ఈ గోల్డెన్ ఛాన్స్ ఎవరికి? | who's wants this Golden chance? | Sakshi
Sakshi News home page

ఈ గోల్డెన్ ఛాన్స్ ఎవరికి?

Published Mon, Nov 9 2015 1:18 AM | Last Updated on Thu, Aug 2 2018 3:58 PM

ఈ గోల్డెన్ ఛాన్స్ ఎవరికి? - Sakshi

ఈ గోల్డెన్ ఛాన్స్ ఎవరికి?

బంగారంతో మనది విడ దీయరాని బంధం. అందుకేనేమో! వినియోగంలో చైనానూ మించిపోయారు మనవాళ్లు. కాకపోతే ఇక్కడో చిక్కుంది. బంగారాన్ని విపరీతంగా దిగుమతి చేసుకుంటుండటంతో భారీ విదేశీ మారకద్రవ్యాన్ని చెల్లించాల్సి వస్తోంది. పెపైచ్చు దేశాభివృద్ధికి ఈ బంగారం పెద్దగా ఉపయోగపడటం లేదు. అందుకే ప్రభుత్వం మూడు పథకాలను ప్రకటించింది. ఒకటి బంగారం బాండ్లు. రెండు నాణేలు. మూడు బంగారం డిపాజిట్.

ఈ మూడింటి లక్ష్యం ఒక్కటే. బంగారం కొనుగోలు చేయాలన్న భారతీయుల సెంటిమెంట్‌ను గౌరవిస్తూనే... అందుకోసం వెచ్చించే డబ్బు దేశాభివృద్ధికి ఉపయోగపడేలా చూడటం... విపరీతంగా పెరిగిపోతున్న బంగారం దిగుమతులను సాధ్యమైనంత తగ్గించటం... ఇళ్లలో ఉన్న బంగారాన్ని వ్యవస్థలోకి తీసుకురావటం. ఈ లక్ష్యాలు ఎంతవరకూ నెరవేరతాయనేది పక్కనబెడితే... అసలు ఈ పథకాలు ఎవరికి పనికొస్తాయి? లాభమెంత? ఇవన్నీ తెలియజేస్తున్నదే ఫైనాన్షియల్ ప్లానర్ ‘అనిల్ రెగో’ చేస్తున్న ఈ విశ్లేషణ.
 
* అందుబాటులోకి కొత్త బంగారు పథకాలు   
* పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసేవారికి గోల్డ్ బాండ్లు
* ఇంట్లో భారీ బంగారం ఉన్నవారికి డిపాజిట్ స్కీమ్  
* చిన్న మదుపరులకు ఈటీఎఫ్, గోల్డ్ ఫండ్లే బెటర్
* కావాలనుకుంటే కొనుక్కోవటానికి నాణేలు కూడా
 
కొత్త కొత్తగా గోల్డ్ బాండ్లు...
గోల్డ్ బాండ్లను జారీ చేయటం భారతదేశంలో ఇదే తొలిసారి. ఇది పరిమిత కాల పథకం. అంటే ఈ నెల 5న ఆరంభమైంది. 20వ తేదీ వరకూ మాత్రమే ఉంటుంది. అంటే ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నవారు 20వ తేదీలోగా చేయాల్సి ఉంటుంది. రిజర్వు బ్యాంకు జారీ చేస్తున్న ఈ బాండ్లపై ఏడాదికి 2.75 శాతం వడ్డీ ఉంటుంది. బాండ్లకు, ఈ వడ్డీకి ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది.

గ్రాము విలువను ప్రభుత్వం రూ.2,684గా నిర్ణయించింది. అంటే బాండ్లు ఎవరు కొన్నా ఈ ధరకే కొనాల్సి ఉంటుంది. కనీసం రెండు గ్రాముల్ని, గరిష్ఠంగా 500 గ్రాముల్ని కొనుగోలు చేయొచ్చు. దీని కాలపరిమితి ఎనిమిదేళ్లు. ఎనిమిదేళ్ల తరవాత వీటిని నగదుగా మార్చుకోవచ్చు. అయితే ఐదేళ్ల తరవాత ఎప్పుడైనా నగదుగా మార్చుకునే అవకాశాన్ని కూడా కల్పించారు.

సరెండర్ చేసేటపుడు అప్పటి బంగారం విలువను బట్టి మీకు నగదు చెల్లిస్తారు. వీటిని స్టాక్ మార్కెట్లో కూడా లిస్ట్ చేస్తారు. కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టాక్ మార్కెట్లోని ధరకు విక్రయించి ఎగ్జిట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీనికి అదనపు ఆకర్షణేమిటంటే వడ్డీ. ఈ బాండ్లపై  ఏడాదికి 2.75 శాతం వడ్డీని ఆర్‌బీఐ ఆఫర్ చేస్తోంది. దీర్ఘకాల ఆదాయం కనక ఈ వడ్డీకి క్యాపిటల్ గెయిన్స్ కూడా వర్తించవు. అవసరమైనపుడు ఈ బాండ్లను తనఖా పెట్టి రుణం కూడా తీసుకోవచ్చు.
 
ఎక్కడ కొనుగోలు చేయాలి?
షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల వద్ద గోల్డ్ బాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఏజెంట్లకు కూడా దరఖాస్తులు తీసుకుని బ్యాంకుల్లో అందజేయటానికి అనుమతి ఉంది.
 
ఎవరికి లాభం?
వడ్డీ కూడా వస్తుంది కనక... బంగారంలో ఇన్వెస్ట్ చేద్దామనుకున్నవారు నేరుగా బం గారం కొనకుండా ఈ బాండ్లు కొనవచ్చు. వీటిని పేపర్ రూపంలోను, డీమ్యాట్ రూపంలోను కూడా కొనుగోలు చేయొచ్చు. ఈ రకంగా కొనుగోలు చేసినపుడు దీన్ని దాచుకోవటం చాలా ఈజీ. పెపైచ్చు తరుగులాంటి సమస్యలు లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించి నగదు చేసుకోవచ్చు.
 
నష్టాలున్నాయా?
బాండ్లతో నష్టాలున్నాయని చెప్పలేం. అయితే బంగారం ధరలోని హెచ్చుతగ్గులు మీ ఇన్వెస్ట్‌మెంట్‌ను కూడా ప్రభావితం చేస్తాయని తెలుసుకోవాలి. ఎందుకంటే దీన్లో ఒకేసారి పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తరవాత బంగారం ధర తగ్గితే మీ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం కూడా తగ్గుతుంది. ఉదాహరణకు ప్రభుత్వం ఈ స్కీమను ప్రకటించినపుడు... అప్పటి ధరను పరిగణనలోకి తీసుకుని గ్రాము ధరను రూ.2,684గా నిర్ణయించింది.

కాకపోతే నవంబరు 5న ఈ స్కీమ్ ఆరంభించేనాడు ముంబై బులియన్ మార్కెట్లో గ్రాము ధర రూ.26,025గా ఉంది. అంటే దాదాపు 660 రూపాయలు తగ్గినట్లు. ఇది 2.75 శాతానికన్నా ఎక్కువే. అంటే తొలి ఏడాది ఇస్తామన్న వడ్డీ ఈ రకంగా పోయినట్లన్న మాట. ఇలాంటి రిస్కులుంటాయని గమనించాలి.
 
గోల్డ్ ఈటీఎఫ్‌లు/ మ్యూచ్‌వల్ ఫండ్లు
ఇవేవీ కొత్తగా ఆరంభించినవి కావు. కాకపోతే బంగారంలో మదుపు చేసే పథకాల గురించి తెలుసుకుంటున్నాం కనక గోల్డ్ ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్‌లు), గోల్డ్ మ్యూచ్‌వల్ ఫండ్ల (ఎంఎఫ్‌లు) గురించి కూడా తెలుసుకోవాలి. గోల్డ్ ఈటీఎఫ్‌లంటే బంగారం ధరను బట్టి ఆ ధరకే ఎక్స్ఛేంజీల్లో ట్రేడయ్యే ఫండ్లన్న మాట.

షేర్ల మాదిరే వీటిని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయటం, విక్రయించటం చేయొచ్చు. దీన్లో కనీస పెట్టుబడి రూ.5వేలు. డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. అయితే దీన్లో సిప్ పద్ధతిలో ఇన్వెస్ట్‌మెంట్ కుదరదు. ప్రస్తుతం 13 సంస్థల వరకూ ఈటీఎఫ్‌లను ఆఫర్ చేస్తున్నాయి. అదే గోల్డ్ మ్యూచ్‌వల్ ఫండ్లకైతే డీమ్యాట్ ఖాతా అవసరం లేదు. నెలకు రూ.500 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సిప్ పద్ధతిలో కూడా పెట్టుబడులు పెట్టొచ్చు.
 
గోల్డ్ డిపాజిట్ స్కీమ్..
ప్రభుత్వం దీన్ని గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌గా పిలుస్తోంది. అంటే బంగారాన్ని డబ్బు చేసుకునే పథకమన్నమాట. దీనిప్రకారం మన దగ్గరున్న బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆభరణాల్ని డిపాజిట్ చేస్తే అక్కడ రాళ్లు, ఇతరత్రా తరుగు తీసేసి, దాన్ని కరిగించి నిపుణులు దాని బరువెంతో లెక్కిస్తారు.

ఒకవేళ బంగారు నాణేలు, బార్లు డిపాజిట్ చేస్తే వాటి బరువును అక్కడే చెబుతారు. ఆ బరువును పేర్కొంటూ మీకొక సర్టిఫికెట్ ఇస్తారు. మీరు వెనక్కి తీసుకునేటపుడు ఆ సర్టిఫికెట్‌ను అందజేస్తే దాన్లో పేర్కొన్న బరువు గల బంగారాన్ని మీకిస్తారు. అంతేతప్ప మీ ఆభరణాలను తిరిగివ్వరు. అదనపు ఆకర్షణేంటంటే దీనిపై వడ్డీ కూడా ఇస్తున్నారు.

