భారత్లో పోలోకార్ల డెలివరీ నిలిపివేత
ఫ్రాంక్ ఫర్ట్ : జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్ వాగన్ భారత్లో హాచ్ బ్యాక్ పోలో కార్ల డెలివరీలను నిలిపివేయాలని తమ డీలర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇదివరకే డీజిల్ కార్లకు ఒకే రకమైన సాఫ్ట్వేర్ వాడి కస్టమర్లను మోసం చేసినట్లు అంగీకరించిన సంస్థ, భారత్ లో తమ విక్రయాలను కొంత కాలం ఆపడానికి స్పష్టమైన కారణాలను మాత్రం పేర్కొనలేదు. అయితే మరో నోటీస్ ఇచ్చే వరకు పోలోలోని అన్ని వేరియంట్లలో ఎలాంటి డేలవరీలు చేయకూడదని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డీలర్లకు లేఖ పంపింది.
ప్రపంచవ్యాప్తంగా 1.1కోట్ల డీజిల్ కార్లకు ఒకే రకమైన సాఫ్ట్వేర్ వాడి కస్టమర్లను మోసం చేసినట్లు ఫోక్స్ వాగన్ సంస్థ అంగీకరించిన విషయం తెలిసిందే. తొలుత కేవలం అమెరికాలోని 5లక్షల కార్లలో మాత్రమే లోపాలున్నట్లు తెలిపిన సంస్థ యాజమాన్యం ఆ తర్వాత భారీ మోసాన్ని అంగీకరించింది. అయితే ఈ కార్లకు సంస్థ ఇదివరకు చెప్పిన ఇంజిన్ అమర్చాలంటే భారత కరెన్సీలో అక్షరాలా 48.10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.