పసిడి బాండ్లు @ 246 కోట్లు! | Gold bands @ 246 crores! | Sakshi
Sakshi News home page

పసిడి బాండ్లు @ 246 కోట్లు!

Published Sat, Nov 28 2015 12:23 AM | Last Updated on Sun, Sep 3 2017 1:07 PM

పసిడి బాండ్లు @ 246 కోట్లు!

పసిడి బాండ్లు @ 246 కోట్లు!

బాండ్లు ఓకే... డిపాజిట్లే నిరుత్సాహం
* తాజా పసిడి పథకాలపై ప్రభుత్వం అభిప్రాయం
* డిపాజిట్ల మెరుగుకు మరిన్ని చొరవలు
న్యూఢిల్లీ: ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించిన పసిడి పథకాల విషయంలో... బాండ్లకు మంచి స్పందన లభించినట్లు ఆర్థికశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే డిపాజిట్ల పథకం నిరుత్సాహకరంగా ఉన్నట్లు అభిప్రాయపడింది. నవంబర్ 5 నుంచి 20  వతేదీ మధ్య తొలి దశ గోల్డ్ బాండ్ స్కీమ్ అమలు జరిగిన సంగతి తెలిసిందే.  ఆర్థికశాఖ విడుదల చేసిన ప్రకటనలో ముఖ్యాంశాలు చూస్తే...
     
గోల్డ్ బాండ్ల కోసం రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 63,000 దరఖాస్తులు అందాయి. విలువ రూపంలో రూ. 246 కోట్లు. ఇది చక్కటి స్పందన అని ఆర్థిక శాఖ తెలిపింది. బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా దాదాపు 917 కేజీల పరిమాణంగల బంగారం బాండ్లకు డిమాండ్ వచ్చినట్లు పేర్కొంది.
     
గోల్డ్ డిపాజిట్ స్కీమ్ విషయానికి వస్తే... స్పందన నామమాత్రంగా ఉంది. ఈ స్కీమ్ కింద ఆదాయపు పన్ను, కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మినహాయింపులు ఉన్నాయి. స్పందన మరింత పెరగడానికి ఏడు కీలక నిర్ణయాలను కూడా ప్రభుత్వం తీసుకుంది.   సేకరణ, స్వచ్ఛత పరిశీలన కేంద్రాలతో సంబంధం లేకుండా... బ్యాంకులకు ఆమోదయోగ్యమైన రిఫైనర్‌కు బంగారాన్ని ప్రత్యక్షంగా ఇచ్చి, ప్యూరిటీ సర్టిఫికేట్ పొందవచ్చన్న నిర్ణయం ఇందులో ప్రధానమైనది. అవిభాజ్య కుటుంబాలు, సంస్థల విషయంలో బల్క్ డిపాజిట్లకు ఈ చొరవ దోహదపడుతుందన్నది ప్రభుత్వ భావన.
     
ముద్రణ, సోషల్ మీడియా, రేడియో, టెలివిజన్ విభాగాల ద్వారా ప్రజల్లో డిపాజిట్ పథకం పట్ల మరింత విస్తృత కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు.
     
రిఫైనరీల లెసైన్సింగ్ అంశాలను మరింత సరళతరంగా, పటిష్టంగా మలచాలని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గోల్డ్ రిఫైనరీల లెసైన్సుల సంఖ్య దాదాపు 20కి చేరే అవకాశం ఉంది. పథకానికి సంబంధించి  పసిడి సేకరణ, స్వచ్ఛత పరిశీలన సెంటర్ల నిర్వహణకు లెసైన్సులు ఉన్న 13,000 మంది ఆభరణాల వర్తకుల నుంచి దరఖాస్తులను బీఐఎస్ ఆహ్వానించింది. ఈ ఏడాది చివరికల్లా వీరిలో 55 మందిని రిజిస్టర్ చేసుకునే వీలుంది. బీఐఎస్, ప్యూరిటీ సెంటర్లు అన్నీ అనుసంధానించడం ద్వారా డిపాజిట్ల స్కీమ్‌కు మరింత ప్రోత్సాహానికి కృషి.
* ప్రస్తుతం స్కీమ్ కింద 33 సీపీటీసీలు, అయిదు గోల్డ్ రిఫైనరీలు నోటిఫై అయ్యాయి.
* టెస్టింగ్, రవాణా, రిఫైనింగ్, సీపీటీసీ, రిఫైనరీల్లో నిల్వ సేవల విషయంలో అయ్యే వ్యయాలకు సంబంధించి బ్యాంకులకు చెల్లించే ఫీజులను తిరిగి చెల్లించేయడం జరుగుతుంది.
* దేశంలో దాదాపు రూ.52 లక్షల కోట్ల విలువైన 20,000 టన్నుల పసిడి బీరువాలకు పరిమితమవుతోందన్న అంచనాలు ఉంటే... గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా నవంబర్ 18 నాటికి కేవలం 400 గ్రాముల పసిడి డిపాజిట్ అయిన సంగతి తెలిసిందే.
* సంబంధిత వర్గాల అభిప్రాయాలకు అనుగుణంగా ఈ స్కీమ్‌లను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు, తగిన నిర్ణయాలు తీసుకుంటుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
 
గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి రూ.489 కోట్లు అవుట్...
ఎక్స్ఛేంజీల్లో ట్రేడయ్యే గోల్డ్ ఫండ్స్ (ఈటీఎఫ్)ల నుంచి నిధుల వరద కొనసాగుతోంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య దాదాపు రూ.489 కోట్లు గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి వెళ్లినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. అయితే గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇలా వెళ్లిన మొత్తం రూ.1,016 కోట్లు కావడం గమనార్హం. 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా ఈటీఎఫ్‌ల నుంచి రూ. 2,293 కోట్లు, రూ.1,475 కోట్లు మళ్లాయి.

గత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలలతో పోల్చితే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏడు నెలల్లో ఈటీఎఫ్‌ల నుంచి మళ్లిన మొత్తాలు తక్కువగా ఉండడానికి... ఈక్విటీ మార్కెట్ల బలహీనత కూడా కొంత కారణమని సంబంధిత వర్గాలు అంచనావేస్తున్నాయి. కాగా మార్చి నాటికి ఈటీఎఫ్ నిర్వహణ విలువ రూ.6,655 కోట్లు కాగా, ఈ పరిమాణం ఆగస్టు నాటికి రూ.6,226 కోట్లకు తగ్గింది. 2006-07 ఆర్థిక సంవత్సరం నుంచీ మార్కెట్‌లో పలు మ్యూచువల్ ఫండ్ గోల్డ్ స్కీమ్‌లు ఉన్నాయి. 14 గోల్డ్ ఆధారిత స్కీమ్‌లు ప్రస్తుతం ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement