లాఇకో చెంతకు అమెరికా ఎలక్ట్రానిక్స్ సంస్థ
2 బిలియన్ డాలర్లకు కొనుగోలు
న్యూఢిల్లీ: చైనీస్ హ్యాండ్ సెట్ తయారీ సంస్థ లాఇకో అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కంపెనీ ‘విజియో’ను 2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. ‘విజియో’కి చెందిన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, టెక్నాలజీ వ్యాపారం, మేథోసంపత్తి హక్కులు ఈ ఒప్పందంలో భాగంగా లాఇకో సొంతం అవుతాయి. ఈ ఏడాది చివరి త్రైమాసికంలో ఈ లావాదేవీ పూర్తవుతుందని లాఇకో ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాలన్నతమ విధానంలో విజియో కొనుగోలు కీలకమైన అడుగని, ఉత్తర అమెరికాలో తమ స్థానాన్ని బలోపేతం చేస్తుందని లాఇకో చైర్మన్, సీఈవో యూటింగ్ జియా చెప్పారు.
ఉత్తర అమెరికాలో...
కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఇర్విన్ పట్టణంలో 2002లో ఏర్పాటైన విజియో ఉత్తర అమెరికాలో ప్రధాన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్‌గా ఎదిగింది. స్మార్ట్ టీవీలు, సౌండ్‌బార్ల విక్రయాల్లో అగ్రస్థానంలో ఉంది. విజియో బ్రాండ్‌కుతోడు పంపిణీదారుల నెట్‌వర్క్ లాఇకో కంపెనీకి కలసిరానున్నాయి. కొనుగోలు అనంతరం విజి సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ వ్యాపారాన్ని తన పూర్తి అనుబంధ కంపెనీ కింద లాఇకో నిర్వహించనుంది. డేటా వ్యాపారం ‘ఇన్‌స్కేప్’ను విడిగా ఓ ప్రైవేటు కం పెనీ కిందకు మార్చనుంది.