
న్యూఢిల్లీ: వొడాఫోన్ ఐడియా కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ.4,973 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయి. 42.2 కోట్ల మంది వినియోగదారులతో భారత్‌లో అతి పెద్ద టెలికం కంపెనీగా అవతరించిన ఈ కంపెనీ రూ.7,663 కోట్ల ఆదాయాన్ని (కన్సాలిడేటెడ్) ఆర్జించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి స్థూల రుణభారం రూ.1,26,100 కోట్లుగా ఉందని వొడాఫోన్ ఐడియా తెలిపింది. రూ.13,600 కోట్ల నగదు, నగదు సమానమైన నిల్వలున్నాయని, నికర రుణభారం రూ.1,12,500 కోట్లని కంపెనీ సీఈఓ బాలేశ్ శర్మ చెప్పారు.
ఏఆర్‌పీయూ... అంచనాలు మిస్
టెలికం ప్లాన్‌ల విషయంలో ధరల పోరు ప్రభావం కొనసాగుతోందని, వినియోగదారులు చౌక–ధరల ప్లాన్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారని బాలేశ్ శర్మ పేర్కొన్నారు. ఫలితంగా ఒక్కో వినియోగదారుడిపై లభించే సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) ఈ క్యూ2లో 4.7 శాతం తగ్గి రూ.88కు పడిపోయిందని (సీక్వెన్షియల్‌గా) వివరించారు. క్యూ1లో ఈ కంపెనీ ఏఆర్‌పీయూ రూ. 100 గా ఉంది.
రూ.25,000 కోట్లు సమీకరణ !
కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ రూ.25,000 కోట్ల మూలధన నిధుల సమీకరణ కోసం కసరత్తు చేస్తోందని బాలేశ్ శర్మ తెలిపారు. ప్రమోటర్ సంస్థలు–వొడాఫోన్ గ్రూప్ రూ.11,000 కోట్లు, ఆదిత్య బిర్లా గ్రూప్ రూ.7,250 కోట్లు చొప్పున మొత్తం రూ.18,250 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చా యని వివరించారు. ఫైబర్ నెట్‌వర్క్ విభాగాన్ని విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.
తొలి ఫలితాలు..: ఐడియా కంపెనీలో వోడాఫోన్ విలీనం ఈ ఏడాది ఆగస్టు 31న పూర్తయింది. ఈ విలీనం తర్వాత ఏర్పడిన వొడాఫోన్ ఐడియా కంపెనీ వెలువరించిన తొలి ఆర్థిక ఫలితాలు ఇవి. ఈ ఆర్థిక ఫలితాల్లో ఈ ఏడాది జూలై–ఆగస్టు వరకూ ఐడియా ఫలితాలు, ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 30 వరకూ ఓడాఫోన్ ఐడియా ఫలితాలు కలిసి ఉన్నాయని, అందుకని గత క్యూ2లో ఐడియా ఫలితాలతో ఈ క్యూ2 వొడాఫోన్ ఐడియా ఫలితాలను పోల్చడానికి లేదని బాలేశ్ శర్మ వివరించారు. విలీన ప్రయోజనాలు అందుకునే దిశగా పయనం సాగిస్తున్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment