పారిపోలేదు, రుణ ఎగవేతదారును కాను | Vijay Mallya says he is no defaulter or absconder | Sakshi
Sakshi News home page

పారిపోలేదు, రుణ ఎగవేతదారును కాను

Published Mon, Mar 7 2016 6:42 AM | Last Updated on Sun, Sep 3 2017 7:09 PM

పారిపోలేదు, రుణ ఎగవేతదారును కాను

పారిపోలేదు, రుణ ఎగవేతదారును కాను

నన్ను అలా చిత్రీకరించారు
* విజయ్ మాల్యా ఆవేదన
న్యూఢిల్లీ: కింగ్ ఫిషర్ కేసులో తాను పారిపోతున్నట్లుగా చిత్రీకరించారని విజయ్ మాల్యా ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని బ్యాంకుల మొండి బకాయిలకు తానే కారణమన్నట్లుగా ప్రచారం చేశారని ఆయన విరుచుకుపడ్డారు. కింగ్ ఫిషర్ కార్యకలాపాలు ఆపేసిన తర్వాత బ్యాంకులు తాము తనఖా పెట్టిన షేర్లను విక్రయించి రూ.1,244 కోట్లు నగదును పొందాయని మాల్యా పేర్కొన్నారు.

దీనికి అదనంగా రూ.600 కోట్లు కర్నాటక హై కోర్టులో డిపాజిట్ చేశామని, అంతేకాకుండా యునెటైడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్‌కు చెందిన రూ.650 కోట్లను కూడా కర్నాటక హైకోర్ట్‌లో డిపాజిట్ చేశామని వివరించారు. ఈ మొత్తం రూ.2,494 కోట్లు అయిందని వివరించారు. బ్యాంకులతో వన్‌టైమ్ సెటిల్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నానని పేర్కొన్నారు.  

బ్యాంకుల మొత్తం మొండి బకాయిలు రూ.11 లక్షల కోటకు పైగా ఉన్నాయని, తమకంటే భారీ మొత్తంలో రుణాలు ఎగవేసిన వారిని కావాలని రుణాలు ఎగవేసిన వ్యక్తులుగా ఎందుకు ప్రకటించలేదని ఆయన ప్రశ్నించారు. యూబీ గ్రూప్ కింగ్ ఫిషర్‌లో రూ.4,000కోట్లు ఇన్వెస్ట్ చేసిందని, ఈ మొత్తం హరించుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులు తమ రుణాల్లో చాలాభాగం రికవరీ చేసుకోగలవని, కానీ తన గ్రూప్‌కు వచ్చిన నష్టం మాత్రం శాశ్వతమని పేర్కొన్నారు.
 
నేడు తీర్పు...
భారీ రుణ ఊబిలో కూరుకుపోయిన కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ 2012 నుంచి కార్యకలాపాలు నిలిపేసిన విషయం తెలిసిందే. బ్యాంకులకు రూ.7,000 కోట్ల వరకూ బకాయిలు ఉన్నాయి.  ఇటీవలే యునెటైడ్ స్పిరిట్స్ చైర్మన్ పదవి నుంచి వైదొలగిన ఆయన దానికి ప్రతిఫలంగా రూ.515 కోట్ల ప్యాకేజీకి అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే తమ బకాయిల కింద ఈ ప్యాకేజీని ఇప్పించాల్సిందిగా డెట్ రికవరీ ట్రిబ్యూనల్(డీఆర్‌టీ)ను కింగ్ ఫిషర్‌కు రుణమిచ్చిన ఎస్‌బీఐ ఆశ్రయిం చింది.  

ఈ కేసులో నేడు(సోమవారం) తీర్పు వెలువడనుంది. కాగా, ఈ ప్యాకేజీ తన వ్యక్తిగతమని, ఒక్క యునెటైడ్ కింగ్‌డమ్‌లో తప్ప ఎక్కడా వీటిపై ఎవరికీ హక్కు ఉండదని మాల్యా స్పష్టం చేశారు.  తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి దర్యాప్తు సంస్థలకూ పూర్తిగా సహకరిస్తానని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement