వాట్స్‌యాప్ యూజర్లు @ 50 కోట్లు
న్యూఢిలీ: ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్(యాప్) యూజర్ల సంఖ్య 50 కోట్ల మార్కును అధిగమించింది. ముఖ్యంగా భారత్, బ్రెజిల్, మెక్సికో, రష్సా వంటి వర్ధమాన దేశాల నుంచి గత కొద్ది నెలలుగా వినియోగదారుల్లో పటిష్టమైన వృద్ధి ఇందుకు దోహదం చేసినట్లు వాట్స్‌యాప్ పేర్కొంది. ఉక్రెయిన్‌కు చెందిన జాన్ కౌమ్, బ్రియాన్ యాక్టన్ అనే అమెరికన్ కలిసి 2009లో ఈ యాప్ సేవలను ఆరంభించారు.
మొబైల్స్, ట్యాబ్లెట్ పీసీలద్వారా సులువుగా మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకునేందుకు వీలుకల్పిస్తున్న వాట్స్‌యాప్‌కు అనతికాలంలో విశేష ప్రాచుర్యం లభించింది. దీంతో సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏకంగా 19 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.1.15 లక్షల కోట్లు) భారీ మొత్తానికి కొనుగోలు చేయడం తెలిసిందే. ప్రతిరోజూ యూజర్లు 70 కోట్ల ఫొటోలు, 10 కోట్ల వీడియోలను షేర్ చేసుకుంటున్నట్లు వాట్స్‌యాప్ తెలిపింది.