సాక్షి, ముంబై : ప్రపంచంలోని అతిపెద్ద రీటైలర్ సంస్థ వాల్‌మార్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియా యూనిట్‌కు చెందిన 56 మంది ఎగ్జిక్యూటీవ్‌లను ఆ సంస్థ తొలగించింది. అందులో 8 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా ఉన్నారు. ఉద్యోగుల తొలగింపు వాస్తవమేనని వాల్‌మార్ట్ ఇండియా సీఈఓ క్రిష్ అయ్యార్ ఓ ప్రకటనలో తెలిపారు. 2019లో తమ సంస్థ అమ్మకాల్లో 22శాతం వృద్ధి కనబరిచిందని తెలిపారు. ఆరు మోడ్రన్ హోల్‌సేల్ స్టోర్లను, ఒక ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించామని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో తమ సభ్యులకు మెరుగైన సేవలు అందించడానికి భారీగా పెట్టుబడలు పెట్టామని.. భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగిస్తామని వెల్లడించారు. బ్రిక్ అండ్ మోర్టర్ స్టోర్లతో పాటు ఈ కామర్స్‌లో పెట్టబడులు పెట్టామని తెలిపారు.
అలాగే మరింత సమర్ధవంతంగా పనిచేయడానికి మార్గాలను అన్వేషిస్తున్నట్టు క్రిష్ చెప్పారు. అందుకోసం సరైన మార్గాల్లో వెళ్లేందుకు తమ సంస్థ కార్పొరేట్ నిర్మాణాన్ని సమీక్షించాల్సి ఉందన్నారు. అందులో భాగంగానే 56 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు స్పష్టం చేశారు. రెండో దశలో భాగంగా ఏప్రిల్‌లో మరిన్ని తొలగింపులు ఉంటాయనే ప్రచారం జరగగా.. ఈ సందర్భంగా క్రిష్ వాటిని ఖండించారు. మరోవైపు దేశంలో హోల్‌సేల్ విభాగంలో నుంచి నిష్క్రమించే ఆలోచన లేదని, క్యాష్ అండ్ క్యారీ వ్యాపార అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వాల్‌మార్ట్ సంస్థ తెలిపింది. కాగా, భారత మార్కెట్లోకి ప్రవేశించిన ఒక దశాబ్దం తరువాత కూడా అమ్మకాలు పెద్దగా పుంజుకోకపోవడంతో వాల్‌మార్ట్ ఇండియా ముంబై కేంద్రాన్ని మూసివేయాలని యోచిస్తోందనే ప్రచారం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment