హైదరాబాద్: పారిశ్రామికవేత్త విజయ మాల్యా గైర్హాజరు కావడంతో జీఎంఆర్, కింగ్ ఫిషర్ వివాదంలో దాఖలైన కేసులో తీర్పును కోర్టు వాయిదా వేసింది. జీఎంఆర్ దాఖలు చేసిన చెక్ బౌన్స్ కేసును విచారించిన మూడవ స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు , తీర్పును వాయిదా వేసింది. ఈ కేసులో నిందితుడు, మద్యం వ్యాపారి విజయ్ మాల్యా పరోక్షంలో తీర్పు వెల్లడించలేమని స్పష్టం చేసింది. జీఎంఆర్ యాజమాన్యం దాఖలు చేసిన చెల్లని చెక్కుల కేసులో మూడో ప్రత్యేక న్యాయస్థానం మెజిస్ట్రేట్ జస్టిస్ కృష్ణారావు ఈరోజు మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. మాల్యా హాజరుకాకుండా తీర్పు చెప్పలేమని స్పష్టం చేసిన న్యాయమూర్తి , తదుపరి విచారణను ఈనెల 25వ తేదీకి వాయిదా వేశారు.
హైదరాబాద్‌లో జీఎంఆర్ విమానాశ్రయాన్ని వినియోగించుకున్నందుకు కింగ్‌ఫిషర్ సంస్థ రూ.25కోట్లకు పైగా బకాయి పడింది. రాజీ తర్వాత రూ.22కోట్లు ఇచ్చేందుకు కింగ్‌ఫిషర్ యాజమాన్యం అంగీకరించింది. ఈ నేపథ్యంలో కింగ్ ఫిషర్, జీఎంఆర్‌కు చెక్కులను అందజేసింది. బ్యాంకుల్లో తగిన డబ్బు నిల్వ లేకపోవడంతో ఆ చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో జీఎంఆర్ సంస్థ 17 కేసులు పెట్టింది. ఈ కేసులో నెగోషబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం రూ.50లక్షల వంతున రెండు చెక్కులకు సంబంధించిన కేసులో మాల్యాను న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. శిక్షను ఖరారు చేస్తూ తుది తీర్పును వెలువరించాల్సి ఉంది. అయితే విచారణకు మాల్యా హాజరుకాకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా బ్యాంకుల కన్సార్టియానికి 9వేల కోట్ల రూపాయలకు పైడా బకాయి పడ్డ విజయ్ మాల్యా లండన్ లో తలదాచుకున్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించేందుకు జీఎమ్మార్ సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
మాల్యాపై తీర్పు మే 25 కి వాయిదా
Published Mon, May 9 2016 6:54 PM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM
Advertisement