ఈ వడ్డీ 2.25 శాతం నుంచి 2.5 శాతం వరకూ ఉంటుంది. నిజానికిదేమీ తొలిసారి అందిస్తున్న పథకం కాదు. చాలా కాలం కిందటే ఎస్‌బీఐ ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. కనీసం 30 గ్రాముల బంగారం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా ఎంత బంగారాన్నయినా డిపాజిట్ చేయొచ్చు. దీనికి పరిమితి లేదు. 1999 నాటి గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ప్రకారం ఇన్వెస్టర్లకు క్యాపిటల్ గెయిన్స్ నుంచి మినహాయింపునిచ్చారు. ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌లో కూడా ఇలాంటి మినహాయింపులు ఉంటాయనే భావిస్తున్నారు.
 
ఎవరికి లాభం?
ఆభరణాల రూపంలో కాకుండా బార్ల రూపంలోనో, నాణేల రూపంలోనో ఇంట్లో బంగారం ఉన్నవారికి ఇలాంటి పథకాలు లాభదాయకమే. ఎందుకంటే ఇంట్లో ఉంటే దాన్ని భద్రంగా దాచుకోవటం కూడా సమస్యే. అదే బ్యాంకులో అయితే భద్రత సమస్య ఉండదు. పెపైచ్చు ఇంట్లో ఉంటే ఎలాంటి ఆదాయమూ రాదు. బ్యాంకులో ఉంటే ఏటా వడ్డీ కూడా వస్తుంది. బ్యాంకులో కనక ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసుకోవచ్చు.
 
నష్టాలు ఉన్నాయా?
బంగారం ఉన్నవారు డిపాజిట్ చేస్తే మంచిది తప్ప బంగారంలో ఇన్వెస్ట్ చేద్దామనుకున్న వారు దాన్ని కొని డిపాజిట్ చేయటం సరికాదనే చెప్పాలి. ఎందుకంటే ఒకేసారి పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. తరవాత ధర తగ్గితే ఆ మేరకు నష్టపోవాల్సి ఉంటుందని గమనించాలి.

కేంద్రం తాజాగా అశోకచక్ర చిహ్నంతో బంగారు నాణేలను కూడా విడుదల చేసింది. ఎంఎంటీసీ ఔట్‌లెట్లలో ఇవి లభ్యమవుతాయి. నాణేలు కొనాలనుకున్నవారికి కేంద్రమే అందిస్తోంది కనక ఇవి ఉపయుక్తమని చెప్పాలి. వీటిని ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించినా ఏకమొత్తంలో మదుపు; ధర తగ్గితే రిస్కు ఉంటాయి.
 
ఎవరికి ఏ పథకం లాభం?
గోల్డ్ ఈటీఎఫ్/ గోల్డ్ మ్యూచ్‌వల్ ఫండ్స్  : ఒకేసారి పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసేవారికి,  రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేసేవారికి (సిప్)
 గోల్డ్ బాండు : ప్రభుత్వ మద్దతున్న పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి; భవిష్యత్తులో బంగారం కొనా లనుకున్నవారికి
 గోల్డ్ డిపాజిట్ పథకం : నేరుగా బంగారం ఉండి, దాన్ని అదే రూపంలో తమ వద్ద ఉంచుకోకూడదని భావించేవారికి
 
ఉదాహరణకు ఈ మూడు పథకాల్లో రూ.2.5 లక్షలు లేదా అంతకు సమానమైన బంగారాన్ని ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం...
 
ఈ పట్టిక చూస్తే ఈటీఎఫ్‌లు, గోల్డ్ ఎంఎఫ్‌లకన్నా గోల్డ్ డిపాజిట్ స్కీమ్, బాండ్లపైనే ఎక్కువ రాబడి వస్తున్నట్లు కనిపిస్తుంది. కారణం... వడ్డీ. అయితే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ పద్ధతిలో గోల్డ్ మ్యూచ్‌వల్ ఫండ్లు లేదా ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేసినపుడు మిగతా వాటికన్నా ఎక్కుకే రాబడి రావచ్చు. ఎందుకంటే ధరలు పెరిగినా, తగ్గినా ఆ ధరలకే యూనిట్లు లభిస్తాయి కనక సగటు ధర తక్కువే ఉంటుంది.

లాభమూ బాగానే ఉంటుంది. ఒకవేళ బంగారం ధరలు బాగా పడిపోయినా ఒకేసారి ఇన్వెస్ట్ చేసిన గోల్డ్ బాండ్లు, డిపాజిట్ స్కీమ్‌తో పోలిస్తే సిప్ పద్ధతిలో నష్టాలు పరిమితంగానే ఉంటాయి. అయితే పై స్కీముల్లో వడ్డీ రేట్లు కాస్త ఆకర్షణీయంగానే ఉన్నాయి. అందుకని బాగా డబ్బులుండి ఎక్కడో ఒకచోట ఇన్వెస్ట్ చేదాద్దమనుకున్న వారికి, ఇంట్లో ఆభరణాలు కాకుండా అదనపు బంగారం ఉన్నవారికి మాత్రం పై రెండు స్కీములూ ఆకర్షణీయమేనని చెప్పొచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement