ఒడిసి పట్టేద్దాం! | water saving possible with follow according to the method | Sakshi
Sakshi News home page

ఒడిసి పట్టేద్దాం!

Published Sat, Sep 6 2014 12:48 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

water saving possible with follow according to the method

సాక్షి, హైదరాబాద్: భూగర్భ జలాలు అడుగంటితే చాలు.. సొంతింటి ఆనందం ఆవిరవుతుంది. లక్షలు పెట్టి కొన్న ఇంట్లో జలకళ లేకపోతే జీవనం కష్టంగా మారుతుంది. మరి, నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాల్ని పెంచితే తప్ప సమస్యకు పరిష్కారం దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. గుంతలు తవ్వామా పైపు వేశామా అని కాకుండా.. నిపుణుల సహాయంతో డిజైన్ల దగ్గర్నుంచి కొలతల వరకూ పద్ధతి ప్రకారం వ్యవహరిస్తేనే నీటిని సంరక్షించుకోవచ్చు.

 నీటి బొట్టును ఒడిసిపట్టాలని వర్షపు చుక్క వృథా కాకూడదనే ఆలోచన గృహ యజమానులకు కలుగుతోంది. భూగర్భ జలాల్ని పెంపొందించుకోవాలన్న కోరిక నానాటికీ పెరుగుతోంది. కాకపోతే ఇందుకోసం అడుగు ముందుకెలా వేయాలో, ఎవర్ని సంప్రదించాలో తెలియని పరిస్థితి. దీంతో కొందరు మేస్త్రీని పట్టుకొని ఆరు అడుగుల లోతు దాకా ఇంకుడు గుంతలను తవ్వి గులకరాళ్లు వేస్తే నీటి నిల్వలు పెరుగుతాయనే అపోహలో ఉన్నారు. ఈ విషయంలో నిపుణుల సాయం తీసుకుంటేనే మనింట్లో జలసిరి పండుతుంది. లేకపోతే నీటి కష్టాలు తప్పవు. వర్షాలు పడ్డాక భూమిపై నీటిని సేకరించి దాన్ని శుద్ధి చేసి భూగర్భ జలాల్ని పెంపొందించడానికి ఇంకుడు గుంతల్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడీ జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తు తరాలకు నీరు లభించక నానా అవస్థలు తప్పవు. ఇంకుడు గుంతల్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి.

  ఎండిపోయిన బోర్లు మళ్లీ పనిచేస్తాయి. రోడ్లపై వర్షం నీరు నిలవదు. మట్టి కోత తగ్గుతుంది.భూగర్భ జలాల లభ్యత పెరుగుతుంది. మురుగు కాల్వ నీటిని శుద్ధి చేయడానికి పురపాలక శాఖకయ్యే ఖర్చూ తగ్గుతుంది.

 మేస్త్రీలు వద్దు..
 ఇంకుడు గుంతల వల్ల ప్రయోజనాల్ని గుర్తించిన వారంతా దీనిపై ఆసక్తిని పెంచుకుంటున్నారు. కాకపోతే ఈ పనిని పక్కాగా చేసే నిపుణుల సంఖ్య పరిమితంగా ఉంది. తక్కువ ఖర్చులో పని పూర్తి కావడానికి కొందరు తెలిసో తెలియకో ఏదో రకంగా ఇంకుడు గుంతల్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తారు. దీంతో రెండు రకాలుగా నష్టపోవడానికి ఆస్కారముంది. 500 లేదా అంతకంటే ఎక్కువ అడుగుల లోతునకు నీరు ఇంకదు. రకరాల బండరాళ్లు, మట్టి నీరు భూమి లోపలికి ఇంకకుండా చేస్తాయి. కాబట్టి, నిపుణులు డిజైన్ చేసే ఇంకుడు గుంతలు మెరుగైన ఫలితాల్ని ఇస్తాయి. పాడైన బోర్లూ పనిచేయడానికి తోడ్పడతాయి.

 నిపుణులిలా చేస్తారు..
 ఇంకుడు గుంతలను ఎవరైనా తవ్వొచ్చు. కాకపోతే సమర్థంగా పనిని ముగించాలంటే నిపుణుల సాయం తప్పనిసరి. వీరేం చేస్తారంటే.. ఆయా సైటుకెళ్లి పరిసరాల్ని పూర్తిగా పరిశీలించి కీలకాంశాల్ని రాసుకుంటారు. సాధ్యాసాధ్యాలపై ఇంటి యజమానులతో చర్చిస్తారు. అపార్ట్‌మెంట్ సంక్షేమ సంఘం అయితే వాళ్లతో మాట్లాడతారు. తమ ఆఫీసుకెళ్లి సీనియర్ నిపుణులతో చర్చించి.. ఆటోక్యాడ్ డిజైన్లు సిద్ధం చేస్తారు. అంటే ఇందులో పీవీసీ పైపు సైజు, స్థలం కొలతలు వంటివి ఉంటాయి. తర్వాత ఖరె ్చంత అవుతుందో చెబుతారు. ఇంటి యజమాని అంగీకరిస్తే పనిని పది రోజుల్లో పూర్తి చేస్తారు.

  భూగర్భ జలాల్ని పెంపొందించే విషయంలో ప్రభుత్వం మాటలకే పరిమితమవుతోంది. ప్రతి కాలనీలో ఒక నమూనా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్‌ని ఏర్పాటు చేయాలి. అప్పుడే ప్రజలు నేర్చుకుంటారు. భవనాలకు అనుమతుల్ని ఇచ్చే ముందు వసూలు చేసే సొమ్మును ఈ పథకం కోసం ఖర్చు చేయాలని నిపుణులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement