ఒడిదుడుకుల వారం.. | Volatility Ahead As Derivatives Expiry May Keep Markets On Edge | Sakshi
Sakshi News home page

ఒడిదుడుకుల వారం..

Published Mon, Sep 26 2016 12:44 AM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM

ఒడిదుడుకుల వారం..

ఒడిదుడుకుల వారం..

ఈ నెల 29న డెరివేటివ్స్ ముగింపు
వచ్చే వారంలో ఆర్‌బీఐ పాలసీ
వడ్డీరేట్ల ప్రభావిత షేర్లపై ఇన్వెస్టర్ల చూపు

న్యూఢిల్లీ: డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా ఈ వారంలో స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు గురవుతాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. తక్షణ ప్రధాన సంఘటనలేవీ లేనందున అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతాయని వారంటున్నారు. సెప్టెం బర్ నెల డెరివేటివ్ కాంట్రాక్టులు ఈ గురువారం(ఈ నెల 29) ముగుస్తాయని, దీంతో మార్కెట్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు.

ఎఫ్ అండ్ ఓ సెప్టెంబర్ కాంట్రాక్టులు ముగియనున్నందున ఈ వారంలో సాధారణం కంటే అధికంగానే ఒడిదుడుకులుంటాయని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ రోహిత్ గాడియా చెప్పారు.  వచ్చే వారంలో ఆర్‌బీఐ పాలసీ నేపథ్యంలో వడ్డీరేట్ల ప్రభావిత రంగ షేర్లలో లావాదేవీల జోరు ఉండొచ్చని కోటక్ సెక్యూరిటీస్  సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపేన్ షా పేర్కొన్నారు. డాలర్‌తో రూపాయి మారకం, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల కదలికలు కూడా మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని వివరించారు. డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, విదేశీ పెట్టుబడుల జోరు ఈ వారంలో స్టాక్ మార్కెట్‌ను నిర్దేశిస్తాయని ఎస్‌ఎంసీ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ అడ్వైజర్స్  సీఎండీ డి.కె. అగర్వాల్ పేర్కొన్నారు.

 పతనానికి బ్రేక్!
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ, వర్షపాత గణాంకాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతాయని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ పేర్కొన్నారు. వచ్చే వారంలో అల్జీరియాలో ఇంధన సమావేశం జరగనున్న నేపథ్యంలో చమురు ధరల్లో కూడా ఒడిదుడుకులుంటాయని వివరించారు. సరఫరాల జోరును నియంత్రించి ధరల పతనాన్ని నిరోధించే ప్రణాళికను ఈ ఇంధన సమావేశం రూపొందించగలదన్న అంచనాలు బాగా ఉన్నాయని పేర్కొన్నారు. ద్రవ్య విధాన కమిటీ(మోనేటరీ పాలసీ కమిటీ-ఎంపీసీ)లో కొత్తగా ముగ్గురు సభ్యుల నియామకం కారణంగా వచ్చే నెల నాలుగున జరిగే ఆర్‌బీఐ పాలసీ ఎలా  ఉండనున్నదోనని మార్కెట్ ఆసక్తిగా ఎదురు చూస్తోందని తెలిపారు.

జీఎస్‌టీ సమావేశం, రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేయడం, తదితర ఇటీవల పరిణామాలు మార్కెట్ పతనాన్ని కొంత మేర నిరోధించవచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు.  భవిష్యత్ ద్రవ్య విధానాలపై వివిధ దేశాల కేంద్ర బ్యాంక్‌ల అభిప్రాయాలపై ఇన్వెస్టర్లు ఒక కన్నేసి ఉంచారని పేర్కొన్నారు.

 బ్యాంక్ షేర్లపై ఫోకస్
స్టాక్ సూచీల గమనాన్ని విదేశీ పెట్టుబడులు నిర్దేశిస్తాయని ట్రేడ్‌బుల్స్ సీఈఓ ధ్రువ్ దేశాయ్ పేర్కొన్నారు. వచ్చే వారం ఆర్‌బీఐ పాలసీ ఉన్నందున బ్యాంక్ షేర్లు వెలుగులో ఉంటాయని ఆయన అంచనా వేస్తున్నారు. పై స్థాయిల్లో లాభాల స్వీకరణ ఉంటుందని, ఫలితంగా మార్కెట్లో ఒడిదుడుకులు తప్పవని పేర్కొన్నారు. ఇక అంతర్జాతీయ అంశాల విషయానికొస్తే, అమెరికాలో ఆగస్టు నెలకు సంబంధించి కొత్త ఇళ్ల గణాంకాలు సోమవారం(ఈ నెల 26న), వినియోగదారుల విశ్వాస గణాంకాలు మంగళవారం(ఈ నెల 27న), రెండో క్వార్టర్ అమెరికా జీడీపీ గణాంకాలు గురువారం(29న), ఇంగ్లండ్ క్యూ2 జీడీపీ గణాంకాలు శుక్రవారం(ఈ నెల 30న) వెలువడతాయి.

మరింత జోరుగా విదేశీ పెట్టుబడులు..
భారత క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. డిపాజిటరీల గణాంకాల ప్రకారం ఈనెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్లో రూ.5,643 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.3,905 కోట్లు చొప్పున పెట్టుబడులు పెట్టారు. వెరశి మన క్యాపిటల్ మార్కెట్లో వీరి నికర పెట్టుబడులు రూ.9,549 కోట్లుగా ఉన్నాయి. జీఎస్‌టీ అమలు సంబంధిత చర్యలు వేగంగా జరుగుతుండడం, కరెంట్ అకౌంట్ లోటు తగ్గడం, వంటి సానుకూలాంశాలు దీనికి కారణాలు.

కార్పొరేట్ బాండ్లలో విదేశీ ఇన్వెస్టర్లు నేరుగా పెట్టుబడులు పెట్టడానికి మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ అనుమతించడంతో ఈ జోరు మరికొన్ని వారాలు కొనసాగవచ్చని నిపుణులంటున్నారు. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో రూ.46,493 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, డెట్ మార్కెట్ నుంచి రూ.3,442 కోట్లు ఉపసంహరించుకున్నారు. వెరశి వీరి నికర పెట్టుబడులు రూ.43,051 కోట్లుగా ఉన్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement