ప్రపంచ కుబేరుల్లో మనోళ్లు ముగ్గురు..!
♦ ముకేశ్, ప్రేమ్‌జీ, దిలీప్ సంఘ్వీలకు చోటు
♦ 50 మందితో వెల్త్ ఎక్స్ జాబితా విడుదల
న్యూఢిల్లీ: ప్రపంచ సంపన్నుల జాబితాలో ముగ్గురు భారతీయులు స్థానం పొందారు. వారిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, విప్రో చైర్మన్ ప్రేమ్‌జీ, సన్‌ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీ ఉన్నారు. వెల్త్‌ఎక్స్ టాప్-50 ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ముకేశ్ అంబానీ 24.8 బిలియన్ డాలర్ల సంపదతో 27వ స్థానంలో నిలిచారు. విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ 16.5 బిలియన్ డాలర్ల సంపదతో 43వ స్థానంలో, సన్ ఫార్మా అధిపతి దిలీప్ సంఘ్వీ 16.4 బిలియన్ డాలర్ల సంపదతో 44వ స్థానంలో ఉన్నారు. టాప్-50 ధనవంతుల మొత్తం సంపద 1.45 ట్రిలియన్ డాలర్లు.
ఇది ఆస్ట్రేలియా జీడీపీతో సమానం. వెల్త్‌ఎక్స్ సంపన్నుల జాబితాలో 29 మంది అమెరికన్లు, నలుగురు ైచె నీయులు, ముగ్గురు భారతీయులు ఉన్నారు. అలాగే ఈ సంపన్నుల్లో టెక్నాలజీ రంగానికి చెందిన వారే అధికంగా (12 మంది) ఉండటం గమనార్హం. టాప్-50 బిలియనీర్లలో అత్యంత పిన్న వయస్కుడు ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ (31 ఏళ్లు). ఈయన 42.8 బిలియన్ డాలర్ల సంపదతో 8వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో నలుగురు మహిళలు స్థానం పొందారు.