రామ్దేవ్పై గోద్రెజ్ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు
ముంబై: పతంజలి సంస్థ వ్యవస్థాపకుడు, యోగా గురు రామ్‌దేవ్ పై ప్రముఖ పారిశ్రామిక వేత్త, గోద్రేజ్ గ్రూప్ ఛైర్మన్ ఆది గోద్రేజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమ విభాగం ఐఎంసీ మంగళవారం నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్ లో మాట్లాడిన గోద్రేజ్ రామ్దేవ్ పేరు వల్లే పతంజలి నడుస్తోంది తప్ప, వారి ఎఫ్ ఎం సీజీ ఉత్పత్తులకు తమతో పోటీలేదన్నారు. ఆయన ఇమేజ్, పరపతి మూలంగా యోగా, ఆయుర్వేద ఉత్పత్తులు బావున్నాయి తప్ప మిగిలిన వాటికి అంత సీన్ లేదని తేల్చి పారేశారు. నెయ్యి, తేనె వంటి సాధారణ ఉత్పత్తులు మాత్రమే మార్కెట్లో అధికంగా అమ్మడవుతున్నాయని పేర్కొన్నారు. విలువ ఆధారిత విభాగంలో ఆ సంస్థ వాటా చాలా తక్కువని గోద్రెజ్ స్పష్టం చేశారు. కేవలం టాయిలెట్ సబ్బుల విభాగంలోనే కన్జూమర్ ప్రోడక్ట్స్ తో పోటీ పడుతోందన్నారు. ఈ విభాగంలో పతంజలి ప్రాతినిధ్యం చాలా తక్కువ అని వెల్లడించారు.
డీజిల్ వాహనాలు నిషేధం వ్యతిరేకంగా మాట్లాడిన ఆది గోద్రేజ్ నిషేధానికి బదులుగా కాలుష్యాన్ని తగ్గించేందుకు, భూతాపాన్ని నిరోధించేందుకు టెక్నాలజీని మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీకాలం పొడిగింపుపై సానుకూలంగా మాట్లాడారు. అలాగే ప్రస్తుతం కుంగిపోయిన రియాల్టీ రంగానికి జిఎస్టి బిల్లు బూస్ట్ ఇస్తుందని తెలిపారు.
కాగా మ్యాగీ నూడల్స్ వివాదం తరువాత పతంజలి ఆదాయం రూ.5000 కోట్ల మైలురాయిని దాటడం.. ఎఫ్‌ఎమ్‌సీజీ రంగంలో చర్చనీయాంశమైంది. దీనిపై బ్రోకరేజి సంస్థలు, ఎనలిస్టులు 2020 నాటికి సంస్థ ఆదాయం 20,000 కోట్లకు చేరుతుందని అంచనావేసిన సంగతి తెలిసిందే.