Warburg Pincus
-
కల్యాణ్ జ్యువెలర్స్‌లో వార్బర్గ్ 6.45% వాటా విక్రయం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం వార్బర్గ్ పింకస్ తాజాగా కల్యాణ్ జ్యుయలర్స్‌లో 6.45 శాతం వాటాను విక్రయించింది. స్టాక్ ఎక్సే్చంజీల్లో నిర్వహించిన ఈ ఓపెన్ మార్కెట్ లావాదేవీ విలువ సుమారు రూ. 3,584 కోట్లు. డేటా ప్రకారం వార్బర్గ్ పింకస్ అనుబంధ సంస్థ హైడెల్ ఇన్వెస్ట్మెంట్ 6.65 కోట్ల షేర్లను సగటున ఒక్కో షేరును రూ. 539.10 రేటు చొప్పున విక్రయించింది.వీటిని ఫిడిలిటీ, నోమురా తదితర సంస్థలు కొనుగోలు చేశాయి. హైడెల్ ఇన్వెస్ట్మెంట్ షేరు ఒక్కింటికి రూ. 535 రేటు చొప్పున ఇంకో 2.36% వాటాను కంపెనీ ప్రమోటర్, ఎండీ టీఎస్ కల్యాణరామన్‌కి రూ. 1,300 కోట్లకు విక్రయించనుంది. ఇందుకోసం ప్రమోటరు, హైడెల్ ఇన్వెస్ట్మెంట్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. -
ఐడీఎఫ్సీ ఫస్ట్‌లో వాటా విక్రయం
న్యూఢిల్లీ: పీఈ దిగ్గజం వార్బర్గ్ పింకస్ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ నుంచి పూర్తిగా వైదొలగింది. తాజాగా బ్యాంకులోగల మొత్తం 2.25 శాతం వాటాను విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా షేరుకి రూ. 75.24 సగటు ధరలో 15.88 కోట్ల బ్యాంకు షేర్లను అమ్మివేసింది. వీటి విలువ రూ. 1,195 కోట్లుకాగా.. క్లోవర్‌డెల్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా 2023 డిసెంబర్‌కల్లా ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లో 2.25 శాతం వాటాను కలిగి ఉంది. అయితే కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు. గతేడాది సెప్టెంబర్‌లోనూ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌లో 4.2% వాటాను వార్బర్గ్ పింకస్ రూ. 2,480 కోట్లకు విక్రయించిన విషయం విదితమే. కాగా.. గురువారం బీఎస్ఈలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేరు 3.1% క్షీణించి రూ. 75.4 వద్ద ముగిసింది. -
యాడ్వెంట్ చేతికి యురేకా ఫోర్బ్స్!
ముంబై: కన్జూమర్ డ్యురబుల్స్ కంపెనీ యురేకా ఫోర్బ్స్ కొనుగోలు రేసులో పీఈ దిగ్గజం యాడ్వెంట్ ఇంటర్నేషనల్ ముందు నిలవనున్నట్లు తెలుస్తోంది. వ్యాక్యూమ్ క్లీనర్లు, వాటర్ ప్యూరిఫయర్స్ దిగ్గజం యురేకా ఫోర్బ్స్ విక్రయానికి వీలుగా ప్రమోటర్ గ్రూప్ షాపూర్జీ పల్లోంజీ ఇప్పటిఏ బిడ్స్‌ను ఆహ్వానించిన విషయం విదితమే. కంపెనీ కొనుగోలు రేసులో పీఈ దిగ్గజాలు యాడ్వెంట్ ఇంటర్నేషనల్, వార్బర్గ్ పింకస్తోపాటు.. స్వీడిష్ హోమ్ అప్లయెన్సెస్ కంపెనీ ఎలక్ట్రోలక్స్ బిడ్స్ పోటీపడుతున్నట్లు సంబంధిత వర్గాలు జూన్‌లో పేర్కొన్నాయి. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌నకు చెందిన ఫోర్బ్స్ అండ్ కంపెనీకి అనుబంధ సంస్థే యురేకా ఫోర్బ్స్. కోవిడ్–19 పరిస్థితుల తదుపరి ఆరోగ్యం, పరిశుభ్రత, గృహ సౌకర్యాలు(హోమ్ ఇంప్రూవ్మెంట్) విభాగంపై అధిక దృష్టిపెట్టిన గ్రూప్ యురేకా ఫోర్బ్స్‌ను విక్రయించేందుకు నిర్ణయించింది. తద్వారా రుణ భారాన్ని సైతం తగ్గించుకునే యోచనలో ఉన్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. డీల్‌కు వీలుగా..: యురేకా ఫోర్బ్స్ విక్రయానికి అనువుగా డీల్‌ను కుదుర్చుకునేందుకు షాపూర్జీ గ్రూప్ అంతర్గత పునర్వ్యవస్థీకరణను చేపట్టనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫోర్బ్స్ అండ్ కంపెనీ నుంచి యురేకా ఫోర్బ్స్‌ను విడదీయనున్నట్లు తెలియజేశాయి. యురేకాను కొనుగోలు చేయడంలో యాడ్వెంట్ ఇంటర్నేషనల్‌కు అవకాశాలు అధికంగా ఉన్నట్లు అభిప్రాయపడ్డాయి. క్రాంప్టన్ గ్రీవ్స్ డీల్ ద్వారా లాభపడిన యాడ్వెంట్కు కన్జూమర్ విభాగంలో పట్టుండటం మద్దతుగా నిలవనున్నట్లు తెలియజేశాయి. రూ. 4,500–5,000 కోట్ల మధ్య విక్రయ ఒప్పందం కుదిరే అవకాశమున్నట్లు అంచనా వేశాయి. -
‘గంగవరం’.. అదానీ పరం!
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని గంగవరం పోర్ట్‌లో మెజారిటీ వాటాలు దక్కించుకోవడంపై అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం వార్బర్గ్ పింకస్‌కు పోర్టులో ఉన్న 31.5 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు రూ. 1,954 కోట్లు వెచ్చించనున్నట్లు అదానీ పోర్ట్స్ తాజాగా వెల్లడించింది. డీల్ ప్రకారం షేరు ఒక్కింటికి రూ. 120 ధర చొప్పున వార్బర్గ్ పింకస్‌కి ఉన్న మొత్తం 16.3 కోట్ల షేర్లను అదానీ పోర్ట్స్ కొనుగోలు చేయనుంది. అనుబంధ సంస్థ విండీ లేక్‌సైడ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వార్బర్గ్ పింకస్‌కు గంగవరం పోర్టులో వాటాలు ఉన్నాయి. ప్రమోటర్ల వాటాల కొనుగోలుకూ యత్నాలు గంగవరం పోర్టులో ప్రమోటర్లు డీవీఎస్ రాజు, కుటుంబ సభ్యులకు 58.1%, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 10.4% వాటాలు ఉన్నాయి. ప్రమో టర్ల వాటాలనూ కొనుగోలు చేయడం ద్వారా పోర్టులో మెజారిటీ వాటాలు దక్కించుకోవాలని అదానీ పోర్ట్స్ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో ప్రమోటర్లతో చర్చలు కూడా జరుపుతోందని పేర్కొన్నాయి. పోర్టు ప్రత్యేకతలివీ..: గంగవరం పోర్టు సామర్థ్యం 64 మిలియన్ మెట్రిక్ టన్నులు (ఎంఎంటీ) కాగా.. 2059 వరకూ రాయితీలు పొందేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనుమతులు ఉన్నాయి. 2019–20లో 34.5 ఎంఎంటీ కార్గోను పోర్టు హ్యాండిల్ చేసింది. 2 లక్షల డీడబ్ల్యూటీ సామర్థ్యం కలిగిన నౌకలు (వెసల్స్) సైతం పోర్టులో రాకపోకలు సాగించే వీలుంది. 9 బెర్తులతో కార్యకలాపాలు సాగిస్తోం ది. కోల్, ముడిఇనుము, ఎరువులు, లైమ్‌స్టోన్, స్టీల్ తదితర పలు కమోడిటీలను హ్యాండిల్ చేయ గల సౌకర్యాలను కలిగి ఉంది. గతేడాది గంగవరం పోర్ట్ రూ. 1082 కోట్ల ఆదాయాన్ని సాధించింది. రూ. 516 కోట్ల నికర లాభం ఆర్జించింది. పోర్ట్ రుణరహితమే కాకుండా రూ. 500 కోట్ల నగదు నిల్వలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. -
