♦ రూ. 1,800 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్
♦ దేశీ రియల్టీలో భారీ ఎఫ్‌డీఐ డీల్
ముంబై : దేశీ రియల్ ఎస్టేట్ రంగంలో అత్యంత భారీ ఎఫ్‌డీఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు)కి తెర తీసింది అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం వార్‌బర్గ్ పింకస్. తాజాగా పిరమాల్ రియల్టీలో రూ. 1,800 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ప్రతిగా పిరమాల్ రియల్టీలో వార్‌బర్గ్ పింకస్‌కు రెండు స్థానాలు దక్కుతాయి. కొత్తగా వచ్చే నిధులను వివిధ ప్రాజెక్టుల అభివృద్ధికి ఉపయోగించనున్నట్లు పిరమాల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆనంద్ పిరమాల్ తెలిపారు. 1997లో పిరమాల్ హెల్త్‌కేర్‌లో ఇన్వెస్ట్ చేసిన వార్‌బర్గ్ పింకస్ తాజాగా తమ గ్రూప్‌కే చెందిన మరో సంస్థలో పెట్టుబడులు పెట్టడంపై పిరమాల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమాల్ హర్షం వ్యక్తం చేశారు. దేశీ రియల్టీ అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునేందుకు వార్‌బర్గ్ పెట్టుబడులు, అనుభవం దోహదపడగలవని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు.
ముంబై కేంద్రంగా పనిచేసే తమ సంస్థ ప్రధానంగా అదే నగరంలో ప్రాజెక్టులపై దృష్టి పెట్టనున్నట్లు అజయ్ పిరమాల్ పేర్కొన్నారు. బైకులా, వర్లి తదితర ప్రాంతాల్లో పిరమాల్ రియల్టీ సుమారు 10 మిలియన్ చ.అ.ల ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. మరోవైపు, అధిక వృద్ధి అవకాశాలు ఉన్న సంస్థల్లో పెట్టుబడులు పెట్టే వ్యూహంలో భాగంగానే పిరమాల్ రియల్టీలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వార్‌బర్గ్ పింకస్ ఇండియా కో-హెడ్ నితిన్ మల్హన్ వివరించారు. 1966లో ప్రారంభమైన వార్‌బర్గ్ పింకస్ ప్రస్తుతం 120 పైచిలుకు రంగాల్లో 35 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులను నిర్వహిస్తోంది. గంగవరం పోర్టు, దైనిక్ భాస్కర్ తదితర సంస్థల్లో ఇన్వెస్ట్ చేసింది.
పిరమాల్ రియల్టీలో వార్‌బర్గ్ పెట్టుబడులు
Published Wed, Jul 22 2015 12:18 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM
Advertisement
Advertisement