
విజయా బ్యాంక్ లాభం 4 రెట్లు అప్
క్యూ3లో రూ.230 కోట్లు..
బెంగళూరు: విజయా బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో నాలుగు రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.53 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.230 కోట్లకు పెరిగిందని విజయా బ్యాంక్ తెలిపింది. ట్రేడింగ్ లాభాలు అధికంగా ఉండటం, రిటైల్ రుణాలు 22 శాతం వృద్ధి చెందడం తదితర కారణాల వల్ల ఈ స్థాయి నికర లాభం సాధించామని విజయా బ్యాంక్ ఈడీ, బి.ఎస్. రామారావు చెప్పారు.
మొత్తం ఆదాయం రూ.3,237 కోట్ల నుంచి రూ.3,714 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. స్థూల మొండి బకాయిలు 4.32 శాతం నుంచి 6.98 శాతానికి, నికర మొండి బకాయిలు 2.98 శాతం నుంచి 4.74 శాతానికి పెరిగాయని తెలిపారు. ఫలితంగా మొండి బకాయిలకు కేటాయింపులు రూ.279 కోట్ల నుంచి రూ.424 కోట్లకు పెంచామని పేర్కొన్నారు.
నికర లాభం జోరుతో బీఎస్‌ఈలో విజయ బ్యాంక్ షేర్ 20 శాతం పెరిగి రూ.64 వద్ద ముగిసింది. ఇది ఏడాది గరిష్ట స్థాయి.