
కార్లలో ‘లగ్జరీ’ వాటా పెరగాలి..
ఆడి ఇండియా హెడ్ జో కింగ్
• దేశీయంగా వృద్ధికి అపార అవకాశాలు
• తృతీయ శ్రేణి పట్టణాలపైనా దృష్టి
• స్వల్పకాలిక నిర్ణయాలతో పరిశ్రమలో అనిశ్చితి
• విధానాల్లో స్పష్టత ఉంటే ప్రయోజనకరం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రపంచవ్యాప్తంగా ప్యాసింజర్ కార్ల మార్కెట్‌లో లగ్జరీ కార్ల మార్కెట్ 15 శాతం దాకా ఉంటుండగా.. ఇండియాలో మాత్రం ఇది కేవలం ఒక్క శాతంగానే ఉంది. అందుకే దేశీ మార్కెట్‌లో అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా మొబైల్ టెర్మినల్ తదితర ప్రయోగాలతో కస్టమర్లకు చేరువయ్యేందుకు జర్మనీ కార్ల దిగ్గజం ‘ఆడి’ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలపైనా మరింతగా దృష్టి సారిస్తోంది. దేశీ లగ్జరీ కార్ల మార్కెట్లో స్థానం పటిష్టం చేసుకునే క్రమంలో ఎదురవుతున్న సవాళ్లు, అనుసరిస్తున్న వ్యూహాలపై ‘ఆడి’ ఇండియా హెడ్ జో కింగ్.. సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. ప్రత్యేక ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ...
దేశీ లగ్జరీ కార్ల మార్కెట్ ఎలా ఉంది?
దేశీయంగా మొత్తం కార్ల మార్కెట్‌లో లగ్జరీ కార్ల విక్రయాలు దాదాపు 35,000 యూనిట్ల మేర .. అంటే సుమారు 1.3 శాతం స్థాయిలో ఉన్నాయి. మిగిలిన దేశాల్లో ఇవి 10-15% మధ్య ఉన్నాయి. కాబట్టి మున్ముందు ఈ సెగ్మెంట్ బాగా పెరుగుతుంది. సరైన ఉత్పత్తులు, పటిష్టమైన డీలర్ నెట్‌వర్క్, బ్రాండ్‌తో కస్టమర్లకు అనుబంధాన్ని పెంచడం వంటి వ్యూహాలను పాటిస్తే విక్రయాలు పెంచుకోవచ్చు.
నియంత్రణలు, డిమాండ్ పరమైన సవాళ్లు ఎక్కువే ఉన్నట్టున్నాయి!!
అవును! విధానాలపరంగా స్వల్పకాలిక నిర్ణయాల వల్ల తయారీ సంస్థలు, డీలర్లు, కొనుగోలుదారులు అనిశ్చితి ఎదుర్కొంటున్నారు. విధానాల్లో స్పష్టత ఉంటే కస్టమర్ల డిమాండ్‌కి తగినట్లుగా మా వ్యూహాలను సవరించుకునే వీలుంటుంది. వ్యాపార వాతావరణం దెబ్బతినకుండా పర్యావరణ సమస్యల పరిష్కారంపై బహుళవిధాన వ్యూహం అమలు చేయాల్సిన అవసరముంది. బడ్జెట్‌లో ఇన్‌ఫ్రా సెస్సు విధించడం పరిశ్రమకు కాస్త ప్రతికూలమే. అయితే జీఎస్‌టీ అమల్లోకి వస్తే ఎకానమీకి మంచి జరుగుతుంది.
ఢిల్లీలో డీజిల్ కార ్లను నిషేధించారు కదా? ఆ ప్రభావం మీపై ఉంటుందా?
ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో దాదాపు ఏడాది పాటు డీజిల్ కార్లపై నిషేధం కొనసాగినపుడు మార్కెట్ గణనీయంగా క్షీణించి 10-15 శాతం మేర తగ్గింది. ఇది అనిశ్చితికి దారి తీసింది. నిజం చెప్పాలంటే ఒక్కసారిగా ఈ మార్పును ఎదుర్కొనడం మాకూ కష్టమే. అప్పటికప్పుడు అన్ని మోడల్స్‌లోనూ పెట్రోల్ వెర్షన్‌లను ప్రవేశపెట్టడానికి మా ఉత్పత్తి షెడ్యూల్స్ సహకరించే పరిస్థితి లేదు. ఈ విధంగా .. ఏడాదంతా సవాలుగానే గడిచింది. కాకపోతే మా మెజారిటీ మోడల్స్‌లో పెట్రోల్ ఇంజిన్లుండటం మాకు కలిసొచ్చే అంశం. పెట్రోల్ కార్ల డిమాండ్‌ను అందుకునేలా మా ఉత్పత్తిని సవరించుకుంటున్నాం. బీఎస్4 కాలుష్య ప్రమాణాలను స్వాగతిస్తున్నాం. దీనివల్ల సంక్లిష్టత.. అలాగే ఖరీదు గణనీయంగా తగ్గుతుంది కాబట్టి ఇది మాకు ప్రయోజనకరమే.
దేశంలో తయారీ, అసెంబ్లింగ్‌ను పెంచుకునే అవకాశాలున్నాయా?
గతేడాది భారత్‌లో విక్రయించిన కార్లలో దాదాపు 95% పైగా ఇక్కడ నిర్మించినవే. ప్రస్తుతం ఔరంగాబాద్ ప్లాంటులో ఆడి ఏ3 సెడాన్, ఏ4, ఏ6, క్యూ3, క్యూ5, క్యూ7 మోడల్స్‌ను అసెంబుల్ చేస్తున్నాం. సింగిల్ షిఫ్టులో ఏటా 14,000 యూనిట్ల సామర్ధ్యంతో పనిచేస్తున్నాం. స్థానికంగా తయారీ పరిమాణాన్ని పటిష్టంగా, లాభదాయకంగా పెంచే దిశగా మా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
పండుగల సీజన్లో కొత్త కార్లేమైనా తెస్తున్నారా? ఆఫర్లు లాంటివి...
ఈ సీజన్లో మా పాపులర్ మోడల్ ఆడి క్యూ3పై వివిధ నగరాల్లో ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నాం. కొత్త కార్ల విషయానికొస్తే.. అత్యంత శక్తిమంతమైన నెక్ట్స్ జనరేషన్ ఆడి ఆర్8 వీ10 ప్లస్‌ను, అత్యంత సురక్షితమైన ఏ8 ఎల్ సెక్యూరిటీ మోడల్స్‌ను ఆటో ఎక్స్‌పో 2016లో ఆవిష్కరించాం. అటుపైన ఏ6 35 మేట్రిక్స్ టీఎఫ్‌ఎస్‌ఐ, సరికొత్త ఆడి ఏ4ను ఇటీవలే ప్రవేశపెట్టాం. త్వరలో మరిన్ని ఆకర్షణీయమైన కార్లను తేబోతున్నాం.
ద్వితీయ శ్రేణి పట్టణాల్లో లగ్జరీ కార్లకు డిమాండ్ ఎలా ఉంది?
ప్రస్తుతం చిన్న పట్టణాల్లోనూ ఆడి వంటి లగ్జరీ కార్లను కొనే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో మెట్రో నగరాలపైనే కాకుండా ద్వితీయ.. తృతీయ శ్రేణి పట్టణాల్లోని డీలర్‌షిప్‌లపైనా దృష్టి పెడుతున్నాం. హైదరాబాద్ మాకు కీలక మార్కెట్. ఇక్కడ పుష్కలంగా వ్యాపార అవకాశాలున్నాయి కనక అధిక ప్రాధాన్యమిస్తున్నాం.
సర్టిఫైడ్ కార్ల విభాగం ఎలా నడుస్తోంది?
ప్రీ-ఓన్డ్ లగ్జరీ కార్ల మార్కెట్ వేగంగా పెరుగుతోంది. 2012లోనే మేం ‘ఆడి అప్రూవ్డ్:ప్లస్’ పేరిట గుర్గావ్‌లో ప్రీ-ఓన్డ్ కార్ల షోరూమ్‌ను ప్రారంభించాం. ఇటీవలే బైబ్యాక్ స్కీమ్ ప్రవేశపెట్టాం. కస్టమర్ తన పాత కారునిచ్చేసి కొత్త కారు ఈజీగా కొనుక్కునేలా ఈ స్కీమ్‌ను రూపొందించాం.
మార్కెట్ వాటా పెంచుకోవటానికి మీ వ్యూహమేంటి?
వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేటువంటి లగ్జరీ కార్లను సొంతం చేసుకోవాలని భారత్‌లో కార్ల కొనుగోలుదారులు భావిస్తున్నారు. వారికి కావాల్సిన వాహనాలివ్వటానికి ప్రయత్నిస్తున్నాం. పారిశ్రామికవేత్తలే కాదు... వారి పిల్లలూ మా కార్లు కొంటున్నారు. మా బ్రాండ్‌పై ఆసక్తి ఉన్న ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కస్టమర్ల ముంగిటకే షోరూమ్‌ను అందుబాటులోకి తెచ్చేలా ఆడి మొబైల్ టెర్మినల్‌ను ప్రవేశపెట్టాం. అంతర్జాతీయ మోటార్ స్పోర్ట్ ఈవెంట్స్‌లో పాలుపంచుకునే అవకాశం కల్పించే ఆడి క్లబ్ ఇండియాను ప్రారంభించాం. మా కార్లలో డ్రైవింగ్ అనుభూతిని తెలియజేసేటువంటి క్యూ డ్రైవ్, ఆర్‌డ్రైవ్ వంటి ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తున్నాం.