టెక్ దిగ్గజం ఆపిల్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 12 ఐఫోన్ యూజర్ల ముందుకు వచ్చేసింది. సరికొత్త ఫీచర్లతో, అప్‌డేట్లతో ఐఫోన్ యూజర్లను, ఐప్యాడ్ యూజర్లను ఇది అలరిస్తోంది. కొత్త ఐఓఎస్ 12 మార్కెట్‌లోకి వచ్చిన రెండు రోజుల్లోనే... ఐఫోన్ యూజర్లకు షాక్ ఇస్తూ ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐఓఎస్ 7.1.2కి ముందున్న ఐఓఎస్ వెర్షన్లకు తమ యాప్ పనిచేయదని ప్రకటించింది. అంటే 1 ఫిబ్రవరి, 2020 నుంచి ఐఓఎస్ 7, దాని ముందున్న వెర్షన్లు వేటికి కూడా వాట్సాప్ సపోర్టు చేయదని చెప్పేసింది. ఐఓఎస్ 7.1.2 యూజర్లకు కూడా తమ యాప్‌ను వాడుకోవడానికి కొన్ని పరిమితులను విధించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన కొత్త ఎఫ్‌ఏక్యూ సెక్షన్‌లో వెల్లడించింది.
వాట్సాప్ సపోర్టు చేసే ఐఫోన్ డివైజ్‌లను కూడా పేర్కొంది. ఇక నుంచి కేవలం ఐఓఎస్ 8, ఆపై యూజర్లకు మాత్రమే వాట్సాప్ పనిచేయనుందని స్పష్టం చేసింది. ‘ఐఫోన్‌కు వాట్సాప్ కావాలంటే, ఐఓఎస్ 8 లేదా ఆ తర్వాతి వెర్షన్లు ఉండాల్సిందే’నని తేల్చి చెప్పింది. 1 ఫిబ్రవరి, 2020 తర్వాత కొత్త అకౌంట్లను క్రియేట్ చేసుకోవడానికి, పాత అకౌంట్లను పునఃధృవీకరించుకోవడానికి కూడా కుదరదు. అయితే ఈ ప్రభావం ఎక్కువ మంది యూజర్లపై పడదని తెలుస్తోంది. ఐఓఎస్ 7.1.2 వచ్చిన తర్వాత ఐఫోన్ పాత డివైజ్‌లకు ఎలాంటి అప్‌డేట్లు లేదు. ముఖ్యంగా ఐఫోన్ 4కు, ఐఫోన్ 3జీఎస్‌లకు. ఐఫోన్ 4ను 2010లో లాంచ్ చేయగా.. ఐఫోన్ 3జీఎస్ 2009లో మార్కెట్‌లోకి వచ్చింది. ఐఫోన్ 3జీఎస్, ఐఓఎస్ 6.1.6 తర్వాత ఇక ఎలాంటి అప్‌డేట్‌ను పొందలేదు.
2008లో లాంచ్ అయిన ఐఫోన్ 3జీ కి కూడా వాట్సాప్ పనిచేయదు. అయితే 2011లో లాంచ్ అయిన ఐఫోన్ 4ఎస్‌లకు చివరి అప్‌డేట్ ఐఓఎస్ 8.4.1. దీంతో వీటికి వాట్సాప్ పనిచేస్తుంది. కాగా, తాజాగా ఆపిల్ తన ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 12ను సెప్టెంబర్17న విడుదల చేసింది.. 85 శాతం యాక్టివ్ డివైజ్‌లు ఐఓఎస్ 11తో పనిచేస్తూ ఉండగా.. ఐఓఎస్ 10తో 10 శాతం, పాత వెర్షన్లతో మిగిలిన 5 శాతం పనిచేస్తున్నాయి. అంటే ఐఓఎస్ 10కు ముందున్న వెర్షన్ డివైజ్‌లు లక్షల్లో కొన్ని మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment