూ ప్రకటించారు. అదీ కొన్ని ప్రత్యేక షరతులతో.. తనకు పూర్తి భద్రత కల్పిస్తే వస్తానంటూ పాతపాటే పాడుతున్నారు. రుణాల చెల్లిపుల విషయంలో అన్నివైపుల నుంచి ఉచ్చు బిగుస్తున్న నేపథ్యంలో వ్యాపార వేత్త విజయ మాల్యా భారతదేశానికి తిరిగి వచ్చేందకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ముంబైలో శుక్రవారం జరిగిన యునైటెడ్ బ్రెవరేజెస్ లిమిటెడ్ డైరెక్టర్స్ బోర్డు సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న మాల్యా రక్షణకు సరైన హామీ లభిస్తే త్వరలోనే తాను ఇండియాకు తిరిగి రానున్నట్టు తెలిపారు.
భద్రత, స్వేచ్ఛ, రక్షణకు సంబంధించి హామీ లభిస్తే ఇండియా తిరిగి వచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించినట్టు సమాచారం. రుణాల చెల్లింపులో బ్యాంకులతో చర్చలు జరపనున్నట్టు మాల్య తమకు హామీ ఇచ్చారని ఇండిపెండెంట్ ప్రతినిధి కిరణ్ మజుందార్ షా తెలిపారు. మాల్యా ప్రతిపాదనలకు బోర్డ్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్టు మరో ఇండిపెండెంట్ ప్రతినిధి సీవై పాల్ వెల్లడించారు. అలాగే కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సిబ్బంది జీతాల చెల్లింపునకు తాను చేసిన ప్రయత్నాలు తన ఆస్తులు సీజ్ చేయాలనే కర్నాటక హైకోర్టు నిర్ణయం మూలంగా విఫలమయ్యాయన్నారని చెప్పారు. ఇండియాకు తిరిగి వచ్చిన అనంతరం తనపై వచ్చిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారన్నారు. మనీ లాండరింగ్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని మాల్యా వాదించారనీ, ఆధారాలు లేని ఆరోపణలని కొట్టి పారేసారని తెలిపారు.
కాగా బ్యాంకుల కన్సార్టియానాకి 9 వేల కోట్లకు పైగా బకాయి పడి విదేశాల్లో తలదాచుకున్న విజయ్ మాల్యా, రుణాల చెల్లింపుకు గడువుల గడువుల మీద విధిస్తూ బేరసారాలకు దిగాడు. ఆయన ప్రతిపాదనలకు కన్సార్టియం ససేమిరా అనడంతో వివాదం మరింత సాగుతోంది. అటు మనీ లాండరింగ్ కేసులో మాల్యాను ప్రశ్నించేందుకు ఈడీ చూస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు రెడ్ కార్నర్ నోటీసులు, గోవాలోని ఆయన విల్లా స్వాధీనం తెలిసిందే.