ఎయిర్టెల్ చేతికి టెలిమీడియా వాటా
న్యూఢిల్లీ: డీటీహెచ్ విభాగం భారతీ టెలిమీడియాలో 20 శాతం వాటాను తిరిగి సొంతం చేసుకోనున్నట్లు మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ తాజాగా పేర్కొంది. పీఈ దిగ్గజం వార్బర్గ్ పింకస్ నుంచి ఈ వాటాను రూ. 3,126 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. 2017 డిసెంబర్లో కుదుర్చుకున్న డీల్‌లో భాగంగా వార్‌బర్గ్‌కు చెందిన అనుబంధ సంస్థ లియన్ మెడో ఇన్వెస్ట్మెంట్ 2018లో భారతీ టెలిమీడియాలో 20 శాతం వాటాను పొందింది. ఇందుకు రూ.2,310 కోట్లు వెచ్చించింది. కాగా.. తాజాగా టెలిమీడియాలో వాటాను నగదు చెల్లింపు, ఈక్విటీ జారీ ద్వారా సొంతం చేసుకోనున్నట్లు ఎయిర్టెల్ తెలియజేసింది. షేరుకి రూ. 600 ధరలో 3.64 కోట్ల ఎయిర్టెల్ షేర్లను వార్‌బర్గ్‌కు జారీ చేయనుంది. వీటికి జతగా రూ.1,038 కోట్లవరకూ నగదును సైతం చెల్లించనున్నట్లు వివరించింది. భారతీ టెలిమీడియా డీటీహెచ్ బిజినెస్ డిసెంబర్ కల్లా 1.7 కోట్లమంది సబ్స్క్రయిబర్లను కలిగి ఉంది.(చదవండి: మొబైల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్) -
బోట్లో రూ. 731 కోట్ల వార్బర్గ్ పింకస్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: హెడ్‌ఫోన్స్, ఇయర్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్ వంటి కన్సూమర్ టెక్ ఉత్పత్తుల బ్రాండ్... బోట్లో అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ, వార్బర్గ్ పింకస్ 10 కోట్ల డాలర్లు (రూ.732 కోట్లు) పెట్టుబడులు పెట్టింది. వార్బర్గ్ పింకస్‌కు చెందిన అనుబంధ సంస్థ ఈ మేరకు తమ సంస్థలో ఇన్వెస్ట్ చేసిందని బోట్ వెల్లడించింది. ఈ లావాదేవీకి ఆర్థిక సలహాదారుగా అవెండాస్ క్యాపిటల్ వ్యహరించిందని పేర్కొంది. పరిశోధన, అభివృద్ధి(ఆర్ అండ్ డీ) విభాగాన్ని మరింత శక్తివంతం చేసుకోవడానికి, అగ్రస్థానంలో ఉన్న తమ మార్కెట్‌ను మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ తాజా నిధులను వినియోగిస్తామని వివరించింది. భారత్‌లో తయారీ కార్యక్రమం కింద వివిధ ఉత్పత్తుల తయారీకి దన్నుగా ఉండే వ్యవస్థల కోసం కూడా ఈ నిధులను ఉపయోగిస్తామని వివరించింది. ఐడీసీ(ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్) గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే అతి పెద్ద ఐదవ వేరియబుల్ (ధరించే ఉత్పత్తుల) బ్రాండ్ తమదేనని పేర్కొంది. -
ఆన్లైన్ బ్రాండ్ బోట్‌కు భారీ నిధులు
సాక్షి, బెంగళూరు : ఇయర్ ఫోన్స్, స్పీకర్లు తదితర ఉత్పత్తులను విక్రయించే కన్జూమర్ బ్రాండ్ బోట్(బీవోఏటీ) తాజాగా 10 కోట్ల డాలర్ల(సుమారు రూ. 730 కోట్లు) నిధులను అందుకుంది. గ్లోబల్ పీఈ కంపెనీ వార్బర్గ్ పింకస్ తాజాగా కంపెనీలో ఇన్వెస్ట్ చేసింది. దీంతో ఆన్లైన్ బ్రాండ్ కంపెనీ బోట్ విలువ 30 కోట్ల డాలర్లను(రూ. 2,200 కోట్లు) తాకినట్లు పరిశ్రమవర్గాలు అంచనా వేశాయి. కన్జూమర్ బ్రాండ్లను విక్రయించే బోట్ ప్రధానంగా చైనా తదితర విదేశీ కంపెనీల నుంచి పోటీని ఎదుర్కొంటోంది. తాజాగా లభించిన నిధులతో దేశీయంగా తయారీని పటిష్ట పరచుకోవడంతోపాటు.. వృద్ధి అవకాశాలను పెంచుకునేందుకు వినియోగించనున్నట్లు బోట్ ప్రమోటర్లు అమన్ గుప్తా, సమీర్ మెహతా వెల్లడించారు. (కొత్త కెమెరా ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్ల సందడి) ప్రభుత్వ పథకాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాభాల ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకానికి అనుగుణంగా ప్రొడక్టులను తయారు చేసే యోచనలో ఉన్నట్లు బోట్ ప్రమోటర్లు తెలియజేశారు. దేశీయంగా స్మార్ట్ వేరబుల్స్ ప్రొడక్టులను రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. దేశీ తయారుదారులకు పీఎల్ఐ పథకం పోటీ నుంచి రక్షణ కల్పిస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి ప్రాథమిక దశలో ఉన్నామని, రెండు.. మూడు త్రైమాసికాలలోగా మేడిన్ ఇండియా ప్రొడక్టులను విడుదల చేయగలమని వెల్లడించారు. ఔట్సోర్సింగ్, సొంత తయారీ ద్వారా 50-60 శాతం ప్రొడక్టులను రూపొందించే ప్రణాళికల్లో ఉన్నట్లు వివరించారు. కోవిడ్-19, సరిహద్దు వివాదాల నేపథ్యంలో చైనా నుంచి ప్రొడక్టుల దిగుమతులకు విఘాతం ఏర్పడినట్లు తెలియజేశారు. కాగా.. ఇవే ప్రతికూలతలతో ఇటీవల ఐవేర్ ప్రొడక్టుల సంస్థ లెన్స్‌కార్ట్ సైతం దేశీ తయారీవైపు దృష్టి సారించినట్లు నిపుణులు పేర్కొన్నారు. (చైనా పేమెంట్ యాప్‌లకు ట్రంప్ చెక్) రూ. 1,000 కోట్లు 2020 మార్చితో ముగిసిన గతేడాదిలో బోట్ రూ. 700 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 1,000 కోట్ల అమ్మకాలు నమోదు చేయగలదని అంచనా వేస్తోంది. అమెజాన్ ఇండియాలో ఆన్లైన్ బ్రాండుగా ప్రారంభమైన బోట్ నాణ్యతగల ఉత్పత్తులతో వేగంగా వృద్ధి సాధిస్తున్నట్లు గుప్తా పేర్కొన్నారు. వినియోగదారులకు చేరువయ్యే బాటలో సొంత ప్లాట్‌ఫామ్‌ను సైతం ఏర్పాటు చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆఫ్‌లైన్ ద్వారా కూడా 20 శాతం అమ్మకాలను సాధిస్తున్నట్లు చెప్పారు. కంపెనీ తొలినాళ్లలో 30 లక్షల డాలర్లు ఇన్వెస్ట్ చేసిన ఫైర్‌సైడ్ వెంచర్స్ కొంతమేర వాటాను వార్‌బర్గ్‌కు విక్రయించినట్లు తెలుస్తోంది. -
మెడ్‌ప్లస్‌పై వార్బర్గ్ పింకస్ కన్ను!
ముంబై, సాక్షి: దేశీ రిటైల్ ఫార్మసీ మార్కెట్ మరింత వేడెక్కనుంది. కోవిడ్-19 నేపథ్యంలో ఇటీవల ఔషధ విక్రయాలు ఊపందుకున్నాయి. అటు ఆఫ్‌లైన్(స్టోర్లు), ఇటు ఆన్లైన్ విక్రయాలు వేగవంతంగా పెరుగుతున్నాయి. దీంతో గత కొద్ది రోజులుగా దేశీ ఫార్మసీ విభాగంలో రిలయన్స్ రిటైల్, టాటా గ్రూప్, అమెజాన్ భారీ పెట్టుబడులతో సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ప్రధానంగా ఇతర కంపెనీలలో వాటాలను కొనుగోలు చేయడం ద్వారా వేగవంతంగా విస్తరించే ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా గ్లోబల్ పీఈ దిగ్గజం వార్బర్గ్ పింకస్ రేసులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దేశీయంగా రెండో పెద్ద ఫార్మసీ రిటైల్ చైన్ కలిగిన మెడ్‌ప్లస్‌లో ప్రస్తావించదగ్గ మైనారిటీ వాటా కొనుగోలుకి వార్బర్గ్ అడుగులు వేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇతర వివరాలు ఇలా.. (టాటాల చేతికి 1ఎంజీ?) రూ. 1,500 కోట్లు మెడ్‌ప్లస్‌లో చెప్పుకోదగ్గ మైనారిటీ వాటా కొనుగోలుకి వార్బర్గ్ పింకస్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వాటా కొనుగోలుకి వీలుగా రుణాలు, ఈక్విటీ ద్వారా మెడ్‌ప్లస్‌కు నిధులు అందించనున్నట్లు తెలుస్తోంది. దీంతో మెడ్‌ప్లస్‌కు రుణాలిచ్చిన గోల్డ్‌మన్ శాక్స్, ఎడిల్వీజ్ తదితరాలకు చెల్లింపులు చేపట్టే వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 2018 జనవరిలో గోల్డ్‌మన్ శాక్స్ నుంచి మెడ్‌ప్లస్ 11.5 కోట్ల డాలర్ల(సుమారు రూ. 845 కోట్లు) రుణాలను తీసుకుంది. ఈ నిధులతో కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన మౌంట్ కెల్లెట్ క్యాపిటల్ మేనేజ్మెంట్(యూఎస్), టీవీఎస్ క్యాపిటల్ ఫండ్స్, అజయ్ పిరమల్ కంపెనీ ఇండియా వెంచర్ అడ్వయిజర్స్ నుంచి మొత్తం 69 శాతం వాటాను మెడ్‌ప్లస్ సొంతం చేసుకుంది. (అపోలో ఫార్మసీలో అమెజాన్ ఇన్వెస్ట్మెంట్!) ప్రేమ్జీకు వాటా విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ కంపెనీ ప్రేమ్‌జీ ఇన్వెస్ట్మెంట్ రూ. 200 కోట్లతో మెడ్‌ప్లస్‌లో ఇన్వెస్ట్ చేసింది. ఆపై మరో రూ. 100 కోట్ల పెట్టుబడులను సైతం సమకూర్చింది. తద్వారా మెడ్‌ప్లస్‌లో ప్రేమ్‌జీ ఇన్వెస్ట్మెంట్.. 18 శాతం వాటాతో కొనసాగుతోంది. కాగా.. ప్రస్తుతం మెడ్‌ప్లస్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న వార్బర్గ్ పింకస్‌కు ప్రేమ్‌జీ ఇన్వెస్ట్మెంట్ సైతం వాటాను విక్రయించే వీలున్నట్లు ఫార్మా వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఈ పెట్టుబడులతో వాటాలను తనఖా నుంచి రిలీజ్ చేసుకోవడం ద్వారా మెడ్‌ప్లస్‌ను వ్యవస్థాపకుడు సీఈవో, మధుకర్ గంగాడీ ఇకపైన కూడా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. (రిలయన్స్ చేతికి నెట్‌మెడ్స్) హైదరాబాద్ కంపెనీ 2006లో హైదరాబాద్‌లో ప్రారంభమైన మెడ్‌ప్లస్ ప్రస్తుతం 1,800 స్టోర్లతో దేశంలోనే రెండో పెద్ద ఫార్మసీ చైన్‌గా నిలుస్తోంది. ఆన్‌లైన్‌లోనూ మెడ్‌ప్లస్‌మార్ట్, మెడ్‌ప్లస్‌ల్యాబ్, మెడ్‌ప్లస్ లెన్స్ పేరుతో స్టోర్లను నిర్వహిస్తోంది. దక్షిణాదిన ప్రారంభమైన కంపెనీ తదుపరి దశలో దేశవ్యాప్తంగా కార్యకలాపాలు విస్తరించింది. దేశీయంగా గల 12 లక్షల ఫార్మసీలలో 5 శాతం కంటే తక్కువ వాటాను ఆర్గనైజ్డ్ రంగం కలిగి ఉన్నట్లు అంచనా. కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెడ్‌ప్లస్ టర్నోవర్ రూ. 1,200 కోట్లకు చేరవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. రూ. 160-170 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) సాధించవచ్చని అంచనా వేశారు. -
సంస్కరణల అమలు పెద్ద సమస్య
ముంబై: సంస్కరణల అమలు భారత్‌కు ప్రధాన సవాల్ అని అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం వార్బర్గ్ పింకస్ సీఈవో చార్లెస్ కేయ్ తెలిపారు. సహజంగా అవకాశాలతోపాటే సవాళ్లూ ఉన్నాయని చెప్పారు. వ్యవసాయం, కార్మికులకు సంబంధించి భారత్ చేపట్టిన సంస్కరణల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బుధవారం జరిగిన గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. ‘అధిక వృద్ధి కలిగిన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు భారత్‌కు జనాభా వంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఇందుకు జనాభా ఒక్కటే సరిపోదు. ఈ స్థాయి వృద్ధికి నిరంతర చర్యలు, నిఘా ఉండాలి. 1995లో భారత్‌లో తొలిసారిగా హెచ్‌డీఎఫ్‌సీలో పెట్టుబడి చేశాం. నాటి నుంచి పోలిస్తే ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది పరిస్థితి. అయితే సంస్కరణల అమలే సవాల్. సవాళ్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అవి భారత్‌కు బహిరంగ ప్రశ్నలు. ప్రస్తుత మహమ్మారి విస్తృతి నేపథ్యంలో ప్రభుత్వం స్పందించిన తీరు ఆహ్వానించదగ్గది. ప్రభుత్వం సరిగా స్పందించలేదంటూ దేశీయంగా పెద్ద చర్చే జరుగుతోంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే బాధ్యతను బ్యాంకింగ్ రంగానికి వదిలేశారు. ఆర్బీఐ, మారటోరియం ద్వారా వ్యవస్థకు మద్ధతు ఇచ్చారు. దీని ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి’ అని అన్నారు. ‘‘లాక్డౌన్ ముందుగానే విధించడం వల్ల ఆరోగ్య రంగం బలపడింది. దీంతో కేసులు పెరుగుతున్నా ఈ రంగం నిలబడింది’’ అని ఆయన విశ్లేషించారు. -
వార్బర్గ్ చేతికి ఎయిర్టెల్ డీటీహెచ్‌లో 20 శాతం వాటా
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ డీటీహెచ్(డైరెక్ట్ టు హోమ్) విభాగంలో 20% వాటాను ప్రైవేట్ ఈక్విటీ సంస్థ, వార్బర్గ్ పిన్కస్ కొనుగోలు చేయనుంది. డీటీహెచ్ విభాగమైన భారతీ టెలీమీడియాలో 20% వాటాను వార్బర్గ్ అనుబంధ సంస్థ కొనుగోలు చేయనున్నట్లు భారతీ ఎయిర్టెల్ తెలిపింది. ఈ డీల్ విలువ రూ.2,310 కోట్లు(35 కోట్ల డాలర్లు) అని భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈఓ (ఇండియా, సౌత్ ఏషియా) గోపాల్ విట్టల్ చెప్పారు. వార్బర్గ్ పిన్కస్ తమ నుంచి 15% వాటాను, మరో అనుబంధ సంస్థ నుంచి 5% వాటాను కొనుగోలు చేస్తుందన్నారు. గతంలో ఇరు సంస్థల మధ్య విజయవంతమైన భాగస్వామ్యం నెలకొందని, మరొక్కసారి వార్‌బర్గ్‌తో జట్టు కట్టడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. భారత డిజిటల్ టీవీ మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని, ఎయిర్టెల్ డీటీహెచ్ విభాగం మంచి వృద్ధిని సాధించగలదన్న అంచనాలున్నాయని వార్బర్గ్ పిన్కస్ ఇండియా ఎండీ, విశాల్ మహాదేవ చెప్పారు. -
వార్బర్గ్ చేతికి టాటా టెక్నాలజీస్‌లో వాటా
డీల్ విలువ 36 కోట్ల డాలర్లు ముంబై: అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం వార్బర్గ్ పిన్కస్ సంస్థ, టాటా టెక్నాలజీస్ సంస్థలో 43 శాతం వాటాను కొనుగోలు చేయనున్నది. ఈ వాటా కోసం వార్బర్గ్ పిన్కస్ సంస్థ 36 కోట్ల డాలర్లు వెచ్చించనున్నది. టాటా టెక్నాలజీస్‌లో టాటా క్యాపిటల్‌కు ఉన్న మొత్తం 13 శాతం వాటాను, టాటా మోటార్స్‌కు ఉన్న 43 శాతం వాటాలో 30 శాతం వాటాను, మొత్తం 43 శాతం వాటాను వార్బర్గ్ పిన్కస్ కొనుగోలు చేస్తుంది. టాటా క్యాపిటల్ సంస్థకు... టాటా గ్రోత్‌ఫండ్, ఆల్ఫా టీసీ హోల్డింగ్స్ల ద్వారా 13 శాతం వాటా ఉంది. ఈ డీల్ కారణంగా టాటా టెక్నాలజీస్ నుంచి టాటా క్యాపిటల్ సంస్థ పూర్తిగా, టాటా మోటార్స్ పాక్షికంగా వైదొలుగుతాయి. -
కల్యాణ్ జ్యూయలర్స్‌లోకి వార్బర్గ్ రూ.500 కోట్లు
త్వరలో ఈ కామర్స్ సెగ్మెంట్లోకి న్యూఢిల్లీ: ఆభరణాల రిటైల్ చెయిన్ కల్యాణ్ జ్యూయలర్స్ కంపెనీలో అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం వార్బర్గ్ పిన్కస్ రూ.500 కోట్లు పెట్టుబడులు పెడుతోంది. దేశీయంగా, అంతర్జాతీయంగా నెట్వర్క్ విస్తరణకు ఈ నిధులు వినియోగిస్తామని కల్యాణ్ జ్యూయలర్స్ తెలిపింది. 2014లో తమ కంపెనీలో వార్బర్గ్ పిన్కస్ రూ.1,200 కోట్లు ఇన్వెస్ట్ చేసిందని, తాజా ఇన్వెస్ట్‌మెంట్‌తో ఈ సంస్థ మొత్తం పెట్టుబడులు రూ.1,700 కోట్లకు పెరిగాయని కల్యాణ్ జ్యూయలర్స్ సీఎండీ టి. ఎస్. కల్యాణరామన్ చెప్పారు. దేశ, విదేశాల్లో ప్రస్తుతం 106 షోరూమ్‌లను నిర్వహిస్తున్నామని, తమ షోరూమ్‌ల సంఖ్యను రెట్టింపు (200కు పైగా) చేయనున్నామని, దీనికి కావలసిన నిధులను ఈక్విటీ, రుణ, అంతర్గత వనరుల ద్వారా సమీకరించుకుంటామని వివరించారు. త్వరలో ఈ కామర్స్ సెగ్మెంట్లోకి ప్రవేశించనున్నామని పేర్కొన్నారు. నగదు లావాదేవీలపై ఆంక్షలు, వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలు కారణంగా నిర్వహణ సామర్థ్యాలులు మెరుగుపడతాయని తెలిపారు. -
పిరమాల్ రియల్టీలో వార్బర్గ్ పెట్టుబడులు
♦ రూ. 1,800 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ♦ దేశీ రియల్టీలో భారీ ఎఫ్‌డీఐ డీల్ ముంబై : దేశీ రియల్ ఎస్టేట్ రంగంలో అత్యంత భారీ ఎఫ్‌డీఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు)కి తెర తీసింది అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం వార్బర్గ్ పింకస్. తాజాగా పిరమాల్ రియల్టీలో రూ. 1,800 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ప్రతిగా పిరమాల్ రియల్టీలో వార్బర్గ్ పింకస్‌కు రెండు స్థానాలు దక్కుతాయి. కొత్తగా వచ్చే నిధులను వివిధ ప్రాజెక్టుల అభివృద్ధికి ఉపయోగించనున్నట్లు పిరమాల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆనంద్ పిరమాల్ తెలిపారు. 1997లో పిరమాల్ హెల్త్‌కేర్‌లో ఇన్వెస్ట్ చేసిన వార్బర్గ్ పింకస్ తాజాగా తమ గ్రూప్‌కే చెందిన మరో సంస్థలో పెట్టుబడులు పెట్టడంపై పిరమాల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమాల్ హర్షం వ్యక్తం చేశారు. దేశీ రియల్టీ అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునేందుకు వార్బర్గ్ పెట్టుబడులు, అనుభవం దోహదపడగలవని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు. ముంబై కేంద్రంగా పనిచేసే తమ సంస్థ ప్రధానంగా అదే నగరంలో ప్రాజెక్టులపై దృష్టి పెట్టనున్నట్లు అజయ్ పిరమాల్ పేర్కొన్నారు. బైకులా, వర్లి తదితర ప్రాంతాల్లో పిరమాల్ రియల్టీ సుమారు 10 మిలియన్ చ.అ.ల ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. మరోవైపు, అధిక వృద్ధి అవకాశాలు ఉన్న సంస్థల్లో పెట్టుబడులు పెట్టే వ్యూహంలో భాగంగానే పిరమాల్ రియల్టీలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వార్బర్గ్ పింకస్ ఇండియా కో-హెడ్ నితిన్ మల్హన్ వివరించారు. 1966లో ప్రారంభమైన వార్బర్గ్ పింకస్ ప్రస్తుతం 120 పైచిలుకు రంగాల్లో 35 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులను నిర్వహిస్తోంది. గంగవరం పోర్టు, దైనిక్ భాస్కర్ తదితర సంస్థల్లో ఇన్వెస్ట్ చేసింది. -
వైజాగ్ లారస్ ల్యాబ్స్‌లో వార్బర్గ్ పింకస్ పెట్టుబడి
రూ. 550 కోట్లతో మైనారిటీ వాటా ముంబై: విశాఖపట్టణం కేంద్రంగా పనిచేస్తున్న ఏపీఐ తయారీ సంస్థ లారస్ ల్యాబ్స్‌లో గ్లోబల్ పీఈ సంస్థ వార్బర్గ్ పింకస్ సుమారు రూ. 550 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. తద్వారా కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన ఫిడిలిటీగ్రోత్ పార్ట్నర్స్, ఫిడిలిటీ బయోసెన్సైస్ జాబితాలోకి చేరింది. ఈ రెండు కంపెనీలూ 2012లో లారస్ ల్యాబ్స్‌లో ఇన్వెస్ట్ చేశాయి. కాగా, వార్బర్గ్ పెట్టుబడి విషయాన్ని లారస్ పేర్కొన్నప్పటికీ ఎంత వాటాను కొనుగోలు చేసిందీ వెల్లడించలేదు. కంపెనీ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రెడియంట్స్(ఏపీఐలు)ను అభివృద్ధి చేయడంతోపాటు, తయారు చేస్తుంది. యాంటీరిట్రోవైరల్(ఏఆర్వీ), కేన్సర్(అంకాలజీ), గుండె సంబంధిత జబ్బులు(కార్డియోవాస్కులర్), చక్కెర వ్యాధి చికిత్స(యాంటీ డయాబెటిక్) తదితర విభాగాల ఏపీఐలను లారస్ తయారు చేస్తోంది. వీటితోపాటు న్యూట్రాస్యూటికల్స్ తదితరాలను సైతం తయారు చేస్తుంది. వీటిని దేశ, విదేశీ జనరిక్ ఫార్మా దిగ్గజాలకు అందిస్తుంది. ఏపీఐలకు తోడు వేగంగా వృద్ధి చెందుతున్న కాంట్రాక్ట్ తయారీ బిజినెస్‌లోనూ కంపెనీకి ప్రవేశముంది. 2008లో కార్యకలాపాలు షురూ కంపెనీ 2008లో పూర్తిస్థాయిలో వాణిజ్య కార్యకలాపాలను మొదలుపెట్టింది. గడిచిన ఆర్థిక సంవత్సరం(2013-14) ముగిసేసరికి రూ. 1,200 కోట్ల ఆదాయాన్ని సాధించింది. వృద్ధి బాటలో ఉన్న ప్రస్తుత దశలో వార్‌బర్గ్‌తో జతకట్టడం సంతోషదాయకమని కంపెనీ సీఈవో డాక్టర్ సత్యనారాయణ చవా పేర్కొన్నారు. చౌక ధరల్లో ఉత్పత్తులు, సర్వీసులను అందించేందుకు వీలుగా కొత్తదనం, తయారీ నైపుణ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. తద్వారా కొత్త విభాగాలకు విస్తరించనున్నట్లు తెలిపారు. వార్బర్గ్కున్న డొమైన్ నైపుణ్యం, గ్లోబల్ నెట్‌వర్క్‌లను వినియోగించుకోవడం ద్వారా కొత్త మార్కెట్లలో ప్రవేశిస్తామని, కస్టమర్లను పెంచుకుంటామని చెప్పారు. కొత్తదనం, పటిష్ట నిర్వహణ వంటి అంశాల ద్వారా లారస్ అభివృద్ధికి కృషి చేస్తున్న యాజమాన్యంపట్ల ఆసక్తిగా ఉన్నామని వార్బర్గ్ పింకస్ ఇండియా ఎండీ నితిన్ మల్హన్ వ్యాఖ్యానించారు.