Gold schemes
-
మరో గోల్డ్ స్కీమ్ స్కాం: యజమానుల అరెస్ట్
సాక్షి, ముంబై: బంగారు ఆభరణాల విక్రయాల ప్రమోషన్ల పేరుతో ఆభరణాల సంస్థలు తీసుకొస్తున్న గోల్డ్ స్కీమ్‌లు వినియోగదారులను నట్టేట ముంచుతున్నాయి. ఇటీవల ముంబైలో కోట్లాది రూపాయల మేర వినియోగదారులను ముంచేసిన గుడ్విన్ స్కాం వెలుగులోకి వచ్చిన కొద్ది రోజులకే రసిక్లాల్ సంకల్‌చాంద్ జ్యువెల్లరీ (ఆర్ఎస్జే) అనే మరో జ్యువెల్లరీ సంస్థ కుంభకోణం బహిర్గతమైంది. దీంతో భారీగా నష్టపోయిన కస్టమర్లు లబోదిబో మంటూ స్థానిక పోలీస్ స్టేషన్‌కు క్యూ కట్టారు. గుడ్విన్ తరహాలోనే గత నెల (అక్టోబర్) 28న ఆర్ఎస్జే దుకాణాలను తాళాలు వేయడంతో వినియోగదారులు పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా తాజాగా ఆర్ఎస్జే దుకాణం యజమానులు జయేష్ రసిక్లాల్ షా(55), నీలేష్ రసిక్లాల్ షా (53)ను ముంబై ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) అరెస్టు చేసింది. మొత్తం రూ.300 కోట్ల వరకు వినియోగదారులను మోసగించినట్టుగా ప్రాథమికంగా తేలిందని పోలీసు అధికారి మంగళవారం చెప్పారు. ఫిర్యాదు చేస్తున్న ఆర్ఎస్జె ఉద్యోగులు డిపాజిట్ పథకాలపై వినియోగదారులకు మంచి రాబడిని వస్తుందని నమ్మబలకడంతో చాలామంది అనేక నెలలుగా ఈ గోల్డ్ స్కీంలలో పెద్ద మొత్తంలో డబ్బును పెట్టుబడి పెట్టారని తెలిపారు. నిందితులపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 420 (మోసం), 406 (క్రిమినల్ ట్రస్ట్ ఉల్లంఘన), మహారాష్ట్ర ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటరెస్ట్ ఆఫ్ డిపాజిటర్స్ (ఎంపిఐడి) చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. అలాగే గత వారం కొంతమంది ఉద్యోగులు కూడా సంస్థ తమకు ఆరు నెలలుగా వేతనాలివ్వడలేదని లేబర్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారని, దర్యాప్తు కొనసాగుతోందన్నారు. -
గోల్డ్ ఫండ్స్.. ఇప్పుడొద్దు!
శ్రీధర్‌కు ఈ మధ్యే పెళ్లి కుదిరింది. అవసరం కాబట్టి కొంత బంగారాన్ని కొనాలనుకున్నాడు. బంగారం ధరలు కూడా కొంచెం తగ్గాయి కదా!! కొనుగోలుకు ఇదే మంచి సమయమనుకున్నాడు. కాకపోతే అదే సమయంలో పేపర్లో ఓ వార్త చదివాడు. బంగారం ధరలు మరింత తగ్గుతాయన్నది ఆ వార్త సారాంశం. దీంతో శ్రీధర్ సందిగ్ధంలో పడ్డాడు. బంగారంపై ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దామా? వద్దా? అనే విషయమై ఒక నిర్ణయానికి రాలేకపోయాడు. చివరికి ఈ వ్యవహారాల్లో అనుభవం ఉన్న స్నేహితుడితో విషయం చెప్పగా... ‘‘బంగారాన్ని భౌతికంగా కొనటమే కాదు! గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఫండ్ ఆఫ్ ఫండ్స్, బంగారం బాండ్లు వంటి సాధనాల ద్వారా కూడా కొనుగోలు చేయొచ్చు’’ అని చెప్పాడాయన. కాకపోతే పేపర్ గోల్డ్ పథకాలుగా కూడా పిలిచే గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్‌లు) కొన్నాళ్ల కిందటివరకూ బాగా ప్రాచుర్యం పొందాయని, ఇపుడు మాత్రం చాలామంది వాటికి దూరంగా ఉంటున్నారని కూడా చెప్పాడు. ఆ వివరాలే ఈ ప్రత్యేక కథనం... ఏడాది కాలంలో2-8% మేర తగ్గిన రాబడి ⇒ బంగారం ధరలు పడితే పరిస్థితి మరింత దారుణం! ⇒ 2013 నుంచి సగానికి క్షీణించిన ఈటీఎఫ్ నిర్వహణ విలువ ⇒ రెండేళ్లలో ఈటీఎఫ్‌ల నుంచి రూ.3,900 కోట్ల ఉపసంహరణ ⇒ కొన్నాళ్లపాటు బంగారానికి దూరంగా ఉండమంటున్న నిపుణులు తగ్గిన గోల్డ్ ఈటీఎఫ్‌ల రాబడి గోల్డ్ ఈటీఎఫ్‌లు బాగా ప్రాచుర్యం పొందటానికి కారణం బంగారం ధరలే. ఈ ధరలు ఎగిసే కొద్దీ గోల్డ్ ఈటీఎఫ్‌ల డిమాండ్ పెరుగుతుంది. కానీ కొంతకాలంగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన ఏడాది కాలంలో గోల్డ్ ఈటీఎఫ్‌ల రాబడి దాదాపు 2-8 శాతం మేర తగ్గింది. దీంతో అందులో ఇన్వెస్ట్ చేసిన చాలా మందికి చక్కని రాబడి రాలేదు. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు వారి డబ్బులను గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి విత్‌డ్రా చేసుకుంటున్నారు. మ్యూచ్‌వల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) గణాంకాల ప్రకారం.. ఇన్వెస్టర్లు గడిచిన రెండేళ్లలో మొత్తంగా రూ.3,900 కోట్లను విత్‌డ్రా చేసుకున్నారు. దీనిపై సీఎల్ఎస్ఏ చీఫ్ స్ట్రాటజిస్ట్, మేనేజింగ్ డెరైక్టర్ క్రిస్ వుడ్ మాట్లాడుతూ... ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచిన నేపథ్యంలో ఔన్స్ బంగారం ధర 1,000 డాలర్ల దిగువకు వస్తుందన్నారు. ఒకవేళ బంగారం ధర తగ్గితే గోల్డ్ ఈటీఎఫ్ రాబడి కూడా తగ్గుతుంది. ఈటీఎఫ్‌లలో ఆగని ఉపసంహరణ ... గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి తరలివెళ్లే పెట్టుబడుల ఉపసంహరణకు అడ్డుకట్ట పడటం లేదు. పెట్టుబడుల ఉపసంహరణ వరుసగా 28 నెలలుగా కొనసాగుతోంది. గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి ఇన్వెస్టర్లు నికరంగా 2013-14లో రూ.2,293 కోట్లను, 2014-15లో రూ.1,475 కోట్లను, ఈ ఏడాది జవనరి-నవంబర్ వరకూ రూ.845 కోట్లను ఉపసంహరించుకున్నారు. దీంతో గోల్డ్ ఈటీఎఫ్‌ల మొత్తం నిర్వహణ విలువ మే నెలలో రూ.6,688 కోట్లకు, ఆగస్ట్‌లో రూ.6,226 కోట్లకు, నవంబర్‌లో రూ.5,830 కోట్లకు పడిపోయింది. 2007 మార్చిలో గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణ విలువ (ఏయూఎం) రూ.96 కోట్లుగా ఉంది. అలా అలా పెరుగుతూ... 2013 మార్చిలో గరిష్టంగా రూ.11,648 కోట్లకు చేరింది. అప్పటి నుంచి ఉపసంహరణల దెబ్బకు తగ్గటం మొదలైంది. అప్పటి నుంచి చూస్తే సగం మేర తగ్గిపోయింది. ఆకర్షణ తగ్గిందెందుకు? గోల్డ్ ఈటీఎఫ్‌లకు ఇన్వెస్టర్లు దూరమవుతుండటానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటేమో ఈక్విటీ మార్కెట్ మంచి రాబడిని అందిస్తుండటం. ఎందుకంటే గడిచిన రెండేళ్లలో బీఎస్ఈ ఇండెక్స్ 5 శాతంమేర బలపడింది. రెండవదేమో బంగారం ధరల్లో తీవ్ర ఒడిదుడుకులుండటం. పెపైచ్చు ఈ ఏడాది కూడా బంగారం ధరలు అంత ఆశాజనకంగా ఉండవనేది మార్కెట్ నిపుణుల మాట. ఫెడ్ వడ్డీ రేట్లు పెరిగితే బంగారం ధరలు తగ్గుతాయని ఇన్వెస్టర్లు కూడా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ సంస్థ... ఫెడ్ వడ్డీ రేట్లను పెంచితే 10 గ్రాముల బంగారం ధర దేశీయంగా రూ.20,000-రూ.24,000కు తగ్గే అవకాశముందని అంచనా వేసింది. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పాటు... యూకేలో యూరో రెఫరెండమ్, చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం వంటి పలు అంశాల వల్ల కూడా బంగారం, వెండి ధరలు కొత్త సవాళ్లను ఎదుర్కొంటాయనేది నిపుణుల అంచనా. అంతర్జాతీయంగా అగ్రస్థానంలో ఉన్న 8 గోల్డ్ ఈటీఎఫ్‌ల పెట్టుబడులు కూడా మే నెలలో ఐదేళ్ల కనిష్ట స్థాయికి చేరటం గమనార్హం. దూరంగా ఉండటమే బెటర్! ఇన్వెస్ట్మెంట్లు, రాబడి పరంగా చూస్తే గోల్డ్ ఈటీఎఫ్‌ల పనితీరు బాగులేదు. ఈ ఏడాది భవిష్యత్తు కూడా ఆశాజనకంగా లేదు కనక బంగారం సంబంధిత ఇన్వెస్ట్మెంట్లకు దూరంగా ఉండటం మంచిదంటున్నారు నిపుణులు. ఇటీవల ప్రారంభించిన గోల్డ్ బాండ్ల పథకం కూడా గోల్డ్ ఈటీఎఫ్‌కు పోటీ అయింది. గోల్డ్ బాండ్స్‌కు ప్రభుత్వం 2.75% వార్షిక వడ్డీని అందిస్తోంది. ఈ సౌకర్యం ఈటీఎఫ్‌ల లో లేదు. మార్కెట్లను బట్టి ఈటీఎఫ్ ధర నిర్ణయం జరుగుతుంది. గోల్డ్ బాండ్స్ కొన్నాక బంగారం ధర పెరిగితే గోల్డ్ బాండ్ల ధర కూడా పెరుగుతుంది. డీ మ్యాట్ రూపంలో గోల్డ్ బాండ్లను కొనొచ్చు. బాండ్లపై రుణమూ తెచ్చుకోవచ్చు. ఒడిదుడుకుల్లో బంగారం ధర బంగారం ధరల పతనం 2013 నుంచి కొనసాగుతోంది. ఏడాది ప్రారంభంలో రూ.28,000 మైలురాయిని తాకిన బంగారం ధర... జనవరి మధ్యలో రూ.28,215 స్థాయిక్కూడా చేరింది. అంతర్జాతీయ పరిణామాలు, వినియోగపు భయాల నేపథ్యంలో జులైలో రూ.24,590 వద్దకు పతనమైంది. ఇది 2011 తరవాత కనిష్ఠ స్థాయి. 2013 ఆగస్ట్ 28 నాటి ఆల్‌టైం గరిష్ట స్థాయి ధర రూ.33,790తో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధర 25 శాతం దిగువన ఉంది. ప్రస్తుతం రూ.25,000 శ్రేణిలో కదలాడుతోంది. -
పసిడి బాండ్లు @ 246 కోట్లు!
బాండ్లు ఓకే... డిపాజిట్లే నిరుత్సాహం * తాజా పసిడి పథకాలపై ప్రభుత్వం అభిప్రాయం * డిపాజిట్ల మెరుగుకు మరిన్ని చొరవలు న్యూఢిల్లీ: ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించిన పసిడి పథకాల విషయంలో... బాండ్లకు మంచి స్పందన లభించినట్లు ఆర్థికశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే డిపాజిట్ల పథకం నిరుత్సాహకరంగా ఉన్నట్లు అభిప్రాయపడింది. నవంబర్ 5 నుంచి 20 వతేదీ మధ్య తొలి దశ గోల్డ్ బాండ్ స్కీమ్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. ఆర్థికశాఖ విడుదల చేసిన ప్రకటనలో ముఖ్యాంశాలు చూస్తే... గోల్డ్ బాండ్ల కోసం రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 63,000 దరఖాస్తులు అందాయి. విలువ రూపంలో రూ. 246 కోట్లు. ఇది చక్కటి స్పందన అని ఆర్థిక శాఖ తెలిపింది. బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా దాదాపు 917 కేజీల పరిమాణంగల బంగారం బాండ్లకు డిమాండ్ వచ్చినట్లు పేర్కొంది. గోల్డ్ డిపాజిట్ స్కీమ్ విషయానికి వస్తే... స్పందన నామమాత్రంగా ఉంది. ఈ స్కీమ్ కింద ఆదాయపు పన్ను, కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మినహాయింపులు ఉన్నాయి. స్పందన మరింత పెరగడానికి ఏడు కీలక నిర్ణయాలను కూడా ప్రభుత్వం తీసుకుంది. సేకరణ, స్వచ్ఛత పరిశీలన కేంద్రాలతో సంబంధం లేకుండా... బ్యాంకులకు ఆమోదయోగ్యమైన రిఫైనర్‌కు బంగారాన్ని ప్రత్యక్షంగా ఇచ్చి, ప్యూరిటీ సర్టిఫికేట్ పొందవచ్చన్న నిర్ణయం ఇందులో ప్రధానమైనది. అవిభాజ్య కుటుంబాలు, సంస్థల విషయంలో బల్క్ డిపాజిట్లకు ఈ చొరవ దోహదపడుతుందన్నది ప్రభుత్వ భావన. ముద్రణ, సోషల్ మీడియా, రేడియో, టెలివిజన్ విభాగాల ద్వారా ప్రజల్లో డిపాజిట్ పథకం పట్ల మరింత విస్తృత కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. రిఫైనరీల లెసైన్సింగ్ అంశాలను మరింత సరళతరంగా, పటిష్టంగా మలచాలని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గోల్డ్ రిఫైనరీల లెసైన్సుల సంఖ్య దాదాపు 20కి చేరే అవకాశం ఉంది. పథకానికి సంబంధించి పసిడి సేకరణ, స్వచ్ఛత పరిశీలన సెంటర్ల నిర్వహణకు లెసైన్సులు ఉన్న 13,000 మంది ఆభరణాల వర్తకుల నుంచి దరఖాస్తులను బీఐఎస్ ఆహ్వానించింది. ఈ ఏడాది చివరికల్లా వీరిలో 55 మందిని రిజిస్టర్ చేసుకునే వీలుంది. బీఐఎస్, ప్యూరిటీ సెంటర్లు అన్నీ అనుసంధానించడం ద్వారా డిపాజిట్ల స్కీమ్‌కు మరింత ప్రోత్సాహానికి కృషి. * ప్రస్తుతం స్కీమ్ కింద 33 సీపీటీసీలు, అయిదు గోల్డ్ రిఫైనరీలు నోటిఫై అయ్యాయి. * టెస్టింగ్, రవాణా, రిఫైనింగ్, సీపీటీసీ, రిఫైనరీల్లో నిల్వ సేవల విషయంలో అయ్యే వ్యయాలకు సంబంధించి బ్యాంకులకు చెల్లించే ఫీజులను తిరిగి చెల్లించేయడం జరుగుతుంది. * దేశంలో దాదాపు రూ.52 లక్షల కోట్ల విలువైన 20,000 టన్నుల పసిడి బీరువాలకు పరిమితమవుతోందన్న అంచనాలు ఉంటే... గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా నవంబర్ 18 నాటికి కేవలం 400 గ్రాముల పసిడి డిపాజిట్ అయిన సంగతి తెలిసిందే. * సంబంధిత వర్గాల అభిప్రాయాలకు అనుగుణంగా ఈ స్కీమ్‌లను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు, తగిన నిర్ణయాలు తీసుకుంటుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి రూ.489 కోట్లు అవుట్... ఎక్స్ఛేంజీల్లో ట్రేడయ్యే గోల్డ్ ఫండ్స్ (ఈటీఎఫ్)ల నుంచి నిధుల వరద కొనసాగుతోంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య దాదాపు రూ.489 కోట్లు గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి వెళ్లినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. అయితే గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇలా వెళ్లిన మొత్తం రూ.1,016 కోట్లు కావడం గమనార్హం. 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా ఈటీఎఫ్‌ల నుంచి రూ. 2,293 కోట్లు, రూ.1,475 కోట్లు మళ్లాయి. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలలతో పోల్చితే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏడు నెలల్లో ఈటీఎఫ్‌ల నుంచి మళ్లిన మొత్తాలు తక్కువగా ఉండడానికి... ఈక్విటీ మార్కెట్ల బలహీనత కూడా కొంత కారణమని సంబంధిత వర్గాలు అంచనావేస్తున్నాయి. కాగా మార్చి నాటికి ఈటీఎఫ్ నిర్వహణ విలువ రూ.6,655 కోట్లు కాగా, ఈ పరిమాణం ఆగస్టు నాటికి రూ.6,226 కోట్లకు తగ్గింది. 2006-07 ఆర్థిక సంవత్సరం నుంచీ మార్కెట్లో పలు మ్యూచువల్ ఫండ్ గోల్డ్ స్కీమ్‌లు ఉన్నాయి. 14 గోల్డ్ ఆధారిత స్కీమ్‌లు ప్రస్తుతం ఉన్నాయి. -
ఈ గోల్డెన్ ఛాన్స్ ఎవరికి?
బంగారంతో మనది విడ దీయరాని బంధం. అందుకేనేమో! వినియోగంలో చైనానూ మించిపోయారు మనవాళ్లు. కాకపోతే ఇక్కడో చిక్కుంది. బంగారాన్ని విపరీతంగా దిగుమతి చేసుకుంటుండటంతో భారీ విదేశీ మారకద్రవ్యాన్ని చెల్లించాల్సి వస్తోంది. పెపైచ్చు దేశాభివృద్ధికి ఈ బంగారం పెద్దగా ఉపయోగపడటం లేదు. అందుకే ప్రభుత్వం మూడు పథకాలను ప్రకటించింది. ఒకటి బంగారం బాండ్లు. రెండు నాణేలు. మూడు బంగారం డిపాజిట్. ఈ మూడింటి లక్ష్యం ఒక్కటే. బంగారం కొనుగోలు చేయాలన్న భారతీయుల సెంటిమెంట్‌ను గౌరవిస్తూనే... అందుకోసం వెచ్చించే డబ్బు దేశాభివృద్ధికి ఉపయోగపడేలా చూడటం... విపరీతంగా పెరిగిపోతున్న బంగారం దిగుమతులను సాధ్యమైనంత తగ్గించటం... ఇళ్లలో ఉన్న బంగారాన్ని వ్యవస్థలోకి తీసుకురావటం. ఈ లక్ష్యాలు ఎంతవరకూ నెరవేరతాయనేది పక్కనబెడితే... అసలు ఈ పథకాలు ఎవరికి పనికొస్తాయి? లాభమెంత? ఇవన్నీ తెలియజేస్తున్నదే ఫైనాన్షియల్ ప్లానర్ ‘అనిల్ రెగో’ చేస్తున్న ఈ విశ్లేషణ. * అందుబాటులోకి కొత్త బంగారు పథకాలు * పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసేవారికి గోల్డ్ బాండ్లు * ఇంట్లో భారీ బంగారం ఉన్నవారికి డిపాజిట్ స్కీమ్ * చిన్న మదుపరులకు ఈటీఎఫ్, గోల్డ్ ఫండ్లే బెటర్ * కావాలనుకుంటే కొనుక్కోవటానికి నాణేలు కూడా కొత్త కొత్తగా గోల్డ్ బాండ్లు... గోల్డ్ బాండ్లను జారీ చేయటం భారతదేశంలో ఇదే తొలిసారి. ఇది పరిమిత కాల పథకం. అంటే ఈ నెల 5న ఆరంభమైంది. 20వ తేదీ వరకూ మాత్రమే ఉంటుంది. అంటే ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నవారు 20వ తేదీలోగా చేయాల్సి ఉంటుంది. రిజర్వు బ్యాంకు జారీ చేస్తున్న ఈ బాండ్లపై ఏడాదికి 2.75 శాతం వడ్డీ ఉంటుంది. బాండ్లకు, ఈ వడ్డీకి ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది. గ్రాము విలువను ప్రభుత్వం రూ.2,684గా నిర్ణయించింది. అంటే బాండ్లు ఎవరు కొన్నా ఈ ధరకే కొనాల్సి ఉంటుంది. కనీసం రెండు గ్రాముల్ని, గరిష్ఠంగా 500 గ్రాముల్ని కొనుగోలు చేయొచ్చు. దీని కాలపరిమితి ఎనిమిదేళ్లు. ఎనిమిదేళ్ల తరవాత వీటిని నగదుగా మార్చుకోవచ్చు. అయితే ఐదేళ్ల తరవాత ఎప్పుడైనా నగదుగా మార్చుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. సరెండర్ చేసేటపుడు అప్పటి బంగారం విలువను బట్టి మీకు నగదు చెల్లిస్తారు. వీటిని స్టాక్ మార్కెట్లో కూడా లిస్ట్ చేస్తారు. కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టాక్ మార్కెట్లోని ధరకు విక్రయించి ఎగ్జిట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీనికి అదనపు ఆకర్షణేమిటంటే వడ్డీ. ఈ బాండ్లపై ఏడాదికి 2.75 శాతం వడ్డీని ఆర్బీఐ ఆఫర్ చేస్తోంది. దీర్ఘకాల ఆదాయం కనక ఈ వడ్డీకి క్యాపిటల్ గెయిన్స్ కూడా వర్తించవు. అవసరమైనపుడు ఈ బాండ్లను తనఖా పెట్టి రుణం కూడా తీసుకోవచ్చు. ఎక్కడ కొనుగోలు చేయాలి? షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల వద్ద గోల్డ్ బాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఏజెంట్లకు కూడా దరఖాస్తులు తీసుకుని బ్యాంకుల్లో అందజేయటానికి అనుమతి ఉంది. ఎవరికి లాభం? వడ్డీ కూడా వస్తుంది కనక... బంగారంలో ఇన్వెస్ట్ చేద్దామనుకున్నవారు నేరుగా బం గారం కొనకుండా ఈ బాండ్లు కొనవచ్చు. వీటిని పేపర్ రూపంలోను, డీమ్యాట్ రూపంలోను కూడా కొనుగోలు చేయొచ్చు. ఈ రకంగా కొనుగోలు చేసినపుడు దీన్ని దాచుకోవటం చాలా ఈజీ. పెపైచ్చు తరుగులాంటి సమస్యలు లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించి నగదు చేసుకోవచ్చు. నష్టాలున్నాయా? బాండ్లతో నష్టాలున్నాయని చెప్పలేం. అయితే బంగారం ధరలోని హెచ్చుతగ్గులు మీ ఇన్వెస్ట్‌మెంట్‌ను కూడా ప్రభావితం చేస్తాయని తెలుసుకోవాలి. ఎందుకంటే దీన్లో ఒకేసారి పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తరవాత బంగారం ధర తగ్గితే మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా తగ్గుతుంది. ఉదాహరణకు ప్రభుత్వం ఈ స్కీమను ప్రకటించినపుడు... అప్పటి ధరను పరిగణనలోకి తీసుకుని గ్రాము ధరను రూ.2,684గా నిర్ణయించింది. కాకపోతే నవంబరు 5న ఈ స్కీమ్ ఆరంభించేనాడు ముంబై బులియన్ మార్కెట్లో గ్రాము ధర రూ.26,025గా ఉంది. అంటే దాదాపు 660 రూపాయలు తగ్గినట్లు. ఇది 2.75 శాతానికన్నా ఎక్కువే. అంటే తొలి ఏడాది ఇస్తామన్న వడ్డీ ఈ రకంగా పోయినట్లన్న మాట. ఇలాంటి రిస్కులుంటాయని గమనించాలి. గోల్డ్ ఈటీఎఫ్‌లు/ మ్యూచ్‌వల్ ఫండ్లు ఇవేవీ కొత్తగా ఆరంభించినవి కావు. కాకపోతే బంగారంలో మదుపు చేసే పథకాల గురించి తెలుసుకుంటున్నాం కనక గోల్డ్ ఎక్స్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్‌లు), గోల్డ్ మ్యూచ్‌వల్ ఫండ్ల (ఎంఎఫ్‌లు) గురించి కూడా తెలుసుకోవాలి. గోల్డ్ ఈటీఎఫ్‌లంటే బంగారం ధరను బట్టి ఆ ధరకే ఎక్స్ఛేంజీల్లో ట్రేడయ్యే ఫండ్లన్న మాట. షేర్ల మాదిరే వీటిని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయటం, విక్రయించటం చేయొచ్చు. దీన్లో కనీస పెట్టుబడి రూ.5వేలు. డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. అయితే దీన్లో సిప్ పద్ధతిలో ఇన్వెస్ట్మెంట్ కుదరదు. ప్రస్తుతం 13 సంస్థల వరకూ ఈటీఎఫ్‌లను ఆఫర్ చేస్తున్నాయి. అదే గోల్డ్ మ్యూచ్‌వల్ ఫండ్లకైతే డీమ్యాట్ ఖాతా అవసరం లేదు. నెలకు రూ.500 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సిప్ పద్ధతిలో కూడా పెట్టుబడులు పెట్టొచ్చు. గోల్డ్ డిపాజిట్ స్కీమ్.. ప్రభుత్వం దీన్ని గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌గా పిలుస్తోంది. అంటే బంగారాన్ని డబ్బు చేసుకునే పథకమన్నమాట. దీనిప్రకారం మన దగ్గరున్న బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆభరణాల్ని డిపాజిట్ చేస్తే అక్కడ రాళ్లు, ఇతరత్రా తరుగు తీసేసి, దాన్ని కరిగించి నిపుణులు దాని బరువెంతో లెక్కిస్తారు. ఒకవేళ బంగారు నాణేలు, బార్లు డిపాజిట్ చేస్తే వాటి బరువును అక్కడే చెబుతారు. ఆ బరువును పేర్కొంటూ మీకొక సర్టిఫికెట్ ఇస్తారు. మీరు వెనక్కి తీసుకునేటపుడు ఆ సర్టిఫికెట్‌ను అందజేస్తే దాన్లో పేర్కొన్న బరువు గల బంగారాన్ని మీకిస్తారు. అంతేతప్ప మీ ఆభరణాలను తిరిగివ్వరు. అదనపు ఆకర్షణేంటంటే దీనిపై వడ్డీ కూడా ఇస్తున్నారు. ఈ వడ్డీ 2.25 శాతం నుంచి 2.5 శాతం వరకూ ఉంటుంది. నిజానికిదేమీ తొలిసారి అందిస్తున్న పథకం కాదు. చాలా కాలం కిందటే ఎస్బీఐ ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. కనీసం 30 గ్రాముల బంగారం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా ఎంత బంగారాన్నయినా డిపాజిట్ చేయొచ్చు. దీనికి పరిమితి లేదు. 1999 నాటి గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ప్రకారం ఇన్వెస్టర్లకు క్యాపిటల్ గెయిన్స్ నుంచి మినహాయింపునిచ్చారు. ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌లో కూడా ఇలాంటి మినహాయింపులు ఉంటాయనే భావిస్తున్నారు. ఎవరికి లాభం? ఆభరణాల రూపంలో కాకుండా బార్ల రూపంలోనో, నాణేల రూపంలోనో ఇంట్లో బంగారం ఉన్నవారికి ఇలాంటి పథకాలు లాభదాయకమే. ఎందుకంటే ఇంట్లో ఉంటే దాన్ని భద్రంగా దాచుకోవటం కూడా సమస్యే. అదే బ్యాంకులో అయితే భద్రత సమస్య ఉండదు. పెపైచ్చు ఇంట్లో ఉంటే ఎలాంటి ఆదాయమూ రాదు. బ్యాంకులో ఉంటే ఏటా వడ్డీ కూడా వస్తుంది. బ్యాంకులో కనక ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసుకోవచ్చు. నష్టాలు ఉన్నాయా? బంగారం ఉన్నవారు డిపాజిట్ చేస్తే మంచిది తప్ప బంగారంలో ఇన్వెస్ట్ చేద్దామనుకున్న వారు దాన్ని కొని డిపాజిట్ చేయటం సరికాదనే చెప్పాలి. ఎందుకంటే ఒకేసారి పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. తరవాత ధర తగ్గితే ఆ మేరకు నష్టపోవాల్సి ఉంటుందని గమనించాలి. కేంద్రం తాజాగా అశోకచక్ర చిహ్నంతో బంగారు నాణేలను కూడా విడుదల చేసింది. ఎంఎంటీసీ ఔట్లెట్లలో ఇవి లభ్యమవుతాయి. నాణేలు కొనాలనుకున్నవారికి కేంద్రమే అందిస్తోంది కనక ఇవి ఉపయుక్తమని చెప్పాలి. వీటిని ఇన్వెస్ట్మెంట్గా భావించినా ఏకమొత్తంలో మదుపు; ధర తగ్గితే రిస్కు ఉంటాయి. ఎవరికి ఏ పథకం లాభం? గోల్డ్ ఈటీఎఫ్/ గోల్డ్ మ్యూచ్‌వల్ ఫండ్స్ : ఒకేసారి పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసేవారికి, రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేసేవారికి (సిప్) గోల్డ్ బాండు : ప్రభుత్వ మద్దతున్న పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి; భవిష్యత్తులో బంగారం కొనా లనుకున్నవారికి గోల్డ్ డిపాజిట్ పథకం : నేరుగా బంగారం ఉండి, దాన్ని అదే రూపంలో తమ వద్ద ఉంచుకోకూడదని భావించేవారికి ఉదాహరణకు ఈ మూడు పథకాల్లో రూ.2.5 లక్షలు లేదా అంతకు సమానమైన బంగారాన్ని ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం... ఈ పట్టిక చూస్తే ఈటీఎఫ్‌లు, గోల్డ్ ఎంఎఫ్‌లకన్నా గోల్డ్ డిపాజిట్ స్కీమ్, బాండ్లపైనే ఎక్కువ రాబడి వస్తున్నట్లు కనిపిస్తుంది. కారణం... వడ్డీ. అయితే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో గోల్డ్ మ్యూచ్‌వల్ ఫండ్లు లేదా ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేసినపుడు మిగతా వాటికన్నా ఎక్కుకే రాబడి రావచ్చు. ఎందుకంటే ధరలు పెరిగినా, తగ్గినా ఆ ధరలకే యూనిట్లు లభిస్తాయి కనక సగటు ధర తక్కువే ఉంటుంది. లాభమూ బాగానే ఉంటుంది. ఒకవేళ బంగారం ధరలు బాగా పడిపోయినా ఒకేసారి ఇన్వెస్ట్ చేసిన గోల్డ్ బాండ్లు, డిపాజిట్ స్కీమ్‌తో పోలిస్తే సిప్ పద్ధతిలో నష్టాలు పరిమితంగానే ఉంటాయి. అయితే పై స్కీముల్లో వడ్డీ రేట్లు కాస్త ఆకర్షణీయంగానే ఉన్నాయి. అందుకని బాగా డబ్బులుండి ఎక్కడో ఒకచోట ఇన్వెస్ట్ చేదాద్దమనుకున్న వారికి, ఇంట్లో ఆభరణాలు కాకుండా అదనపు బంగారం ఉన్నవారికి మాత్రం పై రెండు స్కీములూ ఆకర్షణీయమేనని చెప్పొచ్చు.