
కరోనా వైరస్ సెకండ్ వేవ్‌లో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుండటంతో తలెత్తిన ఆందోళనలకుతోడు.. ర్యాలీ బాటలో సాగుతున్న మార్కెట్లలో ట్రేడర్ల లాభాల స్వీకరణ కారణంగా మంగళవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. డోజోన్స్ 397 పాయింట్లు(1.5 శాతం) క్షీణించి 25,890 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 34 పాయింట్లు(1 శాతం) నీరసించి 3,145 వద్ద ముగిసింది. నాస్‌డాక్ సైతం 90 పాయింట్లు(0.9 శాతం) నష్టంతో 10,344 వద్ద స్థిరపడింది. వెరసి చరిత్రాత్మక గరిష్టం నుంచి నాస్‌డాక్ వెనకడుగు వేయగా.. ఎస్‌అండ్‌పీ ఐదు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌పడింది.
యూరోప్ వీక్
మే నెలలో పారిశ్రామికోత్పత్తి 7.8 శాతమే పుంజుకున్నట్లు జర్మన్ ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. విశ్లేషకులు 10 శాతం పురోగతిని అంచనా వేయడంతో మార్కెట్లలో అమ్మకాలు తలెత్తాయి. ఫలితంగా మంగళవారం యూకే, ఫ్రాన్స్, జర్మనీ 0.6-1.5 శాతం మధ్య క్షీణించాయి. కాగా.. ప్రస్తుతం ఆసియాలో ఇండొనేసియా, చైనా, తైవాన్, హాంకాంగ్, థాయ్‌లాండ్ 1.4-0.3 శాతం మధ్య బలపడి ట్రేడవుతున్నాయి. ఇతర మార్కెట్లలో జపాన్, కొరియా 0.5-0.25 శాతం చొప్పున డీలాపడగా.. సింగపూర్ యథాతథంగా కదులుతోంది.
వాల్‌మార్ట్ జోరు
యూఎస్ ప్రభుత్వం కరోనా వైరస్‌కు చెక్ పెట్టే వ్యాక్సిన్ అభివృద్ధి కోసం 160 కోట్ల డాలర్లు(సుమారు రూ. 12,000 కోట్లు) కేటాయించడంతో ఫార్మా కంపెనీ నోవావాక్స్ ఇంక్ షేరు దాదాపు 32 శాతం దూసుకెళ్లింది. ఈ బాటలో 4.5 కోట్ల డాలర్లు పొందడంతో రీజనరాన్ ఫార్మా 2.2 శాతం పుంజుకుంది. అమెజాన్ ప్రైమ్ సర్వీస్‌కు పోటీగా మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించడంతో రిటైల్ రంగ దిగ్గజం వాల్‌మార్ట్ ఇంక్ 7 శాతం జంప్‌చేసింది. దీంతో అమెజాన్ షేరు 2 శాతం నీరసించింది. ఇండియాలోనూ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిఫ్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ ప్రధాన వాటా కొనుగోలు చేసిన విషయం విదితమే. ఇటీవల రికార్డ్ గరిష్టాలను తాకుతున్న ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ షేరు మరో 1.3 శాతం బలపడి 1390 డాలర్లకు చేరింది. ఇంట్రాడేలో 1425 డాలర్లను అధిగమించింది.
నేలచూపులో
ఇతర బ్లూచిప్స్‌లో టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 1.2 శాతం నీరసించగా.. యునైటెడ్ ఎయిర్‌లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్ 7 శాతం చొప్పున పతనమయ్యాయి. ఈ బాటలో కరిబియన్, నార్వేజియన్ క్రూయిజర్ షేర్లు 5 శాతం చొప్పున నష్టపోయాయి. యూఎస్‌లోని ఆరిజోనా, టెక్సాస్ తదితర రాష్ట్రాలతోపాటు ఆస్ట్రేలియా, బ్రిటన్‌లోని మరికొన్ని ప్రాంతాలలో కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment