కల్యాణ్ జ్యూయలర్స్‌లోకి వార్‌బర్గ్ రూ.500 కోట్లు
త్వరలో ఈ కామర్స్ సెగ్మెంట్లోకి
న్యూఢిల్లీ: ఆభరణాల రిటైల్ చెయిన్ కల్యాణ్ జ్యూయలర్స్ కంపెనీలో అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం వార్‌బర్గ్ పిన్‌కస్ రూ.500 కోట్లు పెట్టుబడులు పెడుతోంది. దేశీయంగా, అంతర్జాతీయంగా నెట్‌వర్క్ విస్తరణకు ఈ నిధులు వినియోగిస్తామని కల్యాణ్ జ్యూయలర్స్ తెలిపింది. 2014లో తమ కంపెనీలో వార్‌బర్గ్ పిన్‌కస్ రూ.1,200 కోట్లు ఇన్వెస్ట్ చేసిందని, తాజా ఇన్వెస్ట్‌మెంట్‌తో ఈ సంస్థ మొత్తం పెట్టుబడులు రూ.1,700 కోట్లకు పెరిగాయని కల్యాణ్ జ్యూయలర్స్ సీఎండీ టి. ఎస్. కల్యాణరామన్ చెప్పారు.
దేశ, విదేశాల్లో ప్రస్తుతం 106 షోరూమ్‌లను నిర్వహిస్తున్నామని, తమ షోరూమ్‌ల సంఖ్యను రెట్టింపు (200కు పైగా) చేయనున్నామని, దీనికి కావలసిన నిధులను ఈక్విటీ, రుణ, అంతర్గత వనరుల ద్వారా సమీకరించుకుంటామని వివరించారు. త్వరలో ఈ కామర్స్ సెగ్మెంట్‌లోకి ప్రవేశించనున్నామని పేర్కొన్నారు. నగదు లావాదేవీలపై ఆంక్షలు, వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) అమలు కారణంగా నిర్వహణ సామర్థ్యాలులు మెరుగుపడతాయని తెలిపారు.